president ellections
-
US presidential election 2024: బైడెన్.. బైడెన్.. బై బై ఎందుకు చెప్పలేదు?
ఎస్.రాజమహేంద్రారెడ్డి: చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టే కాలమూ తన మానాన తాను పరిగెడుతూనే ఉంటుంది. ఎవరి కోసమూ ఆగదు. ఈ పరుగెత్తే కాలమే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాళ్లకు అడ్డం పడుతోంది. అయినా సరే, 80 ఏళ్ల బైడెన్ ఆగేదే లేదంటున్నారు. ‘అప్పుడేనా...!’ అంటూ మరో విడత అధ్యక్ష పదవికి సిద్ధమయ్యారు. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో డెమొక్రాట్ల అభ్యర్థిని తానేనని మొన్న మంగళవారం ఆయన అధికారకంగా ప్రకటించేశారు. ఎదురు పడేది టెంపరి డొనాల్డ్ ట్రంపే కదా, ఇంకోసారి ఓడించలేనా అన్నది ఆయన ధీమా. ‘ఆయనకు 76, నాకు 80... అంతే కదా’ అన్నది ఆయన ధైర్యం. అంతేగానీ, ఇక కొత్త తరానికి వదిలేద్దామన్న భావన మాత్రం ఇద్దరిలోనూ లేకపోవడం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్ విషయంలో చట్టం, ప్రెసిడెంట్ బైడెన్ విషయంలో కాలం తమ మానాన తమ పని చేసుకుంటూ వెళ్లిపోతూనే ఉంటాయి. గిర్రున ఏడాది తిరిగేసరికి ఎన్నికల నగారా మోగుతుంది. గెలుపెవరిదో, ఓడేదెవరో మళ్లీ కాలమే చెబుతుంది... రెండో ప్రపంచ యుద్ధం భీకరంగా సాగుతున్న కాలంలో, అమెరికా ఆ యుద్ధ మైదానంలోకి దిగిన ఏడాదికి 1942లో బైడెన్ జన్మించారు. కాలచక్రం మరో 30 ఏళ్లు తిరిగేసరికి 1973లో తొలిసారి సెనేటర్ అయ్యారు. అప్పటికి వైట్‌హౌస్‌లో రిచర్డ్ నిక్సన్ కొలువుదీరి ఉన్నారు. అత్యంత పిన్న వయసు సెనేటర్‌గా చరిత్ర సృష్టించిన బైడెన్‌కు, 15 ఏళ్లు విరామం లేకుండా ఆ పదవిలో కొనసాగాక ‘నేనెందుకు శ్వేతసౌధంలో అడుగుపెట్టకూడదు?’ అన్న ఆలోచన వచ్చింది. 1988లో ఆ ముచ్చటా తీర్చుకుందామనుకున్నా పరిస్థితులు అనుకూలించలేదు. డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందు వరుసలో నిలిచి ముచ్చటగా మూడు నెలలు ముమ్మరంగా ప్రచారం కూడా చేసుకున్నాక అనివార్యంగా, అర్ధంతరంగా వైదొలగాల్సి వచ్చింది. ఆ సమయానికి అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ఇంకా ముగియలేదు. ఇక్కడ సీన్ కట్ చేస్తే, 2020లో బైడెన్ 78 ఏళ్ల వయసులో వైట్‌హౌస్ మెట్లెక్కి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ వయసులో అధ్యక్షుడు కావడం కూడా అమెరికా చరిత్రలో రికార్డే. తన రికార్డును తానే బద్దలు కొట్టేందుకు ఈ డెలావర్ పెద్దాయన బరిలో దిగుతున్నారు. గెలిచి తీరతానన్న ఆత్మవిశ్వాసమే ఆయనను ముందుకు నడిపిస్తోంది. ఈ ధీమా వెనక పలు కారణాలున్నాయి. మళ్లీ ట్రంపే ప్రత్యర్థి అవుతారని... దూకుడుకు కాసింత దుందుడుకుతనం కలిపితే డొనాల్డ్ ట్రంప్. అదే ఆయన స్వభావం. అదే ఆయన పెట్టుబడి కూడా. ఒకసారి తన చేతిలో ఓడిన ఈ ట్రంపే ఈసారి కూడా తన రిపబ్లికన్ ప్రత్యర్థి అని బైడెన్ ఫిక్సయిపోయారు. రిపబ్లికన్ పార్టీ తమ తుది అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోయినా, ట్రంప్‌కే చాన్స్ దక్కే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నికీ హేలీ, టెక్ దిగ్గజం వివేక్ రామస్వామి, రేడియో హోస్ట్ లారీ ఎల్డర్, అర్కన్సాస్ మాజీ గవర్నర్ అసా హుచిన్సన్ ప్రధానంగా ఆయనతో పోటీ పడుతున్నారు. వీరిలో నికీ హేలీ నుంచే ట్రంప్‌కు కొంచెం గట్టి పోటీ ఎదురవ్వచ్చు. ట్రంప్‌ను పక్కకు నెట్టి బరిలోకి దిగుతాడనుకున్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించే యోచనలో ఉన్నట్టు లేరు. మొత్తమ్మీద బైడెన్ ప్రత్యర్థిగా ట్రంప్ దాదాపుగా ఖాయమైనట్టే. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓడినా తానే గెలిచానని డాంబికాలు పలికి, కేపిటల్ హిల్‌పై దాడికి తన అభిమానులను, రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పడంతో ట్రంప్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందన్నది బైడెన్ అంచనా. అపప్రథ మూటగట్టుకున్న ట్రంప్‌ను ఓడించడం ఈసారి మరింత తేలికని ఆయన భావిస్తున్నారు. మీద పడుతున్న వయసును లెక్కచేయకుండా బైడెన్ ముందుకురకడానికి ఇదే ప్రధాన కారణం. పోర్న్ నటికి డబ్బుల చెల్లింపు విషయంలో ట్రంప్‌ను కోర్టు ముద్దాయిగా ప్రకటించడమూ తనకు లాభిస్తుందని ఆశపడుతున్నారు. అయితే ట్రంప్‌ను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని రిపబ్లికన్లలో చాలామంది నమ్ముతుండటంతో ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఆయన అవకాశాలు మరింత మెరుగయ్యాయన్నది విశ్లేషకుల అంచనా. రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుల్లో ట్రంప్ హవా కొనసాగుతున్నా ప్రజల్లో మాత్రం ఆయన పట్ల అసంతృప్తి పెరిగిందన్నది డెమొక్రాట్ల వాదన. 2018 నుంచీ ట్రంప్ పయనం ఓటమి బాటలోనే సాగుతుండటం గమనార్హం. 2018 మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లు సెనేట్ను, హúజ్ను రెండింటినీ కోల్పోయారు. 2020లో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి చవిచూశారు. 2022 మిడ్ టర్మ్ ఎన్నికల్లోనూ ట్రంప్ సారథ్యం వల్ల పార్టీ అనూహ్య పరాజయం చవిచూసింది. మొత్తమ్మీద రిపబ్లికన్లకు ట్రంప్ గుదిబండగా తయారవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోర్టు కేసులు ట్రంప్‌కు కొత్త ఊపిరిలూదినా ఆయనను ఓడించడం తనకొక్కడికే సాధ్య మని బైడెన్ నొక్కివక్కాణిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి ఓడించి చూపించానని పదేపదే చెబుతున్నారు. వయసుదేముంది, అదో అంకె మాత్రమేనన్నది ఆయన భావన. వచ్చే ఏడాది బరిలో దిగే సమయానికి ట్రంప్‌కు 78 ఏళ్లొస్తాయి. తనకన్నా నాలుగేళ్లే చిన్న కదా అంటారు బైడెన్. ఒకవేళ అంచనాలన్నీ తారుమారై ట్రంప్‌కు రిపబ్లికన్ అభ్యర్థిత్వం దక్కకున్నా ఆయన స్వతంత్రుడిగా బరిలోకి దిగడం ఖాయం. రిపబ్లికన్ మద్దతుదార్ల ఓట్లు చీలడం తథ్యం. అదే జరిగితే బైడెన్ పని మరింత సులువవుతుంది. ఓటు ‘విచ్ఛి్చత్తి’ అబార్షన్ల (గర్భవిచ్ఛిత్తి) చట్టబద్ధత చెల్లదని రిపబ్లికన్స్ అనుకూల సుప్రీంకోర్టు తేల్చిచెప్పడం కూడా డెమొక్రాట్లకు రాజకీయంగా లాభించింది. అబార్షన్లు అనైతికమని రిపబ్లికన్లు బాహాటంగా ప్రచారం చేసి స్వేచ్ఛావాదులు, స్త్రీవాదుల ఆగ్రహానికి గురయ్యారు. తన దేహం మీద స్త్రీకే పూర్తి హక్కుంటుందని, అబార్షన్ చేయించుకోవాలా, వద్దా అన్నది ఆమె ఇష్టాయిష్టాల మీదే ఆధారపడి ఉంటుందనేది బైడెన్ టీమ్ వాదన. సనాతనవాదులు, మతవాదులకు ఇది రుచించకపోయినా ప్రజల్లో అధిక భాగం బైడెన్‌తో ఏకీభవించారు. ఈ పరిణామం వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. అబార్షన్ల చట్టబద్ధతను తిరస్కరిస్తూనే, ఆయా రాష్ట్రాలు తమ అభీష్టం మేరకు దాన్ని అమలు చేసే వెసులుబాటును సుప్రీంకోర్టు కల్పించడం గమనార్హం. అమెరికావ్యాప్తంగా ఈ తీర్పుకు అనుకూల, ప్రతికూల ప్రదర్శనలు మిన్నంటాయి. రిపబ్లికన్ పాలిత కాన్సాస్, కెంటకీ, మోంటానా రాష్ట్రాలు ఆగమేఘాల మీద అబార్షన్లపై ఉక్కుపాదం మోపాయి. డెమొక్రటిక్పాలిత కాలిఫోర్నియా, మిషిగన్, వెర్మోంట్ అబార్షన్ హక్కుల పరిరక్షణకు ప్రతినబూనాయి. ఈ పరిణామాలు ఓటర్లనూ రెండు వర్గాలుగా చీల్చాయి. సుప్రీం తీర్పు తర్వాత జరిగిన మిడ్ టర్మ్‌లో రిపబ్లికన్ల ఓటు బ్యాంకు చెల్లాచెదురు కావడానికి ఇదే ప్రధాన కారణమైంది. అబార్షన్ వ్యతిరేకతను రాజకీయ నినాదంగానే భావించిన రిపబ్లికన్ పార్టీ, ప్రజలు ఇంతగా ప్రభావితమవుతారని అంచనా వేయలేకపోయింది. పరోక్షంగా డెమొక్రాట్లకు అదనపు లాభం చేకూరింది. అబార్షన్లపై రిపబ్లికన్ల వైఖరే తన విజయానికి రెండో మెట్టు అవుతుందని బైడెన్ గట్టిగా నమ్ముతున్నారు. అనుకూల ఓటు పదిలం బైడెన్ విజయావకాశాలను ప్రభావితం చేసే పై రెండు అంశాలు ట్రంప్ వ్యతిరేక ఓటుతో ముడిపడి ఉన్నాయి. సగటు ఓటరును తమవైపు తిప్పుకునే మంచి పనులు కూడా బైడెన్ గత రెండేళ్లలో చాలానే చేశారు. అనుకూల ఓటు, కొత్త ఓటును పదిలం చేసుకోవడానికి ఇవి అండగా నిలుస్తాయి. ట్రంప్ పాలనలో అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనాను బైడెన్ సమర్థంగా అరికట్టి పార్టీలకతీతంగా ప్రజల మనన్నలు అందుకున్నారు. దిగుమతుల మీద ఆధారపడకుండా స్వదేశీ తయారీ ‘మేడిన్ అమెరికా’ భావానికి బహుళ ప్రచారం కల్పించారు. ఆ దిశగా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల స్థాపనకు బిల్లు తెచ్చారు. వైద్య చికిత్స ఖర్చులను తగ్గించడంతో పాటు ఉద్యోగ కల్పనకు చర్యలు తీసుకున్నారు. విదేశీ వ్యవహారాల్లోనూ చెప్పుకోదగ్గ ప్రగతి సాధించారు. నాటోకు వెన్నుదన్నుగా, ఉక్రెయిన్‌కు అండగా నిలిచి రష్యాను నిలువరించడం గమనించదగ్గవి. ప్రపంచంపై తన పెత్తనాన్ని నిలుపుకోవాలంటే చైనాపై ఓ కన్నేసి ఉంచాలనే సూక్ష్మాన్ని కూడా బైడెన్ గుర్తించడం విశేషం. వచ్చే ఎన్నికల్లో ఈ అంశాలన్నీ తనకు అనుకూలంగా ఓటుబ్యాంకును సుస్థిరం చేస్తాయనే నమ్మకమే బైడెన్‌ను ఎన్నికలవైపు నడిపిస్తోంది. కొస మెరుపు బైడెన్‌కు ఇన్ని అనుకూలతలున్నా ట్రంప్‌కు 2020 ఎన్నికల్లో 7.4 కోట్ల ఓట్లు వచ్చాయన్నది తోసిపుచ్చలేని అంశం. రిపబ్లికన్లు ట్రంప్‌ను పక్కన పెట్టి అనూహ్యంగా తమ తురుపు ముక్క డిసాంటిస్‌ను తెరపైకి తెస్తే మాత్రం బైడెన్ వయసు చర్చనీయాంశంగా మారుతుంది. అన్నీ మంచి శకునములేనని బైడెన్ భావిస్తున్నా ఆర్థిక నిర్వహణ వంటి వ్యవహారాల్లో ఆయన పనితీరుపై విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. వెక్కిరిస్తున్న ద్రవ్యోల్బణం వంటివాటిని ఉదాహరణగా చూపుతున్నారు. అనుకూల, ప్రతికూల పవనాలెలా ఉన్నా వయసు విషయంలో మాత్రం బైడెన్, ట్రంప్ దొందూ దొందే అన్నది తటస్థుల అభిప్రాయం. 2024 నవంబర్‌లో జరిగే ఎన్నికల్లోగా ఏమైనా జరగొచ్చు. చివరికి గెలుపు ఎవరినైనా వరించవచ్చు. ఇప్పటికైతే బైడెన్ ఆత్మవిశ్వాసాన్ని కొట్టిపారేయలేం. అయినా రాజకీయాల్లో వయసుతో పనేముంది? అధికారమే ముఖ్యం! బైడెన్కైనా, ట్రంప్‌కైనా లక్ష్యం అదే! ‘‘రాజకీయం ఒక రంగులలోకం అధికారమొక తీరని దాహం’’ -
కాంగ్రెస్ కొత్త సారథి ఎవరైనా గాంధీల సలహాలు కచ్చితంగా తీసుకోవాలి
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు పార్టీలో గాంధీ కుటుంబం ఉనికిని ఏ మాత్రం ప్రభావితం చేయవని ఆ పార్టీ సీనియర్ నేత పి.చిందరం అభిప్రాయపడ్డారు. కొత్త సారథిగా ఎవరు బాధ్యతలు చేపట్టిన గాంధీల సలహాలు, సూచనలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపట్టినా రిమోట్ కంట్రోల్ మాత్రం గాంధీల చేతిలోనే ఉంటుందనే ఆరోపణలను చిదంబరం తోసిపుచ్చారు. జిల్లా స్థాయిలో ఓటింగ్ జరిగి అధ్యక్షుడ్ని ఎన్నుకున్న తర్వాత కూడా ఇది సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శుక్రవారం ఓటింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 9 వేల మంది పార్టీ ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఖర్గే గాంధీల విధేయుడని, ఆయన గెలిచినా నడిపించేది గాంధీలేనని విమర్శలు వచ్చాయి. ఈనేపథ్యంలో చిదంబరం స్పందించారు. 2024 ఎన్నికల్లో విజయం కోసం పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని కోరిన నేతల్లో ఆయన కూడా ఉన్నారు. కొత్తగా పార్టీ బాధ్యతలు చేపట్టేవారు సంస్థాగత ఎన్నికలు నిర్వహించి కొత్త నాయకులను ఎన్నుకునేలా చేయాలని, పార్టీలో మార్పులు తీసుకురావాలని తాజాగా సూచించారు. మరోవైపు తాను గెలిస్తే పార్టీలో సమూల మార్పులు తీసుకొస్తానని పోటీకి ముందే శశిథరూర్. ఖర్గే కూడా పార్టీలో యువతకే ఎక్కువ అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశారు. గాంధీల నుంచి విలువైన సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకుంటానని స్పష్టం చేశారు. ఖర్గే, థరూర్‌లో ఎవరు గెలుస్తారో బుధవారం తెలిపోనుంది. ఆరోజే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. చదవండి: ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. 96% ఓటింగ్ నమోదు -
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో జోక్యంపై ప్రచారం.. భారత్ రియాక్షన్ ఇదే..
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అక్కడి నాయకులను ప్రభావితం చేసేందుకు భారత్ ప్రయత్నించిందని విదేశీ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలను కొలంబోలోని భారత హైకమిషన్ కొట్టిపారేసింది. ఇవన్నీ నిరాధార, కల్పిత ఆరోపణలని తేల్చి చెప్పింది. ఈమేరకు ట్విట్టర్లో అధికారిక ప్రకటన విడుదల చేసింది. 'శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో భారత్‌కు ఎలాంటి ప్రమేయం లేదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం, కల్పితం. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజలకు భారత్ ఎప్పుడూ అండగానే ఉంటుంది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలు, రాజ్యాంగ ప్రక్రియలో భారత్ జోక్యం చేసుకోదు' అని కొలంబోలోని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం వీడి మాల్దీవులకు పారిపోయినప్పుడు కూడా భారత్ సహకరించిందని శ్రీలంక మీడియాలో వార్తలొచ్చాయి. అప్పుడు కూడా భారత హైకమిషన్ స్పందించింది. అదంతా తప్పుడు ప్రచారమేనని స్పష్టం చేసింది. శ్రీలంక పార్లమెంటులో నూతన అధ్యక్ష ఎన్నికలు బుధవారం జరిగాయి. తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేనే విజయం సాధించారు. మొత్తం 225 మంది సభ్యులకు గానూ ఆయనకు అనుకూలంగా 134 ఓట్లు వచ్చాయి. చదవండి: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే -
రాష్ట్రాలకు చేరిన.. మిస్టర్ బ్యాలెట్ బాక్స్
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో వినియోగించనున్న బ్యాలెట్ బాక్సులు విమానాల్లో రాష్ట్రాలకు చేరుకుంటున్నాయి. ఈ మేరకు రాష్ట్రాలకు చెందిన అధికారులతోపాటు విమానాల్లో వారి పక్క సీట్లను బ్యాలెట్ బాక్స్‌ల కోసం కేటాయించారు. ఈ మేరకు బాక్సుల కోసం ‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ పేరిట కేంద్ర ఎన్నికల సంఘం విమాన టికెట్లు కొనుగోలు చేసింది. మంగళ, బుధవారాల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బ్యాలెట్ బాక్సులు చేరుకొనేలా చర్యలు తీసుకుంది. ఆయా వివరాలను మంగళవారం ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ వెల్లడించారు. ‘మంగళవారం 14 ప్రాంతాలకు బుధవారం 16 ప్రాంతాలకు బ్యాలెట్ బాక్సులు విమానాల్లో చేరుకుంటాయి. రాష్ట్రాల నుంచి వచ్చి అధికారుల తిరిగి అదే రోజు ఢిల్లీకి బ్యాలెట్ బాక్సులను వెంట తీసుకొస్తారు. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం మరింత పటిష్టత, పారదర్శకత కనబరచాలని రాష్ట్రాల రిటర్నింగ్ అధికారులకు సూచించాం. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సహా ఎన్నికల సామగ్రి రవాణా, నిల్వల సంబంధ ప్రోటోకాల్ మార్గదర్శకాలను రిటర్నింగ్ అధికారులు ఖచ్చితంగా పాటించాలి’ అని రాజీవ్ చెప్పారు. బ్యాలెట్ బాక్సులు రాష్ట్రాలకు చేరిన తర్వాత శానిటైజ్ చేసి సీలు వేసిన స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరుస్తారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియో తీస్తారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తదుపరి విమానంలో రాష్ట్రాల అధికారులు బ్యాలెట్ బాక్సులను విమానాల్లో ఢిల్లీకి తీసుకురానున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా బాక్స్‌లను హిమాచల్ ప్రదేశ్‌కు రోడ్డు మార్గంలో పంపిస్తారు. చదవండి: ‘ఒత్తిడి కాదు.. కరెక్ట్ నిర్ణయం’ ద్రౌపది ముర్ముకే శివసేన మద్దతు -
రాష్ట్రపతి ఎన్నికలు: విపక్షాలకు శరద్ పవార్ షాక్
న్యూఢిల్లీ, ముంబై: రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాలకు కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ షాక్ ఇచ్చారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి రేసుకు దూరంగా ఉండాలని శరద్ పవర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ‘నేను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేయడం లేదు. రాష్ట్రపతి రేసులో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండబోను’ అని సోమవారం రాత్రి ముంబైలో జరిగిన ఎన్సీపీ సమావేశంలో శరద్ పవార్ తెలిపారు. కాంగ్రెస్‌కు చేరని పవార్ నిర్ణయం ‘ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టుకోవడంలో సఫలమవుతాయనే దానిపై శరద్ పవర్‌కు నమ్మకం లేదు. అందుకే ఓడిపోయే పోరులో పోటీ చేసేందుకు ఆయనకు ఇష్టం లేదు’ అని ఎన్సీపీ సన్నిహత వర్గాలు చెబుతున్నాయి. అయితే పవార్ తన అభిప్రాయాన్ని ఇంకా కాంగ్రెస్‌కు చెప్పలేదని తెలుస్తోంది. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరుపున 81 ఏళ్ల శరద్ పవర్ పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే. చదవండి: పోలీసుకు తన ‘పవర్’ చూపాడు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌కే పవర్ కట్ పవార్ అభ్యర్థిత్వంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే గురువారం ముంబైలో శరద్‌పవార్‌తో భేటీ అయి, వెల్లడించినట్లు సమాచారం. ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ కూడా ఎన్సీపీ నేతతో ఫోన్లో చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికల ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జూన్ 15న (బుధవారం) ఢిల్లీలో ప్రతిపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. దీంతో జూలై 18 న కొత్త రాష్ట్రపతి కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్ట్రోరల్ కాలేజీ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇందులో లోక్‌సభ, రాజ్యసభ్య సభ్యులతోపాటు అన్ని రాష్ట్రాల శాసన సభ్యులు, ఢిల్లీ, పుదుచ్చేరి ఎమ్మ్యేల్యేలు సభ్యులుగా ఉంటారు. ఎలక్టోరల్ కాలేజీలోని మొత్తం 10,86,431 ఓట్లకు గాను 50%ఓట్లు సాధించిన వారే రాష్ట్రపతి అవుతారు. మెజారిటీ మార్కును దాటేందుకు బీజేపీకి మరో 13వేల ఓట్ల అవసరముంది.అయితే కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి మరికొన్నిన పార్టీలు మద్దతు ఇస్తుండటంతో..అధికార పార్టీ అభ్యర్థియే తదుపరి రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే రాష్ట్రపతి అభ్యర్థి పేరును ఎన్డీయే ఇంకా ప్రకటించలేదు. -
నమస్తే బైడెన్.. బై..బై ట్రంప్
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేకిత్తిసోంది. నువ్వా-నేనా అనే రీతిలో సాగిన పెద్దన్న పోరులో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నాయి. ఆయనపై పోటీచేసిన డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. విజయానికి మరో ఆరుఓట్ల దూరంలో బైడిన్ ఉన్నారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. ట్రంప్ 214 ఓట్లు సాధించారు. మేజిక్ ఫిగర్ (270)ను అందుకునేందకు చేరువలో ఉన్నారు. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. (ప్రపంచానికి పెద్దన్న: నువ్వా... నేనా..?) అరిజోనా, జార్జియాలో ఓట్ల లెక్కింపు ఇంకా జరుగుతోంది. ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం.. అరిజోనాలో బైడెన్ ముందంజలో ఉండగా.. జార్జియాలో ట్రంప్ ఆధిక్యం కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 70 ఏళ్ల తరువాత ఆరిజోనాలో డెమోక్రాట్స్‌కు ఈసారి మద్దతు లభించింది. అక్కడి 11 ఎలక్టోరల్ ఓట్లు బైడెన్‌కే లభించాయి. ఇక పెన్సిల్వేనియాలో గంటగంటకూ ట్రంప్ ఆధిక్యతను బైడెన్ తగ్గిస్తున్నారు. మరోవైపు ఫలితాలపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ఓట్లు తీసుకొచ్చి తన ఆధిక్యతను తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక కొన్ని కారణాల రీత్యా నెవెడాలో ఓట్ల లెక్కింపు ఆగిపోయింది. అక్కడ ఫలితాలు రావడానికి మరో 24 గంటలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. (విజయానికి ఆరు ఓట్ల దూరంలో..) ఇక తాజా ఫలితాలపై బైడెన్ అభిమాలతో పాటు ట్రంప్ వ్యతిరేకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు బైడెన్ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక అమెరికా ఫలితాలపై సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్ స్పందించారు. నమస్తే బైడిన్.. బైబై ట్రంప్ అంటూ ట్వీట్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్స్ విజయం సాధిస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. #USElections2020 Namaste Biden. Goodbye Doland! — Prashant Bhushan (@pbhushan1) November 5, 2020 -
అధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్ నామినేషన్
వాషింగ్టన్: నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రాటిక్ పార్టీ జో బిడెన్‌ను తమ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేసింది. ఇది జో బిడెన్ రాజకీయ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు. బిడెన్ గతంలో రెండు సార్లు అధ్యక్ష పదవికి తలపడ్డారు. డెమోక్రాటిక్ తరఫున తనను అధ్యక్ష పదివికి నామినేట్ చేసినందుకు బిడెన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ‘డెమోక్రాటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి నన్ను నామినేట్ చేయడం నా జీవితానికి లభించిన అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తున్నాను’ అంటూ బిడెన్ ట్వీట్ చేశారు. ‘మీ అందరికి ధన్యవాదాలు. ఈ ప్రపంచం నాకు, నా కుటుంబానికి మద్దతుగా ఉందని విశ్వసిస్తున్నాను’ అని తెలిపారు. డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ (డీఎన్సీ) రెండవ రోజు ఈ కార్యక్రమం జరిగింది. (డెమోక్రాట్లను గెలిపిస్తే భారత్‌కు మేలు) It is the honor of my life to accept the Democratic Party's nomination for President of the United States of America. #DemConvention — Joe Biden (@JoeBiden) August 19, 2020 ఇక బిడెన్ అభ్యర్థిత్వాన్ని సమర్థించిన వారిలో గత, ప్రస్తుత డెమోక్రాటిక్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధులు ఉన్నారు. ‘లీడర్షిప్ మ్యాటర్స్’ థీమ్‌తో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మాజీ రిపబ్లికన్ స్టేట్ సెక్రటరీ కోలిన్ పావెల్, మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్(95)లు హాజరయ్యారు. అధ్యక్ష ఎన్నికలకు కేవలం 77 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ రెండున్నర నెలల కాలం బిడెన్ భవిష్యత్తుని నిర్ణయించనుంది. స్వదేశం, విదేశాలలో ట్రంప్ సృష్టించిన గందరగోళాన్ని సరిచేయగల శక్తి, అనుభవం బిడెన్ సొంతమంటున్నారు డెమోక్రాట్లు. -
రాజపక్స బ్రదర్స్ హవా
శ్రీలంకలో బుధవారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో శ్రీలంక పొదుజన పెరమున(ఎస్ఎల్పీపీ)కి ఊహకు మించిన మెజారిటీ లభించింది. నిరుడు నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 52.25 శాతం ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీకి ఈసారి కూడా అత్యధిక స్థానాలొస్తాయని అందరూ అనుకున్నదే. కానీ దాదాపు మూడింట రెండొంతుల మెజారిటీ వస్తుందని ఎవరూ వూహించలేదు. 225 స్థానా లున్న పార్లమెంటులో ఎస్ఎల్పీపీకి 145 స్థానాలొచ్చాయి. ఒకప్పుడు జాతి ఘర్షణలకు నిలయమైన శ్రీలంకలో గెలుపు సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలో ఎస్ఎల్పీపీకి బాగానే తెలుసు. సింహళ మెజారిటీవాదం, దేశభద్రత అనే రెండు అంశాలే దానికి ప్రధాన అస్త్రాలయ్యాయి. నిరుడు అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆ పార్టీకి అవే అక్కరకొచ్చాయి. 2 కోట్ల 20 లక్షలమంది జనాభా గల శ్రీలంకలో 26 ఏళ్లపాటు కొనసాగిన తమిళ గెరిల్లాల పోరు 2009తో పరిసమాప్తమయింది. తమిళ ఈలం కోసం పోరాడిన లిబరేషన్ టైగర్లను రక్షణమంత్రిగా వుంటూ అణిచివేసిన గొతబయ రాజపక్స నిరుడు దేశా ధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తన సోదరుడు, మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సను ప్రధా నిగా నియమించారు. తాజా ఎన్నికలు వారి కుటుంబ పాలనను సుస్థిరం చేయడంతోపాటు తిరుగు లేని అధికారాన్ని కట్టబెట్టాయి. ప్రతిపక్షాలు కనీసం ఎస్ఎల్పీపీ దరిదాపుల్లో కూడా లేవు. నిరుడు అధ్యక్ష ఎన్నికల్లో 41.99 శాతం ఓట్లు తెచ్చుకుని, అధికారం కోల్పోయిన యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ)కి ఈసారి దక్కింది ఒకే ఒక స్థానం. మాజీ ప్రధాని రనిల్ విక్రమసింఘే నాయకత్వం లోని ఆ పార్టీ నుంచి విడివడి సమగి జన బలవెగయ(ఎస్‌జేబీ) పార్టీ స్థాపించిన సజిత్ ప్రేమదాసకు 54 స్థానాలు దక్కాయి. తమిళ జనాభా అధికంగా వున్న ప్రాంతాల్లో మెజారిటీ స్థానాలు సాధించే తమిళ నేషనల్ అలయెన్స్(టీఎన్ఏ) ఈ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిని పది సీట్లకు పరిమితమైంది. రాజపక్స సోదరులు ఇంతకు ముందు అధికారంలో వున్నప్పటిలాగే ఇప్పుడు కూడా చైనాకు సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ ఎన్నికల్లో వారు విజయం సాధిస్తే దేశం చైనా విష కౌగిలిలోకి పోతుందని విపక్షాలు గట్టిగానే ప్రచారం చేశాయి. రాజపక్స సోదరులు గతంలో తమిళ టైగర్ల అణచి వేతలో చైనా సాయం తీసుకున్నారు. వారి హయాంలో ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల న్నిటా చైనా పెట్టుబడులు విస్తరించాయి. క్రికెట్ స్టేడియం, విమానాశ్రయం, హంబన్‌టోటా నౌకా శ్రయం తదితర నిర్మాణాలన్నిటా చైనాదే హవా. అయితే చెల్లింపులు అసాధ్యం కావడంతో గత్యం తరం లేక హంబన్‌టోటా నౌకాశ్రయాన్ని 2017లో చైనాకే 99 ఏళ్ల లీజుకివ్వాల్సి వచ్చింది. గొతబయ అధ్యక్షుడయ్యాక దేశాన్ని మళ్లీ చైనా విష కౌగిట్లోకి నెడుతున్నారని, పార్లమెంటు ఎన్నికల తర్వాత అది మరింత పెరుగుతుందని ప్రత్యర్థులు ప్రచారం చేశారు. అయితే మెజారిటీవాదం, దేశ భద్రత వంటి అంశాల ముందు ఇవి ఏ మాత్రం పనిచేయలేదు. జనం వాటినే నమ్ముకున్నారు. అవి భద్రంగా వున్నంతకాలం తాము క్షేమంగా వుంటామని భావించారు. పార్లమెంటులో ఆధిక్యత లభిస్తే రాజ్యాంగానికి సవరణలు తీసుకొస్తామని ఎస్ఎల్పీపీ ఇప్పటికే ప్రకటించింది. అధ్యక్ష పదవిలో రెండు దఫాలు మించి కొనసాగడానికి వీల్లేదని చెబుతున్న అధికరణానికి సవరణ తెస్తే వచ్చేసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చని మహిందా ఆశపడుతున్నారు. అది నెరవేరడం ఇప్పుడు సులభం. 19వ రాజ్యాంగ సవరణ కూడా సోదరులకు కంటగింపుగా వుంది. వరసగా పదేళ్లు పాలించి 2015లో మహిందా రాజపక్స ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అధికారంలోకొచ్చిన యూఎన్‌పీ అధ్యక్ష పీఠా నికుండే కార్యనిర్వాహక అధికారాలను కత్తిరించింది. వాటిని ప్రధాని, పార్లమెంటు, ఇతర ప్రజా స్వామిక సంస్థలకు బదలాయించింది. ఇప్పుడు వాటిని తిరగదోడి మళ్లీ అధ్యక్ష పీఠాన్ని శక్తిమంతం చేయాలన్నది రాజపక్స సోదరుల లక్ష్యం. అధ్యక్షుడికి పటిష్టమైన అధికారాలున్నప్పుడే దేశ భద్రత బాగుంటుందని, అధ్యక్ష స్థానంలో వున్నవారు బలహీనంగా వుంటే పాలనలో అసమర్థత పెరుగు తుందని, భద్రతా విధానాలు దెబ్బతింటాయని ఈమధ్యకాలంలో రాజపక్స సోదరులు చెబుతూ వస్తున్నారు. కనుక రాజ్యాంగ సవరణలపైనే వారు ఈసారి దృష్టి కేంద్రీకరించే అవకాశం వుంది. గొతబయ రాజపక్స అధ్యక్షుడైనప్పటినుంచీ అధికార కేంద్రీకరణ పెరిగింది. సైన్యంలోని సీని యర్ అధికారులు, మాజీ సైనికాధికారులను కీలకమైన పదవుల్లో నియమించడం మొదలుపెట్టారు. పాలనలో మంత్రులకు బదులు వీరి ప్రాబల్యమే పెరిగింది. ప్రభుత్వ విధానాల్లోని లోపాల గురించి ప్రశ్నిస్తున్న రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక ఉద్యమకారులు, న్యాయవాదులు, జర్నలిస్టులు వగైరాలను వేధించడం, అరెస్టు చేయడం పరిపాటైంది. మొన్న మార్చిలో పార్లమెంటును రద్దు చేశారు. ఆ మరుసటి నెలలో ఎన్నికలు నిర్వహిద్దామనుకుంటుండగా కరోనా చుట్టుముట్టింది. అయితే దాన్ని కట్టడి చేయడంలో రాజపక్స ప్రభుత్వం విజయం సాధించడం ఎస్ఎల్పీపీకి కలిసొ చ్చింది. ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారికి వణికితే, శ్రీలంక కేవలం 3,000 కేసులకు పరిమి తమైంది. మరణాలు కూడా 11కి మించలేదు. కరోనా నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ప్రచారం హడావుడి పెద్దగా లేదు. ఓటేయడానికి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేశారు. మనిషికి మనిషికి మధ్య మీటర్ దూరం వుండేలా ఓటర్లు బారులు తీరారు. బ్యాలెట్ పేపర్‌పై నచ్చిన అభ్యర్థిని ఎంచుకోవడానికి ఎవరి పెన్ను వారే తెచ్చుకోవాలన్న షరతు పెట్టారు. కనుకనే పోలింగ్‌తో కేసుల సంఖ్య కొత్తగా పెరగలేదు. శ్రీలంక ఆర్థికంగా కష్టాల్లో వుంది. అది అప్పుల్లో కూరుకుపోయింది. 2025 వరకూ ఏడాదికి 400 కోట్ల డాలర్ల చొప్పున విదేశీ రుణాలు చెల్లించాల్సిన పరిస్థితి వుంది. అందుకోసం కొత్త అప్పులు చేయాలి. ఐఎంఎఫ్ వంటి సంస్థల మద్దతుంటేనే ఇదంతా సాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక ఎలా నెట్టుకొస్తుందో వేచిచూడాలి. -
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రతిష్టంభన..!
వాషింగ్టన్ : ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరు చేస్తుంటే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం ఎన్నికలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపించే అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా? లేదా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ ఎన్నికలు జరిగితే ఎలా జరుగుతాయి..? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు ఓటర్లు అంతా బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి ఉందా అనేది అమెరికానే కాక ప్రపంచమంతా విశ్లేషిస్తోంది. ప్రస్తుతం యూఎస్ కరోనా వైరస్ విజృంభిస్తోంది. మొదటితో పోలిస్తే వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో మరో నాలుగు నెలల్లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలపై దేశంలో విసృతమైన చర్చ జరుగుతోంది. అసలు ఎన్నికలు జరుగుతాయా? లేక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి వాయిదా పడతాయా అనేది ఆసక్తికరంగా మారింది. (అమెరికాను వెంటాడుతున్న ‘భూతం’) ట్రంప్ వ్యాఖ్యలపై అనుమానాలు.. కాగా యావత్ ప్రపంచ దేశాలపై ప్రభావం చూపించే అమెరికా అధ్యక్ష ఎన్నికలు గడువు ప్రకారమైతే ఈ ఏడాది నవంబరు 3న జరగాలి. కోవిడ్‌కు తోడు అమెరికాలో సాగుతున్న జాత్యహంకార (జార్జ్ ఫ్లాయిడ్ మృతి) నిరసన ఉద్యమంతో అమెరికా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్, ఆయన సహాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అధ్యక్ష ఎన్నికలపై పలు అనుమానాలను, ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రజలంతా బయటకు వచ్చి పోలింగ్ బూత్‌ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటేనే ఎన్నికలు సజావుగా సాగే అవకాశం ఉందని, ఈ-మెయిల్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందంటూ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతమున్న కరోనా కాలంలో ఓటర్లు బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి లేదు. ఇక ఈ మెయిల్ ఓటింగ్‌కు ట్రంప్ విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధ్యక్షుడికి ఉన్న అధికారాలతో ఎన్నికలు కొంత కాలంపాటు వాయిదా వేసే అవకాశం ఉందటూ రిపబ్లిక్ పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం గమనార్హం. (బిడెన్ వైపే డెమొక్రటిక్ మొగ్గు) రాజ్యాంగంలో ఏముంది? అమెరికాలో ఏ ఎన్నికలైనా వాయిదా వేసుకోవచ్చు. కానీ అధ్యక్ష ఎన్నికలకు ఆ అవకాశం లేదు. ఆ దేశ రాజ్యాంగంలో అధ్యక్ష ఎన్నిక తేదీని అమెరికా స్పష్టంగా నిర్దేశించింది. అధ్యక్షుడు పదవీ బాధ్యతలు స్పీకరించిన చేసిన నాలుగేళ్ళ తర్వాత వచ్చే నవంబరులో తొలి సోమవారం తర్వాతి మంగళవారంనాడు కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టోరల్ కాలేజీకి ఎన్నికలు జరగాలి అని రాజ్యాంగం చెబుతోంది. ఈ తేదీని మార్చాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. ఒకవేళ ట్రంప్ అందుకు సిద్ధమైనా... ప్రస్తుతం డెమొక్రాట్లు ఆధిక్యంలో ఉన్న అమెరికా ప్రతినిధుల సభ అందుకు అంగీకరిస్తుందా అనేది ఆసక్తికరమైన అంశం. నాలుగు నెలల తర్వాత దేశంలో కరోనా ప్రభావం ఎలా ఉంటుందన్నదానిపైనే అధ్యక్ష ఎన్నికలు సకాలంలో జరుగుతాయా లేదా అనేది తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ రాజ్యాంగ సవరణ అంటూ జరిగితే అది సంచలనమే అవుతుంది. కాగా ప్రపంచ యుద్ధాలు లాంటి గడ్డు పరిస్థితులను నేరుగా ఎదుర్కొన్న అమెరికాలో ఇప్పటి వరకు అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడలేదు. కాగా రిపబ్లిక్ పార్టీ తరఫున ట్రంప్ మరోసారి బరిలోకి దిగుతుండగా.. డెమొక్రటిక్ పార్టీ నుంచి జో బిడెన్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లే. -
ఏబీవీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక
సాక్షి, అమరావతి బ్యూరో: ఏబీవీపీ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డా. ఎస్ సుబ్బయ్య (తమిళనాడు), ఆశీష్ చౌహాన్(హిమాచల్‌ప్రదేశ్)లు మళ్లీ ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఎన్నికల్లో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎలక్షన్ ఆధికారి మమతా యాదవ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 27న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరగనున్న ఏబీవీపీ జాతీయ సమావేశాల్లో వీరిద్దరూ బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం ఏడాదిపాటు బాధ్యతలు నిర్వహించనుంది. -
‘స్వర్గం’ నుంచి తీపి కబురు
భూలోక స్వర్గధామంగా పేరున్న హిందూ మహా సముద్రంలోని ఒక చిన్న దేశం మాల్దీవుల్లో ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ ఓటమి పాలయ్యారు. విపక్ష కూటమి అభ్యర్థి ఇబ్రహీం మహమద్ సోలీహ్ ఘన విజయం సాధించారు. యామీన్‌కు 41.7 శాతం ఓట్లు రాగా, విపక్ష అభ్యర్థి సోలిహ్ 58.3 శాతం ఓట్లతో భారీ ఆధిక్యత కనబరిచారు. మొత్తం ఓటర్లలో 89.2 శాతంమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాల్దీవులు 1,190 పగడపు దీవుల సముదాయం...అందులో నివాసయోగ్యమైనవి కేవలం 185 దీవులు మాత్రమే. ఆ దేశ జనాభా నాలుగు లక్షలు మించదు. అందులో మూడు లక్షలమంది సున్నీ ముస్లింలు. అంత చిన్న దేశం ఎన్నికలకు సాధారణంగా పెద్ద ప్రాధాన్యత ఉండదు. కానీ అధ్యక్షుడు యామీన్ నియంతగా మారి సకల వ్యవస్థలనూ ధ్వంసం చేసినందువల్లా... దేశాన్నే జైలుగా మార్చి తన మాటే శాసనంగా చలామణి చేయిస్తున్నందువల్లా తాజా ఎన్నికలు అందరిలోనూ ఎంతో ఉత్కంఠ కలిగించాయి. సింహాసనాన్ని అధిష్టించి ఉన్న నియంత మరో అయిదేళ్లు దాన్నే అంటిపెట్టుకుని ఉండి దేశాన్ని మరింత భ్రష్టు పట్టిస్తాడా లేక జనం ఛీత్కారాలతో నిష్క్రమిస్తాడా అని అందరూ ఆసక్తితో గమనించారు. ఒకరకంగా ఈ ఫలితాన్ని చాలామంది ఊహించలేదని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు మొదలుకొని సైన్యం, పోలీసు విభాగాల వరకూ అన్నిటినీ యామీన్ తన చూపుడు వేలుతో శాసించాడు. ఉదారంగా నజరానాలిచ్చి, లొంగకపోతే కేసులతో వేధించి మీడియాను గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఈ ఎన్నికల సందర్భంగా విపక్షానికి మీడియాలో దాదాపు చోటు దొరకలేదు. తనకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉంటారని భావించిన మాజీ అధ్యక్షుడు అబ్దుల్ గయూంతోపాటు పలువురు రాజకీయ ప్రత్యర్థులను ఉగ్రవాదం ఆరోపణలతో జైళ్లకు పంపాడు. మతం మాటున బలపడాలన్న కాంక్షతో దేశంలో ఛాందసవా దాన్ని పెంచుతూపోయాడు. రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు ఆరోపణలతో నిర్బంధించరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆగ్రహోదగ్రుడై ఆ తీర్పునిచ్చిన ఇద్దరు జడ్జీలను జైలుకు పంపాడు. మరో మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్‌కు ఒక కేసులో కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించగా ఆయన అనారోగ్యం సాకుతో తొలుత బ్రిటన్ వెళ్లిపోయి, ఆ తర్వాత శ్రీలంకలో ప్రవాస జీవితం గడుపుతున్నారు. యామీన్ నిష్క్రమణ మన దేశానికి సంబంధించినంతవరకూ అత్యంత కీలక పరిణామం. అది మన దేశానికి కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ భారత్ అనుకూల ప్రభుత్వం లేకపోవడం భద్రతాపరంగా మనకు సమస్య. యామీన్ రాకముందు మన దేశానికి అక్కడ పలుకుబడి ఉండేది. 1988లో అప్పటి అధ్యక్షుడు అబ్దుల్ గయూంను గద్దె దించడానికి శ్రీలంక తమిళ మిలిటెంట్లతో కలిసి కొందరు కుట్ర చేసి కీలక ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకున్నప్పుడు నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ మన సైన్యాన్ని తరలించి ఆ కుట్రను భగ్నం చేశారు. గయూం పాలన సాగినన్నాళ్లు, ఆ తర్వాత నషీద్ హయాంలోనూ మన దేశంతో సత్సంబంధాలు కొనసాగినా యామీన్ వచ్చాక పరిస్థితులు మారాయి. 2013 నుంచి క్రమేపీ ఆ దేశం చైనా వైపు మొగ్గు చూపటం ప్రారంభించింది. దానికి అనుగుణంగా చైనా భారీయెత్తున పెట్టుబడులు, ఉదా రంగా రుణాలు ఇచ్చింది. ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లను కలుపుతూ చైనా నిర్మించతలపెట్టిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్’(బీఆర్ఐ)లో మాల్దీవులు కూడా భాగస్వామి. కనుకనే అక్కడ ఓడరేవు నిర్మాణానికి చైనా ప్రణాళిక రూపొందించింది. ఇంతక్రితం పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో నిర్మించిన ఓడరేవులు వాటికి భారంగా మారగా, చివరకు చైనాయే వాటిని లీజుకు తీసుకుంది. మున్ముందు మాల్దీవుల్లో కూడా అలాంటి స్థితే ఏర్పడితే మన దేశం చుట్టూ చైనా నావికాదళం మోహరించి నట్టవుతుంది. కనుకనే ఈ పరిణామాలు భారత్‌కు మింగుడు పడలేదు. అయితే చైనా రుణం పెనుభారం కావడంతో స్థానికుల్లో వ్యతిరేకత బయల్దేరింది. చిత్రమేమంటే మలేసియాలో సైతం ఇలాంటి పరిణామాలే అక్కడి చైనా అనుకూల పాలకులను గద్దె దించాయి. వందిమాగధ బృందాల పొగడ్తల రొదలో తన ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ప్రజల్లో ఉన్న వ్యతి రేకతను అధ్యక్షుడు యామీన్ పసిగట్టలేకపోయారు. మీడియాలో అసమ్మతి స్వరం వినబడకుండా చేయడం ఆయనకే ముప్పు తెచ్చింది. 30 ఏళ్లు అవిచ్ఛిన్నంగా దేశాన్నేలిన అబ్దుల్ గయూం, 2008లో తొలిసారి జరిగిన ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల్లో గెలుపొందిన నషీద్ సైతం నియం తృత్వాన్ని చలాయించారు. అబ్దుల్ గయూం తన పాలనాకాలంలో నషీద్‌పై అనేక కేసులు పెట్టి ఆయన్ను జైలు పాలుచేస్తే... ఆ తర్వాత నషీద్ సైతం ఆ పోకడలే పోయారు. 2012లో ఆయన కూడా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అరెస్టు చేయించారు. పర్యవసానంగా ఆ మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో నషీద్ ఓడిపోయి, యామీన్ అధ్యక్షుడిగా గెలిచారు. కానీ ఆయనా అదే బాటలో నడిచారు. ఇప్పుడు యామీన్ తాజాగా ఎన్నికైన ఇబ్రహీం మహ్మద్ సోలిహ్‌కు గడువు ప్రకారం నవంబర్‌లో సక్రమంగా అధికారం అప్పగిస్తారా లేక సైనిక కుట్రకు పాల్పడతారా అన్నది అను మానమే. నిజానికి తాజా ఎన్నికల ఫలితాలను ప్రకటించడంలో ఎన్నికల సంఘం జాప్యం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ చొరవ తీసుకుని అధికారికంగా ఫలితాలు వెలువడకుండానే సోలిహ్‌కు అభి నందనలు తెలిపారు. దాంతో యామీన్ సర్కారు ఓటమిని అంగీకరించక తప్పలేదు. కాబోయే అధ్యక్షుడు మన దేశానికి సన్నిహితుడు. అంతమాత్రాన ఉదాసీనత పనికి రాదు. మాల్దీవులను సమాన స్థాయిలో గౌరవించి, ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఆ దేశం ఎలాంటి సాయం కోరుకుంటున్నదో గమనించి వ్యవహరించాలి. అక్కడి పౌరుల్లో భారత్ వ్యతిరేకతను రెచ్చ గొట్టడానికి మున్ముందు యామీన్ ప్రయత్నిస్తారు. ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. -
వెనిజులా ప్రధానిగా నికోలస్ మడురో
కారకస్ : నికోలస్ మడురో రెండవ సారి కూడా వెనిజులా ప్రధానిగా ఎన్నికయ్యారు. మరో ఆరు సంవత్సరాల పాటు ఆయన వెనిజులా ప్రధానిగా కొనసాగనున్నారు. మొత్తం 90 శాతం ఓట్లు పోల్ కాగా ఇందులో మడురోకు 68 శాతం, ఆయన ప్రత్యర్థి హెన్రీ ఫాల్కన్కు 21శాతం ఓట్లు లభించాయి. ఆదివారం ఎన్నికల అధికారులు మడురోను విజేతగా ప్రకటించారు. కాగా మడురో ఎన్నికలలో రిగ్గింగ్‌కు పాల్పడి నెగ్గినట్లు ఫాల్కన్ ఆరోపిస్తున్నారు. 2018 డిసెంబర్ నెలలో జరగాల్సిన ఎన్నికలను మడురోకు అనుకూలంగా ఉండేలా కొద్ది నెలల ముందుగానే నిర్వహించారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఈ ఎన్నికలు చెల్లవని, వచ్చే ఏడాది కొత్తగా ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తోంది. దేశంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం కారణంగా కేవలం 46శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినిమోగించుకున్నారని ప్రతిపక్షం తెలిపింది. -
రైతు కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు..
న్యూఢిల్లీ: అనూహ్యంగా రాష్ట్రపతి ఎన్నికల్లో తెరపైకి వచ్చి అంతే అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు రామ్‌నాథ్ కోవింద్. ఆయన ఈ నెల 25నే భారతదేశానికి 14వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో దేశ అత్యున్నత పీఠాన్ని రెండోసారి దళితుడు దక్కించుకున్నట్లయింది. గతంలో తొలిసారి దళిత వ్యక్తి అయిన కేఆర్ నారాయణన్ పదో రాష్ట్రపతిగా (1997లో)ఈ పదవిని అలంకరించగా తాజాగా కోవింద్ దక్కించుకున్నారు. గురువారం వెల్లడైన రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో ప్రత్యర్థి మీరా కుమార్‌పై ఆయన భారీ విజయాన్ని రామ్‌నాథ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన విజయం అందరూ ఊహించిందే అయినా.. ఆయనను అభ్యర్థిగా ప్రకటించడం అనేది మాత్రం ఎవ్వరూ ఊహించలేనిది. సాధారణ దళిత రైతు కుటుంబంలో జన్మించి.. కోవింద్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహాత్ జిల్లా దేరాపూర్ తాలూకా పారాంఖ్ గ్రామంలో 1945 అక్టోబర్ 1న దళిత(ఎస్సీ) కోలీ కుటుంబంలో జన్మించారు. కాన్పూర్ వర్సిటీ నుంచి బీకాం, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. 1971లో న్యాయవాదిగా స్థిరపడ్డారు. 197-79 మధ్య ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. సివిల్ సర్వీస్ పరీక్షల్లో మూడో యత్నంలో ఉత్తీర్ణుడైన ఆయన ఐఏఎస్ రాకపోవడంతో న్యాయవాద వృత్తికే అంకితమయ్యారు. 1977 నుంచి కొంతకాలం జనతా పార్టీకి చెందిన అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి ఆర్థిక శాఖకు సం బంధించి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. 198-93 మధ్య సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కాన్సుల్‌గా పనిచేశారు. కోవింద్ 1986లో డిప్రెస్డ్ క్లాసెస్ లీగల్ ఎయిడ్ బ్యూరో జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఆలిండియా కోలీ సమాజ్‌కు నాయకత్వం వహించారు. తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు 1997లో చేసిన ఆందోళనలో పాలుపంచుకున్నారు. రాజకీయాల్లో రామ్‌నాథ్.. ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్న కోవింద్ కమలదళానికి అత్యంత విధేయుడు. బీజేపీ వివాదాస్పద హిందుత్వ రాజకీయాలతో ఆయనకు పెద్దగా సంబంధం లేదు. మతానికంటే బడుగు వర్గాలు సాధికారత రాజకీయాలవైపే ఆయన ప్రధానంగా ఆకర్షితులయ్యారని సన్నిహితులు చెబుతుంటారు. యూపీ రాజకీయాల్లో ఆయనకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సన్నిహితునిగా పేరుంది. కోవింద్ తొలిసారి 1991 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని ఎస్సీ రిజర్వ్డ్ సీటు ఘాటంపూర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 1994, 2006లో బీజేపీ తరఫున రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 12 ఏళ్లు ఎంపీగా పనిచేసి మరుసటి ఏడాది 2007లో తన సొంత జిల్లాలోని భోగినీపూర్ స్థానం నుంచి యూపీ అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల్లో పోటీచేయలేదు. యూపీ బీజేపీ ప్రధానకార్యదర్శిగా పనిచేసిన కోవింద్ 1998-2002 మధ్య బీజేపీ దళిత మోర్చా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్సీ/ఎస్టీ, సామాజిక సాధికారత కమిటీ సహా ఐదు పార్లమెంటరీ కమిటీల్లో ఉన్నారు. 2002లో ఐరాసకు భారత బృందం సభ్యునిగా వెళ్లి అక్కడ ప్రసంగించారు. ప్రచార ఆర్బాటం తక్కువే.. కోవింద్ బీజేపీ జాతీయ ప్రతినిధిగా పనిచేసినా ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఏ చానల్లోనూ సరిగా కనిపించలేదు. పార్టీ, రాజ్‌నాథ్ పట్ల ఉన్న విధేయత కారణంగా 2014లో బీజేపీ అధికారం చేపట్టాక 2015లో కోవింద్‌ను బిహార్ గవర్నర్‌గా నియమించారు. రైతు కుటుంబంలో పుట్టిన కోవింద్‌కు 1974మే 30న సవితతో పెళ్లయింది. వారి సంతానం ప్రశాంత కుమార్, స్వాతి. ముందునుంచే సౌమ్యుడిగా మితభాషిగా పేరున్న రామ్‌నాథ్ మంచి కార్యనిర్వాహకుడిగా పేరుంది. అయితే, గతంలో గోద్రా అల్లర్ల నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వంపై ముస్లిం వ్యతిరేక మచ్చను తుడిచిపెట్టేందుకు నాడు అబ్దుల్ కలాంను ఎంపిక చేసినట్లుగానే నేడు దళితులపై జరుగుతున్న దాడులు, రాజకీయాల్లో దళితుల ప్రాతినిథ్యం పెరుగుతున్న నేపథ్యంలో ఆ వర్గాలను ఆకర్షించేందుకే బీజేపీ రామ్‌నాథ్‌ను తెరపైకి తెచ్చిందని, ఈయనను ఎన్నికల్లో నిలబెట్టడం ద్వారా ఆపరేషన్ 2019 సాధారణ ఎన్నికలు బీజేపీ ప్రారంభించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.