శ్రీలంకలో బుధవారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో శ్రీలంక పొదుజన పెరమున(ఎస్‌ఎల్‌పీపీ)కి ఊహకు మించిన మెజారిటీ లభించింది. నిరుడు నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 52.25 శాతం ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీకి ఈసారి కూడా అత్యధిక స్థానాలొస్తాయని అందరూ అనుకున్నదే. కానీ దాదాపు మూడింట రెండొంతుల మెజారిటీ వస్తుందని ఎవరూ వూహించలేదు. 225 స్థానా లున్న పార్లమెంటులో ఎస్‌ఎల్‌పీపీకి 145 స్థానాలొచ్చాయి. ఒకప్పుడు జాతి ఘర్షణలకు నిలయమైన శ్రీలంకలో గెలుపు సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలో ఎస్‌ఎల్‌పీపీకి బాగానే తెలుసు. సింహళ మెజారిటీవాదం, దేశభద్రత అనే రెండు అంశాలే దానికి ప్రధాన అస్త్రాలయ్యాయి. నిరుడు అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆ పార్టీకి అవే అక్కరకొచ్చాయి. 2 కోట్ల 20 లక్షలమంది జనాభా గల శ్రీలంకలో 26 ఏళ్లపాటు కొనసాగిన తమిళ గెరిల్లాల పోరు 2009తో పరిసమాప్తమయింది.
తమిళ ఈలం కోసం పోరాడిన లిబరేషన్ టైగర్లను రక్షణమంత్రిగా వుంటూ అణిచివేసిన గొతబయ రాజపక్స నిరుడు దేశా ధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తన సోదరుడు, మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సను ప్రధా నిగా నియమించారు. తాజా ఎన్నికలు వారి కుటుంబ పాలనను సుస్థిరం చేయడంతోపాటు తిరుగు లేని అధికారాన్ని కట్టబెట్టాయి. ప్రతిపక్షాలు కనీసం ఎస్‌ఎల్‌పీపీ దరిదాపుల్లో కూడా లేవు. నిరుడు అధ్యక్ష ఎన్నికల్లో 41.99 శాతం ఓట్లు తెచ్చుకుని, అధికారం కోల్పోయిన యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ)కి ఈసారి దక్కింది ఒకే ఒక స్థానం. మాజీ ప్రధాని రనిల్ విక్రమసింఘే నాయకత్వం లోని ఆ పార్టీ నుంచి విడివడి సమగి జన బలవెగయ(ఎస్‌జేబీ) పార్టీ స్థాపించిన సజిత్ ప్రేమదాసకు 54 స్థానాలు దక్కాయి. తమిళ జనాభా అధికంగా వున్న ప్రాంతాల్లో మెజారిటీ స్థానాలు సాధించే తమిళ నేషనల్ అలయెన్స్(టీఎన్‌ఏ) ఈ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిని పది సీట్లకు పరిమితమైంది.
రాజపక్స సోదరులు ఇంతకు ముందు అధికారంలో వున్నప్పటిలాగే ఇప్పుడు కూడా చైనాకు సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ ఎన్నికల్లో వారు విజయం సాధిస్తే దేశం చైనా విష కౌగిలిలోకి పోతుందని విపక్షాలు గట్టిగానే ప్రచారం చేశాయి. రాజపక్స సోదరులు గతంలో తమిళ టైగర్ల అణచి వేతలో చైనా సాయం తీసుకున్నారు. వారి హయాంలో ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల న్నిటా చైనా పెట్టుబడులు విస్తరించాయి. క్రికెట్ స్టేడియం, విమానాశ్రయం, హంబన్‌టోటా నౌకా శ్రయం తదితర నిర్మాణాలన్నిటా చైనాదే హవా. అయితే చెల్లింపులు అసాధ్యం కావడంతో గత్యం తరం లేక హంబన్‌టోటా నౌకాశ్రయాన్ని 2017లో చైనాకే 99 ఏళ్ల లీజుకివ్వాల్సి వచ్చింది. గొతబయ అధ్యక్షుడయ్యాక దేశాన్ని మళ్లీ చైనా విష కౌగిట్లోకి నెడుతున్నారని, పార్లమెంటు ఎన్నికల తర్వాత అది మరింత పెరుగుతుందని ప్రత్యర్థులు ప్రచారం చేశారు. అయితే మెజారిటీవాదం, దేశ భద్రత వంటి అంశాల ముందు ఇవి ఏ మాత్రం పనిచేయలేదు. జనం వాటినే నమ్ముకున్నారు. అవి భద్రంగా వున్నంతకాలం తాము క్షేమంగా వుంటామని భావించారు.
పార్లమెంటులో ఆధిక్యత లభిస్తే రాజ్యాంగానికి సవరణలు తీసుకొస్తామని ఎస్‌ఎల్‌పీపీ ఇప్పటికే ప్రకటించింది. అధ్యక్ష పదవిలో రెండు దఫాలు మించి కొనసాగడానికి వీల్లేదని చెబుతున్న అధికరణానికి సవరణ తెస్తే వచ్చేసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చని మహిందా ఆశపడుతున్నారు. అది నెరవేరడం ఇప్పుడు సులభం. 19వ రాజ్యాంగ సవరణ కూడా సోదరులకు కంటగింపుగా వుంది. వరసగా పదేళ్లు పాలించి 2015లో మహిందా రాజపక్స ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అధికారంలోకొచ్చిన యూఎన్‌పీ అధ్యక్ష పీఠా నికుండే కార్యనిర్వాహక అధికారాలను కత్తిరించింది. వాటిని ప్రధాని, పార్లమెంటు, ఇతర ప్రజా స్వామిక సంస్థలకు బదలాయించింది. ఇప్పుడు వాటిని తిరగదోడి మళ్లీ అధ్యక్ష పీఠాన్ని శక్తిమంతం చేయాలన్నది రాజపక్స సోదరుల లక్ష్యం. అధ్యక్షుడికి పటిష్టమైన అధికారాలున్నప్పుడే దేశ భద్రత బాగుంటుందని, అధ్యక్ష స్థానంలో వున్నవారు బలహీనంగా వుంటే పాలనలో అసమర్థత పెరుగు తుందని, భద్రతా విధానాలు దెబ్బతింటాయని ఈమధ్యకాలంలో రాజపక్స సోదరులు చెబుతూ వస్తున్నారు. కనుక రాజ్యాంగ సవరణలపైనే వారు ఈసారి దృష్టి కేంద్రీకరించే అవకాశం వుంది.
గొతబయ రాజపక్స అధ్యక్షుడైనప్పటినుంచీ అధికార కేంద్రీకరణ పెరిగింది. సైన్యంలోని సీని యర్ అధికారులు, మాజీ సైనికాధికారులను కీలకమైన పదవుల్లో నియమించడం మొదలుపెట్టారు. పాలనలో మంత్రులకు బదులు వీరి ప్రాబల్యమే పెరిగింది. ప్రభుత్వ విధానాల్లోని లోపాల గురించి ప్రశ్నిస్తున్న రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక ఉద్యమకారులు, న్యాయవాదులు, జర్నలిస్టులు వగైరాలను వేధించడం, అరెస్టు చేయడం పరిపాటైంది. మొన్న మార్చిలో పార్లమెంటును రద్దు చేశారు. ఆ మరుసటి నెలలో ఎన్నికలు నిర్వహిద్దామనుకుంటుండగా కరోనా చుట్టుముట్టింది. అయితే దాన్ని కట్టడి చేయడంలో రాజపక్స ప్రభుత్వం విజయం సాధించడం ఎస్‌ఎల్‌పీపీకి కలిసొ చ్చింది. ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారికి వణికితే, శ్రీలంక కేవలం 3,000 కేసులకు పరిమి తమైంది. మరణాలు కూడా 11కి మించలేదు. కరోనా నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ప్రచారం హడావుడి పెద్దగా లేదు. ఓటేయడానికి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేశారు. మనిషికి మనిషికి మధ్య మీటర్ దూరం వుండేలా ఓటర్లు బారులు తీరారు. బ్యాలెట్ పేపర్‌పై నచ్చిన అభ్యర్థిని ఎంచుకోవడానికి ఎవరి పెన్ను వారే తెచ్చుకోవాలన్న షరతు పెట్టారు. కనుకనే పోలింగ్‌తో కేసుల సంఖ్య కొత్తగా పెరగలేదు. శ్రీలంక ఆర్థికంగా కష్టాల్లో వుంది. అది అప్పుల్లో కూరుకుపోయింది. 2025 వరకూ ఏడాదికి 400 కోట్ల డాలర్ల చొప్పున విదేశీ రుణాలు చెల్లించాల్సిన పరిస్థితి వుంది. అందుకోసం కొత్త అప్పులు చేయాలి. ఐఎంఎఫ్ వంటి సంస్థల మద్దతుంటేనే ఇదంతా సాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక ఎలా నెట్టుకొస్తుందో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment