కటౌట్ చూసి కొన్ని నమ్మేయాల్సిందే. ఈ ఫొటోలో కన్పిస్తున్న బలశాలి నిజంగానే ‘బాహుబలి’. బరువులు ఎత్తడంలో మనోడిని మించినోడు లేడంటే నమ్మాల్సిందే. ఇతగాడి పేరు చీక్ అహ్మద్ అల్ హసన్ అలియాస్ ఐరన్ బిబీ. ప్రపంచంలోనే అత్యంత బలవంతుడిగా పేరు పొందాడీ బాడీ బిల్డర్. ఏదో అషామాషీగా కాదు వరల్డ్ రికార్డును బద్దలు కొట్టి అత్యంత బలశాలిగా నిరూపించుకున్నాడు. జెయింట్స్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఏకంగా 229 కేజీల బరువును ఎత్తి ‘ఔరా’ అనిపించాడు. అయితే ఇక్కడితో ఐరన్ బిబీ ఆగడం లేదు. మున్ముందు 300 కేజీల బరువు ఎత్తేందుకు రెట్టించిన ఉత్సాహంతో శ్రమిస్తున్నాడు.
బుర్కినా ఫసో దేశానికి చెందిన ఐరన్ బిబీ పుట్టుకతోనే బాహుబలి. పుట్టినప్పుడే దాదాపు 5 కిలోల బరువు ఉన్నాడట. 1992లో అమ్మ కడుపు నుంచి భూమి మీదకు వచ్చాడు. చిన్నతనం నుంచే ‘ఫ్యాట్ బాయ్’గా పెరిగిన ఐరన్ బిబీ.. స్పింటర్ కావాలని అనుకున్నాడట. స్కూల్‌లో తాను పరిగెత్తేటప్పుడు తోటి విద్యార్థులు నవ్వేవారని, తనను హేళన చేసేవారని ఐరన్ బిబీ వెల్లడించాడు. (చదవండి: కేబీసీలో 5 కోట్లు గెలిచాడు.. కానీ దివాళా తీశాడు!)
‘ఆ సమయంలో నన్ను నేను అసహ్యించుకునే వాడిని. మా క్లాస్‌లో నేనే చిన్నవాడిని అయినా అందరికంటే నాలుగేళ్లు పెద్దోడిలా కనిపించే వాడిని. మా అన్నయ్యల కంటే కూడా పెద్దోడిలా అనిపించేవాడిని. అన్నివైపుల నుంచి అవహేళనలు ఎదుర్కొంటూ ఒక దశలో నిరాశలో కూరుకుపోయాను. అయితే అథ్లెట్ కావాలన్నా నా కలను మాత్రం వదులుకోలేదు. 17 ఏళ్ల వయసులో 2009లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లడంతో నా జీవితం మలుపు తిరిగింద’ని ఐరన్ బిబీ చెప్పాడు.
2013లో మొదటిసారిగా పవర్ లిప్టింగ్ పోటీల్లోకి దిగిన ఐరన్ బిబీ అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అత్యంత బలవంతుడిగా ఖ్యాతికెక్కాడు. తన సోదరులు ముద్దుగా ‘బిబీ’ అని పిలిచేవారని.. పవర్ లిప్టింగ్‌లో సత్తా చాటడంతో ఐరన్ బిబీగా పాపులర్ అయినట్టు ఈ ‘బాహుబలి’ వెల్లడించాడు. ఇంతకీ బుర్కినా ఫసో దేశం ఎక్కడుందనే కదా మీ డౌటు. పశ్చిమ ఆఫ్రికాలో ఉంది ఈ దేశం. (చదవండి: వామ్మో! ఒక్క ద్రాక్ష పండు రూ.33 వేలంట..)
Comments
Please login to add a commentAdd a comment