లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై గురి
356 మంది మృతి
1,024 మందికి గాయాలు
300కు పైగా లక్ష్యాలపై విరుచుకుపడిన ఐడీఎఫ్
ప్రతిగా డజన్ల కొద్దీ రాకెట్లు ప్రయోగించామన్న హెజ్బొల్లా
జెరుసలేం: ఇజ్రాయెల్ ఆర్మీ, హెజ్బొల్లా మిలిటెంట్ల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇవి మరింత ముదిరి తీవ్ర యుద్ధానికి దారి తీసే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవు తున్నాయి. సోమవారం ఉదయం లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ ఆర్మీ) భీకర దాడులకు తెరతీసింది. ఈ దాడుల్లో 21 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా 356మంది చనిపోగా, 1,024 మంది గాయపడ్డారని లెబనాన్ తెలిపింది.
సరిహద్దులకు 130 కిలోమీటర్ల దూరంలోని బిబ్లోస్ ప్రావిన్స్ అటవీ ప్రాంతంతోపాటు, బాల్బెక్, హెర్మెల్‌లపైనా బాంబు దాడులు జరిగినట్లు లెబనాన్ వెల్లడించింది. తాము లెబనాన్‌లోని 300కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఈ దాడుల గురించి దక్షిణ లెబనాన్ వాసులను ఆర్మీ ముందుగానే హెచ్చరించింది.
హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ డిపోలు, ఇతర మౌలిక వసతులకు, భవనాలకు సమీపంలో ఉండే పౌరులు తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా కోరింది. ఇజ్రాయెల్ నగరాలు, పౌరులపైకి గురిపెట్టిన వందల సంఖ్యలో క్షిపణులు, రాకెట్లను ధ్వంసం చేసినట్లు అనంతరం ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. వచ్చే రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టతరం కానున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
ఉత్తర ప్రాంతంలో సమీకరణాల్ని మార్చాలన్నదే తమ ప్రయత్నమని, ఇందుకు తగ్గ ఫలితం కన్పిస్తోందని అన్నారు. ఈ సమయంలో కలిసికట్టుగా ఉండి అధికారుల సూచనలు, హెచ్చరికలను పాటించాలని నెతన్యాహు ప్రజలను కోరారు. అనంతరం హెజ్బొల్లా హైఫా, గలిలీ ప్రాంతాల్లోని ఇజ్రాయెల్ ఆర్మీ వసతులపైకి డజన్లకొద్దీ రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.హెజ్బొల్లా సంస్థ ఆయుధాల డిపోలకు సమీపంలో ఉండే వారు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆయన కోరారు. గతేడాది అక్టోబర్ నుంచి హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో కనీసం 600 మంది చనిపోయారు.
మృతుల్లో ఎక్కువ మంది మిలిటెంట్లే. వీరిలో 100 మంది వరకు పౌరులుంటారని అంచనా.శుక్రవారం లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్లు సహా 45 మంది చనిపోవడం తెలిసిందే. మంగళ, బుధవారాల్లో వాకీటాకీలు, పేజర్లు, రేడియోలు పేలిన ఘటనల్లో 37 మంది చనిపోగా మరో 3 వేల మంది గాయపడ్డారు. ప్రతీకారంగా ఆదివారం హెజ్బొల్లా సరిహద్దులకు సుదూరంగా ఉన్న హైఫాలోని రఫేల్ డిఫెన్స్ సంస్థతోపాటు వివిధ లక్ష్యాలపైకి 150 వరకు రాకెట్లను ప్రయోగించడం తెలిసిందే.
వెళ్లిపోవాలంటూ మెసేజ్‌లు
తామున్న ప్రాంతాలను విడిచి వెళ్లాంటూ 80 వేల మందికి పైగా సెల్‌ఫోన్లలో మెసేజీలు అందాయని లెబనాన్ అధికారులు తెలిపారు. ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని కోరారు. భయాందోళనలను, అయోమయాన్ని సృష్టించడం ద్వారా మానసికంగా దెబ్బతీసేందుకు శత్రువు పన్నిన పన్నాగమని ప్రజలకు తెలిపారు. అయితే, తీవ్ర దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మూటాముల్లె సర్దుకుని అందుబాటులో ఉన్న వాహనాల్లో బీరుట్ దిశగా బయలుదేరారు. దీంతో, తీరప్రాంత సిడొన్ నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. 2006లో ఇజ్రాయెల్– హెజ్బొల్లా మధ్య యుద్ధంగా జరిగాక ఇంత భారీగా జనం వలసబాట పట్టడం ఇదే మొదటిసారని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కళాశాలలు, పాఠశాలలను తెరిచి ఉంచాల్సిందిగా లెబనాన్ హోం శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లు వదిలేసి భారీగా వలస వస్తున్న ప్రజలకు పాఠశాల భవనాల్లో ఆశ్రయం కల్పించాలని కోరింది.
దాడులు మరింత తీవ్రం
రాకెట్ లాంఛర్లు తదితరాలతో సరిహద్దులకు దగ్గర్లోని దక్షిణ ప్రాంతాన్ని మిలటరీ స్థావరాలుగా హెజ్బొల్లా మార్చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే భారీగా బాంబు దాడులు చేయక తప్పడం లేదంది. హెజ్బొల్లాను నిలువరించేందుకు వైమానిక దాడులపై తమ దృష్టంతా ఉందని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని 17 గ్రామాలు, పట్టణాల మ్యాప్‌ను విడుదల చేసింది. ఆపరేషన్లను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. రానున్న రోజుల్లో బెకా లోయతోపాటు మరిన్ని ప్రాంతాల్లో తీవ్ర దాడులుంటాయని ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలెవి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment