ఇజ్రాయెల్‌కు మా పూర్తి మద్దతు: బైడెన్‌ | Israel-Hamas War: Joe Biden Lands In Israel Updates | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో బైడెన్‌.. మద్దతు ప్రకటన.. స్వాగతించిన నెతన్యాహు

Published Wed, Oct 18 2023 2:37 PM | Last Updated on Wed, Oct 18 2023 4:29 PM

Israel Hamas war: Joe Biden lands in Israel Updates - Sakshi

హమాస్‌ మిలిటెంట్ల దాడులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం టెల్‌ అవీవ్‌లోని బెన్‌ గురియన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బైడెన్‌కు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాల అధ్యక్షులు యుద్ధ పరిస్థితిపై, మానవతా సాయంపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు.

ఆసుప్రతిపై దాడి ఇజ్రాయెల్‌ జరిపింది కాదు
ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపేందుకే తాను ఇక్కడికి వచ్చినట్లు ఈ సందర్భంగా బైడెన్‌ తెలిపారు. ఇజ్రాయెల్‌కు తమ మద్దతు కొనసాగుతుందని పేర్కొన్నారు. గాజాలో అల్‌ అహ్లీ ఆసుపత్రిపై జరిగిన దాడి ఇజ్రాయెల్‌ జరిపినది కాదని, వేరే వైపు నుంచి వచ్చినదిగా కనిపిస్తుందని చెప్పారు. 

10 రోజులుకు పైగా జరుపుతున్న ఉగ్రవాద సంస్థ హమాస్‌ దాడుల్లో 1300 మంది ఇజ్రాయిల్స్‌తోపాటు 31 మంది అమెరికన్లు మరణించినట్లు పేర్కొన్నారు. చిన్నారులు, మహిళలతో సహా అనేకమందిని బందీలుగా ఉంచారని విమర్శించారు. ఐసిస్‌ ఉగ్రవాదులకు మించి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పాలస్తీనా ప్రజల గౌరవం, స్వీయనిర్ణయాధికారాన్ని హమాస్ ప్రతిబింబించదని పునరుద్ఘాటించారు.

విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తున్నందుకు బైడెన్‌ నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు.  యుద్ధ సమయంలో  తమ దేశంలో పర్యటించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ నిలిచారని అంటూ పేర్కొన్నారు. ఇది ఇజ్రాయెల్, యూదుల భవిష్యత్తు పట్ల తనకున్న వ్యక్తిగత నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. ఇజ్రాయెల్‌కు అమెరికా అందిస్తున్న సాయాన్ని మరవలేమని పేర్కొన్నారు.

తమ ఓపికను పరీక్షించవద్దనే స్పష్టమైన సందేహాన్ని హమాస్‌కు తెలియజేసినందకు ధన్యవాదాలు తెలిపారు. ఐఎస్‌ఐఎస్‌ను. నాజీలను ఓడించడానికి ప్రపంచం ఏకం అయినట్లే.., హమాస్‌ను ఓడించడానికి కూడా విశ్వమంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌తోపాటు ప్రపంచంలో శాంతి, భద్రత కోసం ఇది జరగాల్సిన అవసరం ఉందన్నారు.

చదవండి: గాజా ఆసుపత్రి ఘటన: ప్రధానిమోదీ తీవ్ర దిగ్భ్రాంతి

అయితే ఇజ్రాయెల్‌ పర్యటన తర్వాత బైడెన్‌ జోర్డాన్‌ వెళ్లాల్సి ఉంది. అక్కడ అరబ్‌ నేతలతోసమావేశం నిర్వహించేలా ముందుగా ప్రణాళిక చేసుకున్నారు. జోర్డాన్‌ రాజు అబ్దుల్లా 2, ఈజిప్టు ప్రధాని ఎల్‌-సిసీ, పాలస్తీనా అధ్యక్షుడు మహ్‌ముద్‌ అబ్బాస్‌ తదితరులతో భేటీ కావాల్సి ఉంది. కానీ గాజాలోని అల్‌ అహ్లీ సిటీ ఆసుపత్రిపై దాడి ఘటనతో అనూహ్యంగా బైడెన్‌ జోర్డాన్‌ పర్యటన రద్దైంది. 

కాగా హమాస్‌ ఉగ్రవాద దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌కు తన మద్దతును ప్రకటించడమే ఆ దేశంలో బైడెన్ పర్యటన ప్రధాన ఉద్దేశమని వైట్‌హౌస్‌ ప్రకటించింది. యుద్ధం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపైనా ఇజ్రాయెల్‌తో చర్చించనున్నట్లు వెల్లడించింది.

గాజా ఆసుపత్రి ఘటన.. హమాస్ పనే..
గాజాలోని అల్ అహ్లీ అరబ్ ఆస్పత్రిపై వైమానిక దాడి జరగడంతో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే ఈ  ఘటనలో 500 మందికి పైగా చనిపోయారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ వెల్లడించింది. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయినట్లు తెలిపింది. ఇజ్రాయిలే ఈ దాడికి పాల్పడిందని  హమాస్‌ ఆరోపిస్తుండగా.. దీనిని ఇజ్రాయెల్ సైన్యం ఖండించింది. దాడి చేసింది తాము కాదని, తాము ఆసుపత్రి సమీపంలో ఎలాంటి వైమానిక దాడులు జరపడం లేదని స్పష్టం చేసింది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్ రాకెట్ మిస్‌ఫైర్ అయి ఆస్పత్రిపై పడిందని తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement