అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రతిష్టంభన..! | Corona Effect On US President Elections | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రతిష్టంభన..!

Published Mon, Jun 22 2020 8:11 PM | Last Updated on Mon, Jun 22 2020 8:32 PM

Corona Effect On US President Elections - Sakshi

వాషింగ్టన్‌ : ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరు చేస్తుంటే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం ఎన్నికలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపించే అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనుకున్న షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయా? లేదా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ ఎన్నికలు జరిగితే ఎలా జరుగుతాయి..? అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భావిస్తున్నట్లు ఓటర్లు అంతా బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి ఉందా అనేది అమెరికానే కాక ప్రపంచమంతా విశ్లేషిస్తోంది. ప్రస్తుతం యూఎస్‌ కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. మొదటితో పోలిస్తే వైరస్‌ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో మరో నాలుగు నెలల్లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలపై దేశంలో విసృతమైన చర్చ జరుగుతోంది. అసలు ఎన్నికలు జరుగుతాయా? లేక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి వాయిదా పడతాయా అనేది ఆసక్తికరంగా మారింది. (అమెరికాను వెంటాడుతున్న ‘భూతం’)

ట్రంప్‌ వ్యాఖ్యలపై అనుమానాలు..
కాగా యావత్‌ ప్రపంచ దేశాలపై ప్రభావం చూపించే అమెరికా అధ్యక్ష ఎన్నికలు గడువు ప్రకారమైతే ఈ ఏడాది నవంబరు 3న జరగాలి. కోవిడ్‌కు తోడు  అమెరికాలో సాగుతున్న జాత్యహంకార (జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి) నిరసన ఉద్యమంతో అమెరికా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సహాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అధ్యక్ష ఎన్నికలపై పలు అనుమానాలను, ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రజలంతా బయటకు వచ్చి పోలింగ్‌ బూత్‌ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటేనే ఎన్నికలు సజావుగా సాగే అవకాశం ఉందని, ఈ-మెయిల్‌ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందంటూ ట్రంప్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతమున్న కరోనా కాలంలో ఓటర్లు బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి లేదు. ఇక ఈ మెయిల్‌ ఓటింగ్‌కు ట్రంప్‌ విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధ్యక్షుడికి ఉన్న అధికారాలతో ఎన్నికలు కొంత కాలంపాటు వాయిదా వేసే అవకాశం ఉందటూ రిపబ్లిక్‌ పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్‌ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం గమనార్హం. (బిడెన్‌ వైపే డెమొక్రటిక్‌ మొగ్గు)

రాజ్యాంగంలో ఏముంది?
అమెరికాలో ఏ ఎన్నికలైనా వాయిదా వేసుకోవచ్చు. కానీ అధ్యక్ష ఎన్నికలకు ఆ అవకాశం లేదు. ఆ దేశ రాజ్యాంగంలో అధ్యక్ష ఎన్నిక తేదీని అమెరికా స్పష్టంగా  నిర్దేశించింది. అధ్యక్షుడు పదవీ బాధ్యతలు స్పీకరించిన చేసిన నాలుగేళ్ళ తర్వాత వచ్చే నవంబరులో తొలి సోమవారం తర్వాతి మంగళవారంనాడు కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టోరల్‌ కాలేజీకి ఎన్నికలు జరగాలి అని రాజ్యాంగం చెబుతోంది. ఈ తేదీని మార్చాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. ఒకవేళ ట్రంప్‌ అందుకు సిద్ధమైనా... ప్రస్తుతం డెమొక్రాట్లు ఆధిక్యంలో ఉన్న అమెరికా ప్రతినిధుల సభ అందుకు అంగీకరిస్తుందా అనేది  ఆసక్తికరమైన అంశం. నాలుగు నెలల తర్వాత దేశంలో కరోనా ప్రభావం ఎలా ఉంటుందన్నదానిపైనే అధ్యక్ష ఎన్నికలు సకాలంలో జరుగుతాయా లేదా అనేది తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ రాజ్యాంగ సవరణ అంటూ జరిగితే అది సంచలనమే అవుతుంది. కాగా ప్రపంచ యుద్ధాలు లాంటి గడ్డు పరిస్థితులను నేరుగా ఎదుర్కొన్న అమెరికాలో ఇప్పటి వరకు అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడలేదు. కాగా రిపబ్లిక్‌ పార్టీ తరఫున ట్రంప్‌ మరోసారి బరిలోకి దిగుతుండగా.. డెమొక‍్రటిక్‌ పార్టీ నుంచి జో బిడెన్‌ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement