జెరూసలేం: హమాస్ దళాలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. యుద్ధాన్ని తాము మొదలెట్టలేదు.. కానీ తప్పకుండా ముగిస్తామని అన్నారు. హమాస్ తిరుగుబాటుదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. యుద్ధం మొదలెట్టి చారిత్రాత్మక తప్పిదం చేశారని అన్నారు.
'ఇజ్రాయెల్ ప్రస్తుతం యుద్ధం చేస్తుంది. యుద్ధం చేయాలని మేము కోరుకోలేదు. మాపై అతి కిరాతకంగా దారుణమైన దాడులకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించలేదు.. కానీ తప్పకుండా ముగిస్తుంది. హమాస్‌తో పాటు ఇజ్రాయెల్ శత్రుదేశాలకు గుర్తుండిపోయేలా బదులిస్తాం. హమాస్ కూడా ఐఎస్‌ఐఎస్ లాగే తీవ్రవాద సంస్థ. వీరిని ఓడించడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాలి. ' అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు.
'అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో నిరంతరం టచ్‌లోనే ఉన్నా. ఇజ్రాయెల్ ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి ఒక్కరి తరుపున ఇజ్రాయెల్ పోరాడుతోంది. అనాగరిక వ్యక్తులపై నాగరిక ప్రపంచమే విజయం సాధిస్తుంది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్న ప్రపంచ నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు.' అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు.
హమాస్ తిరుగుబాటుదారులపై పోరాడటానికి ఇజ్రాయెల్ ఇప్పటికే 3,00,000 సైనికులను రంగంలోకి దింపింది. 1973లో జరిగిన యోమ్ కిప్పూర్ యుద్ధంలో అత్యధికంగా 4,00,000 మంది సైనికులు పోరాడారు. ఇంతకాలం తర్వాత ఇంతటి భారీ స్థాయిలో యుద్ధం జరగడం ఇదే ప్రథమం. ఈ యుద్ధంలో దాదాపు 2300 మంది ఇజ్రాయెల్ ప్రజలు గాయపడ్డారు. 700 మంది మృతి చెందారు.
హమాస్ మిలిటెంట్ల పీచమణచడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం సోమవారం గాజాపై వైమానిక దాడులు ఉధృతం చేసింది. మిలిటెంట్ల చొరబాట్లను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, డ్రోన్లను మోహరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలోనూ వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి.
ఇదీ చదవండి Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం
Comments
Please login to add a commentAdd a comment