
న్యూఢిల్లీ: కెనడాను అమెరికాలో విలీనం చేసే ప్రణాళికలో ఉన్న అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను న్యూ డెమోక్రటిక్ పార్టీ(NDP) నేత జగ్మీత్ సింగ్ తీవ్రంగా హెచ్చరించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌లో జగ్మీత్ సింగ్ పోస్టు చేసిన వీడియోలో ‘డొనాల్డ్ ట్రంప్‌కు ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మా దేశం అమ్మకానికి లేదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ కాదు’ అని పేర్కొన్నారు.
ఇదే పోస్టులో ఆయన ‘కెనడియన్లు.. కెనడియన్లుగానే ఉండటం గర్వకారణం. మేము మా దేశం విషయంలో గర్వపడుతున్నాం. మా దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. కాగా లాస్ ఏంజిల్స్‌లో ఇప్పటివరకు 24 మందిని బలిగొన్న అగ్నిప్రమాదాలను నివారించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాకు అండగా ఉంటామని, ఎందుంటే అది తమ పొరుగుదేశమని జగ్మీత్ సింగ్(Jagmeet Singh) పేర్కొన్నారు.
కార్చిచ్చు వేలాది ఇళ్లను దగ్ధం చేస్తున్న తరుణంలో కెనడియన్ అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారన్నారు. మేము మా పొరుగువారికి సహాయం చేస్తుంటామని, అయితే అదేసమయంలో కెనడాపై అమెరికా సుంకం విధిస్తే, దానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని జగ్మీత్ సింగ్ హెచ్చరించారు.
డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తమతో పోరాడాలని అనుకుంటే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ మాపై సుంకాలు విధిస్తే, మేము కూడా అదేరీతిలో ప్రతీకార సుంకాలను విధించేందుకు కట్టుబడి ఉంటామన్నారు. ఇదిలా ఉంటే.. ఎన్డీపీ ఒకప్పుడు జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ ఆఫ్ కెనడాకు మిత్రపక్షం. అయితే మారిన రాజకీయ పరిణామాలతో అది కూటమి నుంచి వైదొలగింది.
కాగా గతంలో ట్రంప్ కెనడాను అమెరికాలోని 51వ రాష్ట్రంగా మార్చడం గురించి మాట్లాడారు. పలువురు కెనడియన్లు కెనడా 51వ అమెరికా రాష్ట్రంగా మార్చాలని కోరుకుంటున్నారని ట్రంప్ గతంలో ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) రాజీనామా తర్వాత ట్రంప్..కెనడా గనుక అమెరికాలో చేరితే, ఎటువంటి సుంకాలు ఉండవు. పన్నులు చాలా తక్కువగా ఉంటాయి. రష్యన్, చైనా నౌకల ముప్పు నుండి కెనడియన్ ప్రజలు సురక్షితంగా ఉంటారని పేర్కొన్నారు. అయితే గతంలో ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ట్రూడో.. అమెరికాలో కెనడా భాగం కావడం ఎన్నటికీ జరగదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Delhi Election-2025: అందరి దృష్టి షకూర్ బస్తీపైనే.. ఆ పార్టీల మధ్య హోరాహోరీ?
Comments
Please login to add a commentAdd a comment