ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్‌కు బైడెన్‌ వార్నింగ్‌! | Israel Plans Big Counter Attacks To Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్‌కు బైడెన్‌ వార్నింగ్‌!

Published Mon, Apr 15 2024 8:21 AM | Last Updated on Mon, Apr 15 2024 12:03 PM

Israel Plans Big Counter Attacks To Iran - Sakshi

టెల్‌ అవీవ్‌: ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌పైకి వందల సంఖ్యలో మిస్సైల్స్‌, డ్రోన్స్‌ దూసుకెళ్లాయి. ‘ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌’ పేరుతో విడతల వారీగా డ్రోన్లను ప్రయోగించింది. తర్వాత సైనిక స్థావరాలే లక్ష్యంగా క్రూజ్‌, బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేసింది. కానీ, ఇజ్రాయెల్‌ రక్షణ కవచం ముందు ఇరాన్‌ పాచిక పారలేదు. దీంతో, ఇరాన్‌ దాడులు దాదాపు ఫెయిల్‌ అయ్యాయి. 

ఇక, దాడుల అనంతరం ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ శాంతి కోసం ఇరాన్‌ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగించే ఉద్దేశ్యమేమీ లేదు. ఇజ్రాయెల్‌ కవ్విస్తే మాత్రం కచ్చితం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడమని హెచ్చరించింది. దీంతో, ఇరాన్‌ ప్రకటనపై ఇజ్రాయెల్‌ ఘాటుగా స్పందించింది. తాజాగా ఇజ్రాయెల్‌ మంత్రి బెన్నీ గాంట్జ్‌ మాట్లాడుతూ.. ఇరాన్‌పై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము. దీని కోసం తగిన సమయం, పద్దతిని ఎంచుకుంటామని సంచలన కామెంట్స్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని అమెరికా అ‍ధ్యక్షుడు జో బైడెన్‌ సూచించారు. ఈ క్రమంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ నేరుగా దాడులు చేస్తే అమెరికా సహకరించబోదని బైడెన్‌ స్పష్టం చేసినట్టు సమాచారం. ఇజ్రాయెల్‌ ప్రతిదాడికి పాల్పడితే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయని అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది.

మరోవైపు.. ఇరాన్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌కు పెద్దగా నష్టమేమీ సంభవించలేదు. ఇరాన్‌ ప్రయోగించిన వాటిలో 99శాతం డ్రోన్లు, క్షిపణులను అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ల సాయంతో ఆ దేశం సమర్థంగా నేలకూల్చింది. తాజా పరిణామంతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న ఇజ్రాయెల్‌ ఎదురుదాడులకు దిగితే ప్రాంతీయంగా పరిస్థితులు చేయిదాటేపోయే ముప్పు మాత్రం ఉంది. 

ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థ ఇలా..
పేట్రియాట్‌: చాలా కాలం నుంచి ఇజ్రాయెల్‌ ఈ క్షిపణి రక్షణ వ్యవస్థను వినియోగిస్తోంది. 1991లో జరిగిన గల్ఫ్‌ యుద్ధంలో వీటి పేరు ప్రముఖంగా వినిపించింది. ఇరాక్‌ ప్రయోగించిన స్కడ్‌ క్షిపణులను ఇవి విజయవంతంగా అడ్డుకున్నాయి. ఇప్పుడు వీటిని విమానాలను, డ్రోన్లు కూల్చడానికి ఇజ్రాయెల్‌ వినియోగిస్తోంది.

ది యారో: దీన్ని అమెరికా రూపొందించింది. ఇది గగనతల రక్షణ వ్యవస్థ. బాలిస్టిక్‌ సహా ఏ తరహా దీర్ఘ శ్రేణి క్షిపణులనైనా అడ్డుకోగలదు. భూవాతావరణం వెలుపలా పనిచేసే సామర్థ్యం దీనికి ఉంది. హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో యెమెన్‌ నుంచి హూతీ వేర్పాటువాదులు ప్రయోగించిన క్షిపణులను ఈ యారో వ్యవస్థతోనే ఇజ్రాయెల్‌ అడ్డుకుంటోంది.

డేవిడ్‌ స్లింగ్‌: ఇది కూడా అమెరికా తయారుచేసిందే. మధ్య శ్రేణి క్షిపణులను అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది. లెబనాన్‌ నుంచి హెజ్‌బొల్లా ప్రయోగించే మిసైళ్లను అడ్డుకోవడానికి ఈ వ్యవస్థనే ఇజ్రాయెల్‌ ఎక్కువగా వినియోగిస్తోంది.

ఐరన్‌ బీమ్‌: ఇజ్రాయెల్‌ కొత్తగా దీన్ని అభివృద్ధి చేసింది. లేజర్‌ సాంకేతికతతో పనిచేస్తుంది. మిగతా గగన రక్షణ వ్యవస్థలతో పోలిస్తే దీనికి తక్కువ ధర ఉంటుంది. ఇరాన్‌ శనివారం చేసిన దాడిలోనూ ఈ లేజర్‌ వ్యవస్థను వాడినట్లు తెలుస్తోంది.

ఐరన్‌ డోమ్‌: అమెరికా సహకారంతో ఇజ్రాయెల్‌ తయారుచేసిన వ్యవస్థ. తక్కువ దూరం నుంచి ప్రయోగించే రాకెట్లను ఇది అడ్డుకుంటుంది. లెబనాన్‌ హెజ్‌బొల్లా, గాజా నుంచి హమాస్‌ ప్రయోగించే రాకెట్లను గత కొన్ని సంవత్సరాలుగా ఐరన్‌ డోమ్‌ వ్యవస్థ అడ్డుకుంటోంది. ఏ దేశమైనా రాకెట్లను ప్రయోగించగానే ఆటోమెటిక్‌గా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. క్షిపణులను అడ్డుకుంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement