బీరూట్: లెబనాన్‌లోని ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లా స్థావరాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుంటోంది. తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దళం బీరుట్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 12 మందికి పైగా జనం మృతిచెందారు. అలాగే లెబనాన్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి భారీ నష్టం వాటిల్లింది.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరో 57 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దక్షిణ బీరుట్ శివార్లలోని రఫిక్ హరిరి యూనివర్శిటీ హాస్పిటల్ సమీపంలోని పలు భవనాలు ఈ దాడిలో ధ్వంసమయ్యాయి. హెజ్‌బొల్లా స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టంగా తెలియజేయలేదు. మరోవైపు హెజ్‌బొల్లా కూడా సెంట్రల్ ఇజ్రాయెల్‌లోకి పలు రాకెట్లను వదలడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈ దాడులతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది.
గాజా కాల్పుల విరమణ చర్చలను పునఃప్రారంభించే లక్ష్యంతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ ఇక్కడకు చేరుకోవడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరిగింది. ఇదిలావుండగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్‌ను మట్టుబెట్టి, అక్కడ బందీలుగా ఉన్న ప్రజలను విడిపిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా మాత్రమే వారి బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది.
గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో దాదాపు 1,200 మంది మరణించగా, 250 మంది జాడ తెలియరాలేదు. అప్పటి నుండి ఇజ్రాయెల్ వరుసగా హమాస్ స్థానాలపై దాడి చేస్తూవస్తోంది. గాజాలో ఇజ్రాయెల్ ఎదురుదాడిలో 42 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మృతిచెందారని స్థానిక ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ యుద్ధంతో గాజాలో చాలా ప్రాంతం ధ్వంసమైంది. అక్కడి జనాభాలో 90 శాతం మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు.
ఇది కూడా చదవండి: నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ హతం: ఇజ్రాయెల్
Comments
Please login to add a commentAdd a comment