హెచ్‌–1బీపై ఎటూ తేల్చని బైడెన్‌ ప్రభుత్వం | Joe Biden Administration Yet To Decide On Issuing New H-1B Visas | Sakshi
Sakshi News home page

హెచ్‌–1బీపై ఎటూ తేల్చని బైడెన్‌ ప్రభుత్వం

Published Wed, Mar 3 2021 3:03 AM | Last Updated on Wed, Mar 3 2021 11:17 AM

Joe Biden Administration Yet To Decide On Issuing New H-1B Visas - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో హెచ్‌–1బీ వీసాల నిషేధాన్ని ఎత్తివేయడంపై బైడెన్‌ సర్కార్‌ ఎటూ తేల్చుకోలేకపోతోంది. వలస విధానాన్ని సమూలంగా సంస్కరిస్తామని చెబుతూ వస్తున్న బైడెన్‌ ప్రభుత్వం హెచ్‌–1బీ వీసాలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తి వేస్తుందో లేదో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని హోంల్యాండ్‌ సెక్యూరిటీ మంత్రి అలెజాంద్రో మయోర్కస్‌ సూచన ప్రాయంగా వెల్లడించారు. భారత్, చైనా వంటి దేశాలకు చెందిన టెక్కీలను ఈ వీసాల ద్వారానే టెక్నాలజీ కంపెనీలు వేలాది మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. భారత్‌కి చెందిన టెక్కీలు హెచ్‌–బీ వీసా కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఈ వీసాలపై నిషేధం ఎత్తేస్తారో లేదో తేల్చుకోకపోవడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన టెక్‌ కంపెనీల్లో నెలకొంది. కరోనా సంక్షోభం సమయంలో ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉండగా ఈ నెల 31 వరకు హెచ్‌–బీ వీసాలపై నిషేధం విధించారు. అమెరికాలో నిరుద్యోగం అత్యధికంగా ఉండడంతో విదేశీ వర్కర్లకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేమన్న వాదనతో ట్రంప్‌ ఈ నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు.  

పూర్తి చికిత్స అవసరం  
బైడెన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్రంప్‌ వలస విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సంస్కరణలు మొదలు పెట్టింది. ముస్లింలపై వీసా ఆంక్షల్ని, కొత్త గ్రీన్‌కార్డుల జారీపై నిషేధాన్ని ఎత్తివేసింది. కానీ హెచ్‌–1బీలపై ఇప్పటివరకు ఒక నిర్ణయం తీసుకోలేదు. బైడెన్‌ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చెయ్యకపోతే మార్చి 31న నిషేధం దానంతట అదే రద్దయిపోతుంది. వైట్‌హౌస్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో గడువు కంటే ముందే నిషేధాన్ని ఎత్తివేస్తారా అని అడిగిన ప్రశ్నకు మయోర్కస్‌ స్పందిస్తూ ‘‘ఇలాంటి ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు. వలస విధానాన్ని సంస్కరించడానికి ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. దీనికి సమయం పడుతుంది’’అని చెప్పారు. మరోవైపు హెచ్‌–బీ వీసాల దరఖాస్తు స్వీకరణను ఇమిగ్రేషన్‌ విభాగం ప్రారంభించింది.  కాగా, ఐటీ నిపుణులు కావాలంటే హెచ్‌–బీ వ్యవస్థని ప్రక్షాళన చేయాలని, వీసాల సంఖ్యను పెంచాలని ఫేస్‌బుక్‌ చీఫ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్, గూగుల్‌ సంస్థకి చెందిన సుందర్‌ పిచాయ్‌ డిమాండ్‌ చేస్తున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement