రైతు కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. | ramnath kovind second dalith president to india | Sakshi
Sakshi News home page

రైతు కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు..

Published Thu, Jul 20 2017 5:00 PM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM

రైతు కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు..

రైతు కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు..

న్యూఢిల్లీ: అనూహ్యంగా రాష్ట్రపతి ఎన్నికల్లో తెరపైకి వచ్చి అంతే అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు రామ్‌నాథ్‌ కోవింద్‌. ఆయన ఈ నెల 25నే భారతదేశానికి 14వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో దేశ అత్యున్నత పీఠాన్ని రెండోసారి దళితుడు దక్కించుకున్నట్లయింది. గతంలో తొలిసారి దళిత వ్యక్తి అయిన కేఆర్‌ నారాయణన్‌ పదో రాష్ట్రపతిగా (1997లో)ఈ పదవిని అలంకరించగా తాజాగా కోవింద్‌ దక్కించుకున్నారు. గురువారం వెల్లడైన రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో ప్రత్యర్థి మీరా కుమార్‌పై ఆయన భారీ విజయాన్ని రామ్‌నాథ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన విజయం అందరూ ఊహించిందే అయినా.. ఆయనను అభ్యర్థిగా ప్రకటించడం అనేది మాత్రం ఎవ్వరూ ఊహించలేనిది.

సాధారణ దళిత రైతు కుటుంబంలో జన్మించి..
కోవింద్‌ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ దేహాత్‌ జిల్లా దేరాపూర్‌ తాలూకా పారాంఖ్‌ గ్రామంలో 1945 అక్టోబర్‌ 1న దళిత(ఎస్సీ) కోలీ కుటుంబంలో జన్మించారు. కాన్పూర్‌ వర్సిటీ నుంచి బీకాం, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1971లో న్యాయవాదిగా స్థిరపడ్డారు. 197-79 మధ్య ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో మూడో యత్నంలో ఉత్తీర్ణుడైన ఆయన ఐఏఎస్‌ రాకపోవడంతో న్యాయవాద వృత్తికే అంకితమయ్యారు. 1977 నుంచి కొంతకాలం జనతా పార్టీకి చెందిన అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి ఆర్థిక శాఖకు సం బంధించి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.

198-93 మధ్య సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కాన్సుల్‌గా పనిచేశారు. కోవింద్‌ 1986లో డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగల్‌ ఎయిడ్‌ బ్యూరో జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. ఆలిండియా కోలీ సమాజ్‌కు నాయకత్వం వహించారు. తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు 1997లో చేసిన ఆందోళనలో పాలుపంచుకున్నారు.  

రాజకీయాల్లో రామ్‌నాథ్‌..
ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యమున్న కోవింద్‌ కమలదళానికి అత్యంత విధేయుడు. బీజేపీ వివాదాస్పద హిందుత్వ రాజకీయాలతో ఆయనకు పెద్దగా సంబంధం లేదు. మతానికంటే బడుగు వర్గాలు సాధికారత రాజకీయాలవైపే ఆయన ప్రధానంగా ఆకర్షితులయ్యారని సన్నిహితులు చెబుతుంటారు. యూపీ రాజకీయాల్లో ఆయనకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సన్నిహితునిగా పేరుంది. కోవింద్‌ తొలిసారి 1991 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని ఎస్సీ రిజర్వ్‌డ్‌ సీటు ఘాటంపూర్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు.

తర్వాత 1994, 2006లో బీజేపీ తరఫున రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 12 ఏళ్లు ఎంపీగా పనిచేసి మరుసటి ఏడాది 2007లో తన సొంత జిల్లాలోని భోగినీపూర్‌ స్థానం నుంచి యూపీ అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల్లో పోటీచేయలేదు. యూపీ బీజేపీ ప్రధానకార్యదర్శిగా పనిచేసిన కోవింద్‌ 1998-2002 మధ్య బీజేపీ దళిత మోర్చా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్సీ/ఎస్టీ, సామాజిక సాధికారత కమిటీ సహా ఐదు పార్లమెంటరీ కమిటీల్లో ఉన్నారు. 2002లో ఐరాసకు భారత బృందం సభ్యునిగా వెళ్లి అక్కడ ప్రసంగించారు.  

ప్రచార ఆర్బాటం తక్కువే..
కోవింద్‌ బీజేపీ జాతీయ ప్రతినిధిగా పనిచేసినా ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఏ  చానల్‌లోనూ సరిగా కనిపించలేదు. పార్టీ, రాజ్‌నాథ్‌ పట్ల ఉన్న విధేయత కారణంగా 2014లో బీజేపీ అధికారం చేపట్టాక 2015లో కోవింద్‌ను బిహార్‌ గవర్నర్‌గా నియమించారు. రైతు కుటుంబంలో పుట్టిన కోవింద్‌కు 1974మే 30న సవితతో పెళ్లయింది. వారి సంతానం ప్రశాంత కుమార్, స్వాతి. ముందునుంచే సౌమ్యుడిగా మితభాషిగా పేరున్న రామ్‌నాథ్‌ మంచి కార్యనిర్వాహకుడిగా పేరుంది.

అయితే, గతంలో గోద్రా అల్లర్ల నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వంపై ముస్లిం వ్యతిరేక మచ్చను తుడిచిపెట్టేందుకు నాడు అబ్దుల్‌ కలాంను ఎంపిక చేసినట్లుగానే నేడు దళితులపై జరుగుతున్న దాడులు, రాజకీయాల్లో దళితుల ప్రాతినిథ్యం పెరుగుతున్న నేపథ్యంలో ఆ వర్గాలను ఆకర్షించేందుకే బీజేపీ రామ్‌నాథ్‌ను తెరపైకి తెచ్చిందని, ఈయనను ఎన్నికల్లో నిలబెట్టడం ద్వారా ఆపరేషన్‌ 2019 సాధారణ ఎన్నికలు బీజేపీ ప్రారంభించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement