ఇజ్రాయెల్ సైన్యానికి ప్రధాని నెతన్యాహూ ఆదేశం
75 హెజ్‌బొల్లా లక్ష్యాలపై దాడులు
టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హెజ్‌బొల్లా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. లెబనాన్‌లో హెజ్బొల్లా స్థావరాలపై దాడులు కొనసాగించాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. శత్రువుల భరతం పట్టాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఆయన తాజాగా అమెరికాకు పయనమయ్యారు.
న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ప్రసంగిస్తారు. హెజ్బొల్లా్లతో చర్చల ప్రతిపాదన వచి్చన మాట వాస్తమేనని, అయితే దానిపై తాము ఇంకా స్పందించలేదని చెప్పారు. మరోవైపు హెజ్బొల్లా్లకు గట్టిగా బుద్ధి చెప్పాలన్న డిమాండ్లు ఇజ్రాయెల్‌లో వినిపిస్తున్నాయి. చర్చలు అవసరం లేదని నెతన్యాహూ మద్దతుదారులు తేల్చిచెబుతున్నారు. ఇదిలా ఉండగా, దక్షిణ లెబనాన్‌లోని బెకా లోయ రక్తసిక్తంగా మారుతోంది. హెజ్‌బొల్లా ఆయుధ నిల్వలతోపాటు పలు స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం బుధవారం అర్ధరాత్రి తర్వాత నిప్పుల వర్షం కురిపించింది. భారీగా క్షిపణులు ప్రయోగించింది. 75 హెజ్‌బొల్లా లక్ష్యాలపై దాడుల చేశామని ఇజ్రాయెల్ సైన్యం గురువారం వెల్లడించింది.
23 మంది సిరియన్లు మృతి
లెబనాన్‌లోని యూనైన్ పట్టణంలో మూడంతస్థుల భవనంపై బుధవారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 23 మంది సిరియన్లు మరణించారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు తెలిసింది. లెబనాన్‌లో ప్రస్తుతం 15 లక్షల మంది సిరియన్లు తలదాచుకుంటున్నారు. సిరియాలో అంతర్యుద్ధం మొదలైన తర్వాత వీరంతా ప్రాణరక్షణ కోసం లెబనాన్‌కు చేరుకున్నారు. హెజ్బొల్లా విషయంలో కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ గురువారం స్పష్టంచేశారు.
హెజ్‌బొల్లా డ్రోన్ కమాండర్ మృతి?
హెజ్బొల్లా డ్రోన్ విభాగం కమాండర్ లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం గురువారం సాయంత్రం లెబనాన్ రాజధాని బీరుట్‌పై మళ్లీ దాడులకు దిగింది. దహియెలోని అపార్టుమెంట్‌పై జరిగిన దాడిలో ఇద్దరు మృతి చెందగా 15 మంది వరకు గాయ పడ్డారని లెబనాన్ వార్తా సంస్థలు తెలిపాయి. ఈ దాడిలో హెజ్బొల్లా డ్రోన్ కమాండర్ మహ్మద్ హుస్సేన్ సరౌర్ చనిపోయినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించుకోగా హెజ్‌బొల్లా స్పందించలేదు.
లెబనాన్ నుంచి వెంటనే వెళ్లిపోండి
జెరూసలేం: యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నందున లెబనాన్‌కు భారత పౌరులెవరూ రావొద్దని బీరుట్‌లోని భారత రాయబార కార్యాలయం కోరింది. లెబనాన్‌లో ఉండే భారతీయులు సాధ్యమైనంత త్వరగా దేశాన్ని వీడాలని, ఉండాలనుకునే వారు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో అడ్వైజరీ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment