US Elections 2020: విజయానికి చేరువలో బైడెన్‌ | Joe Biden is in Leading - Sakshi
Sakshi News home page

విజయానికి చేరువలో బైడెన్‌

Published Thu, Nov 5 2020 11:32 AM | Last Updated on Thu, Nov 5 2020 6:20 PM

Joe Biden Lead In USA President Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేకిత్తిసోంది. నువ్వా-నేనా అనే రీతిలో సాగిన పెద్దన్న పోరులో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నాయి. ఆ‍యనపై పోటీచేసిన డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయం దిశగా దూసుకుపోతున్నారు. విజయానికి మరో ఆరుఓట్ల దూరంలో బైడిన్‌ ఉన్నారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించగా.. ట్రంప్‌ 214 ఓట్లు సాధించారు. మేజిక్‌​ ఫిగర్‌ (270)ను అందుకునేందకు చేరువలో ఉన్నారు. ఇంకా కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. (ప్రపంచానికి పెద్దన్న: నువ్వా... నేనా..?)

అరిజోనా, జార్జియాలో ఓట్ల లెక్కింపు ఇంకా జరుగుతోంది. ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం.. అరిజోనాలో బైడెన్‌ ముందంజలో ఉండగా.. జార్జియాలో ట్రంప్‌ ఆధిక్యం కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 70  ఏళ్ల తరువాత ఆరిజోనాలో డెమోక్రాట్స్‌కు ఈసారి మద్దతు లభించింది. అక్కడి 11 ఎలక్టోరల్‌ ఓట్లు బైడెన్‌కే లభించాయి. ఇక పెన్సిల్వేనియాలో గంటగంటకూ ట్రంప్‌ ఆధిక్యతను బైడెన్‌ తగ్గిస్తున్నారు. మరోవైపు  ఫలితాలపై ట్రంప్‌​ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ఓట్లు తీసుకొచ్చి తన ఆధిక్యతను తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక కొన్ని కారణాల రీత్యా నెవెడాలో ఓట్ల లెక్కింపు ఆగిపోయింది. అక్కడ ఫలితాలు రావడానికి మరో 24 గంటలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. (విజయానికి ఆరు ఓట్ల దూరంలో..)

ఇక తాజా ఫలితాలపై బైడెన్‌‌ అభిమాలతో పాటు ట్రంప్‌​ వ్యతిరేకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు బైడెన్‌ అంటూ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక అమెరికా ఫలితాలపై సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషన్‌ స్పందించారు. నమస్తే బైడిన్‌.. బైబై ట్రంప్‌ అంటూ ట్వీట్‌ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్స్‌ విజయం సాధిస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement