
బన్యువాంగి: బుధవారం బాలి సముద్రంలో గల్లంతైన సబ్‌మెరైన్ మునిగిపోయిందని, అందులోని 53మంది సిబ్బంది మృతి చెందినట్లేనని ఇండోనేసియా నేవీ ప్రకటించింది. జలాంతర్గామి కోసం జరిపిన అన్వేషణలో సబ్‌మెరైన్ తాలుకా విడిభాగాలు లభ్యమయ్యాయని, దీన్నిబట్టి సబ్‌మెరైన్ మునిగిపోయి ఉంటుందని, శనివారం ఉదయం వరకే అందులోని ఆక్సీజన్ సరిపోతుందని, అందువల్ల దానిలోని సిబ్బంది బతికిబట్టకట్టే అవకాశమే లేదని భావిస్తున్నట్లు తెలిపింది.
జలాంతర్గామి గల్లంతైన ప్రాంతంలో చమురు తెట్టలు, ధ్వంసమైన భాగాలు లభించాయని, ఇవి జలాంతర్గామి మునకకు ప్రధాన సాక్ష్యాలని ఆ దేశ మిలటరీ చీఫ్ హది జజాంటో చెప్పారు. శనివారం ముందువరకు సబ్‌మెరైన్ గల్లంతైందని ఇండోనేసియా చెబుతూ వచ్చింది. సబ్‌మెరైన్ పేలితే ముక్కలై ఉండేదని, సోనార్‌లో తెలిసేదని, కానీ ఈ ప్రమాదంలో జలాంతర్గామి నీటి అడుగుకు పోతున్న కొద్దీ పగుళ్లు వచ్చాయని దీంతో నీళ్లు లోపలికి చేరి మునిగి ఉంటుందని నేవీ చీఫ్ యుడు మర్గానో అభిప్రాయపడ్డారు. జలాంతర్గామి 655 అడుగుల వరకు నీటిలోపలకి వెళ్లే సామర్ధ్యం కలిగి ఉండగా, ఈ ప్రమాదంలో అది దాదాపు 2000– 2300 అడుగుల లోతుకు మునిగి ఉంటుందని నేవీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ స్థాయిల్లో నీటి పీడనం చాలా ఎక్కువగా ఉంటుందని, ఆ పీడనాన్ని జలాంతర్గామి తట్టుకోలేదని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment