
దుబాయ్: ఎర్ర సముద్రంలోని యెమెన్ తీరం వద్ద లంగరేసి ఉన్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన ఓ నౌకపై మంగళవారం దాడి జరిగింది. ప్రభుత్వ ఆధీనంలోని ఇరాన్ షిప్పింగ్ లైన్స్‌కు ఎంవీ సవిజ్ అనే నౌకపై దాడి జరిగినట్లు ధ్రువీకరించిన ఇరాన్.. ఇందుకు ఇజ్రాయెల్‌పైనే అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించ లేదని కూడా వెల్లడించింది. ఈ నౌకపై దాడికి పాల్పడినట్లు ఇజ్రాయెల్ తమకు సమాచారం అందించినట్లు అమెరికా ఉన్నతాధికారి ఒకరు తమకు తెలిపినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది.
ఎంవీ సవిజ్ వాణిజ్య నౌక అని చెబుతున్నప్పటికీ దీనిద్వారా యెమెన్‌లోని హౌతి తిరుగుబాటుదారులకు ఇరాన్ ఆయుదాలు సరఫరా చేస్తోందని సౌదీ అరేబియా ఆరోపిస్తోంది. ఇరాన్ నౌకపై దాడిపై స్పందించేందుకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బెన్నీ గంట్జ్ నిరాకరించారు. ఇరాన్‌తోపాటు ఇరాన్ మిత్రదేశాలు తమ భద్రతకు ప్రమాదకారులని, ఇటువంటి వాటి నుంచి స్వీయ రక్షణకు చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్యానిం చారు. సవిజ్ నౌక వెలుపల అమర్చిన లింపెట్ మందుపాతరతోనే పేలుడు సంభవించిందని ప్రభుత్వ అనుకూల తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది. దీంతో నౌకకు భారీ నష్టం వాటిల్లినట్లు పేర్కొంది.
చదవండి: