Mahinda Rajapakse
-
తమిళుల ఆకాంక్షలు నెరవేర్చండి
న్యూఢిల్లీ: శ్రీలంకలో మైనార్టీ వర్గమైన తమిళ ప్రజలకు మరిన్ని పాలనాధికారాలు కల్పించేందుకు ఉద్దేశించిన 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్సకు భారత ప్రధాని మోదీ సూచించారు. తమిళులు సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవం కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలను నెరవేర్చాలని మోదీ చెప్పారు. మోదీ, రాజపక్స శనివారం వర్చువల్ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొన్నారు. తమిళులకు అధికారాలను బదిలీ చేయాల్సిన అవసరాన్ని మోదీ ప్రస్తావించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. లంకలో శాంతి, తమిళ వర్గంతో సయోధ్య కోసం 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని మోదీ పేర్కొన్నారు. 1987లో ఇండో–శ్రీలంక ఒప్పందం తర్వాత 13వ రాజ్యాంగ సవరణ జరిగింది. అయితే, ఇది ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ద్వైపాక్షిక సదస్సులో మోదీ, రాజపక్స పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. రక్షణ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. లంకతో బౌద్ధపరమైన సంబంధాలను ప్రోత్సహించడానికి 15 మిలియన్ డాలర్ల సాయం అందించనున్నట్లు ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు. శ్రీలంకలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహీందా రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్ విజయం సాధించడం ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి దోహదపడుతుందని మోదీ అన్నారు. -
రాజపక్స బ్రదర్స్ హవా
శ్రీలంకలో బుధవారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో శ్రీలంక పొదుజన పెరమున(ఎస్ఎల్పీపీ)కి ఊహకు మించిన మెజారిటీ లభించింది. నిరుడు నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 52.25 శాతం ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీకి ఈసారి కూడా అత్యధిక స్థానాలొస్తాయని అందరూ అనుకున్నదే. కానీ దాదాపు మూడింట రెండొంతుల మెజారిటీ వస్తుందని ఎవరూ వూహించలేదు. 225 స్థానా లున్న పార్లమెంటులో ఎస్ఎల్పీపీకి 145 స్థానాలొచ్చాయి. ఒకప్పుడు జాతి ఘర్షణలకు నిలయమైన శ్రీలంకలో గెలుపు సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలో ఎస్ఎల్పీపీకి బాగానే తెలుసు. సింహళ మెజారిటీవాదం, దేశభద్రత అనే రెండు అంశాలే దానికి ప్రధాన అస్త్రాలయ్యాయి. నిరుడు అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆ పార్టీకి అవే అక్కరకొచ్చాయి. 2 కోట్ల 20 లక్షలమంది జనాభా గల శ్రీలంకలో 26 ఏళ్లపాటు కొనసాగిన తమిళ గెరిల్లాల పోరు 2009తో పరిసమాప్తమయింది. తమిళ ఈలం కోసం పోరాడిన లిబరేషన్ టైగర్లను రక్షణమంత్రిగా వుంటూ అణిచివేసిన గొతబయ రాజపక్స నిరుడు దేశా ధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తన సోదరుడు, మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సను ప్రధా నిగా నియమించారు. తాజా ఎన్నికలు వారి కుటుంబ పాలనను సుస్థిరం చేయడంతోపాటు తిరుగు లేని అధికారాన్ని కట్టబెట్టాయి. ప్రతిపక్షాలు కనీసం ఎస్ఎల్పీపీ దరిదాపుల్లో కూడా లేవు. నిరుడు అధ్యక్ష ఎన్నికల్లో 41.99 శాతం ఓట్లు తెచ్చుకుని, అధికారం కోల్పోయిన యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ)కి ఈసారి దక్కింది ఒకే ఒక స్థానం. మాజీ ప్రధాని రనిల్ విక్రమసింఘే నాయకత్వం లోని ఆ పార్టీ నుంచి విడివడి సమగి జన బలవెగయ(ఎస్‌జేబీ) పార్టీ స్థాపించిన సజిత్ ప్రేమదాసకు 54 స్థానాలు దక్కాయి. తమిళ జనాభా అధికంగా వున్న ప్రాంతాల్లో మెజారిటీ స్థానాలు సాధించే తమిళ నేషనల్ అలయెన్స్(టీఎన్ఏ) ఈ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిని పది సీట్లకు పరిమితమైంది. రాజపక్స సోదరులు ఇంతకు ముందు అధికారంలో వున్నప్పటిలాగే ఇప్పుడు కూడా చైనాకు సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ ఎన్నికల్లో వారు విజయం సాధిస్తే దేశం చైనా విష కౌగిలిలోకి పోతుందని విపక్షాలు గట్టిగానే ప్రచారం చేశాయి. రాజపక్స సోదరులు గతంలో తమిళ టైగర్ల అణచి వేతలో చైనా సాయం తీసుకున్నారు. వారి హయాంలో ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల న్నిటా చైనా పెట్టుబడులు విస్తరించాయి. క్రికెట్ స్టేడియం, విమానాశ్రయం, హంబన్‌టోటా నౌకా శ్రయం తదితర నిర్మాణాలన్నిటా చైనాదే హవా. అయితే చెల్లింపులు అసాధ్యం కావడంతో గత్యం తరం లేక హంబన్‌టోటా నౌకాశ్రయాన్ని 2017లో చైనాకే 99 ఏళ్ల లీజుకివ్వాల్సి వచ్చింది. గొతబయ అధ్యక్షుడయ్యాక దేశాన్ని మళ్లీ చైనా విష కౌగిట్లోకి నెడుతున్నారని, పార్లమెంటు ఎన్నికల తర్వాత అది మరింత పెరుగుతుందని ప్రత్యర్థులు ప్రచారం చేశారు. అయితే మెజారిటీవాదం, దేశ భద్రత వంటి అంశాల ముందు ఇవి ఏ మాత్రం పనిచేయలేదు. జనం వాటినే నమ్ముకున్నారు. అవి భద్రంగా వున్నంతకాలం తాము క్షేమంగా వుంటామని భావించారు. పార్లమెంటులో ఆధిక్యత లభిస్తే రాజ్యాంగానికి సవరణలు తీసుకొస్తామని ఎస్ఎల్పీపీ ఇప్పటికే ప్రకటించింది. అధ్యక్ష పదవిలో రెండు దఫాలు మించి కొనసాగడానికి వీల్లేదని చెబుతున్న అధికరణానికి సవరణ తెస్తే వచ్చేసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చని మహిందా ఆశపడుతున్నారు. అది నెరవేరడం ఇప్పుడు సులభం. 19వ రాజ్యాంగ సవరణ కూడా సోదరులకు కంటగింపుగా వుంది. వరసగా పదేళ్లు పాలించి 2015లో మహిందా రాజపక్స ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అధికారంలోకొచ్చిన యూఎన్‌పీ అధ్యక్ష పీఠా నికుండే కార్యనిర్వాహక అధికారాలను కత్తిరించింది. వాటిని ప్రధాని, పార్లమెంటు, ఇతర ప్రజా స్వామిక సంస్థలకు బదలాయించింది. ఇప్పుడు వాటిని తిరగదోడి మళ్లీ అధ్యక్ష పీఠాన్ని శక్తిమంతం చేయాలన్నది రాజపక్స సోదరుల లక్ష్యం. అధ్యక్షుడికి పటిష్టమైన అధికారాలున్నప్పుడే దేశ భద్రత బాగుంటుందని, అధ్యక్ష స్థానంలో వున్నవారు బలహీనంగా వుంటే పాలనలో అసమర్థత పెరుగు తుందని, భద్రతా విధానాలు దెబ్బతింటాయని ఈమధ్యకాలంలో రాజపక్స సోదరులు చెబుతూ వస్తున్నారు. కనుక రాజ్యాంగ సవరణలపైనే వారు ఈసారి దృష్టి కేంద్రీకరించే అవకాశం వుంది. గొతబయ రాజపక్స అధ్యక్షుడైనప్పటినుంచీ అధికార కేంద్రీకరణ పెరిగింది. సైన్యంలోని సీని యర్ అధికారులు, మాజీ సైనికాధికారులను కీలకమైన పదవుల్లో నియమించడం మొదలుపెట్టారు. పాలనలో మంత్రులకు బదులు వీరి ప్రాబల్యమే పెరిగింది. ప్రభుత్వ విధానాల్లోని లోపాల గురించి ప్రశ్నిస్తున్న రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక ఉద్యమకారులు, న్యాయవాదులు, జర్నలిస్టులు వగైరాలను వేధించడం, అరెస్టు చేయడం పరిపాటైంది. మొన్న మార్చిలో పార్లమెంటును రద్దు చేశారు. ఆ మరుసటి నెలలో ఎన్నికలు నిర్వహిద్దామనుకుంటుండగా కరోనా చుట్టుముట్టింది. అయితే దాన్ని కట్టడి చేయడంలో రాజపక్స ప్రభుత్వం విజయం సాధించడం ఎస్ఎల్పీపీకి కలిసొ చ్చింది. ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారికి వణికితే, శ్రీలంక కేవలం 3,000 కేసులకు పరిమి తమైంది. మరణాలు కూడా 11కి మించలేదు. కరోనా నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ప్రచారం హడావుడి పెద్దగా లేదు. ఓటేయడానికి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేశారు. మనిషికి మనిషికి మధ్య మీటర్ దూరం వుండేలా ఓటర్లు బారులు తీరారు. బ్యాలెట్ పేపర్‌పై నచ్చిన అభ్యర్థిని ఎంచుకోవడానికి ఎవరి పెన్ను వారే తెచ్చుకోవాలన్న షరతు పెట్టారు. కనుకనే పోలింగ్‌తో కేసుల సంఖ్య కొత్తగా పెరగలేదు. శ్రీలంక ఆర్థికంగా కష్టాల్లో వుంది. అది అప్పుల్లో కూరుకుపోయింది. 2025 వరకూ ఏడాదికి 400 కోట్ల డాలర్ల చొప్పున విదేశీ రుణాలు చెల్లించాల్సిన పరిస్థితి వుంది. అందుకోసం కొత్త అప్పులు చేయాలి. ఐఎంఎఫ్ వంటి సంస్థల మద్దతుంటేనే ఇదంతా సాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక ఎలా నెట్టుకొస్తుందో వేచిచూడాలి. -
పార్లమెంటు సస్పెన్షన్ ఎత్తివేత
కొలంబో: శ్రీలంకలో రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఈ నెల 16 వరకు పార్లమెంటును తాత్కాలికంగా రద్దు చేసిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వెనక్కు తగ్గారు. గత షెడ్యూల్ ప్రకారమే సోమవారమైన నవంబర్ 5న యథావిధిగా పార్లమెంటు భేటీ కావాలని గురువారం అధ్యక్షుడు ఆదేశించినట్లు అధికారులు చెప్పారు. పార్లమెంటు సోమవారమే భేటీ అవుతుందన్న సమాచారం అవాస్తవమనీ, ఇది ప్రజలను తప్పుదారి పట్టించే వార్త అని సిరిసేన పార్టీకి చెందిన నాయకుడు సుశీల్ ప్రేమజయంత అన్నారు. ఈ నిర్ణయంతో శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం ఉంది. ఇప్పటికీ తానే దేశానికి అసలైన ప్రధానిననీ, విశ్వాసపరీక్షలో తామే విజయం సాధిస్తామని పదవీచ్యుత ప్రధాని రణిల్ విక్రమసింఘే ధీమా వ్యక్తం చేశారు. మూడున్నరేళ్ల క్రితం సిరిసేన, విక్రమసింఘేల పార్టీలు కలిసి శ్రీలంకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఇటీవలి కాలంలో ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలు తీవ్రంగా పెరిగిపోయాయి. దీంతో అధ్యక్షుడిగా ఉన్న సిరిసేన.. గత నెలలో విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి దించేశారు. మాజీ అధ్యక్షుడు రాజపక్సతో సిరిసేన చేతులు కలిపి ఆయనను కొత్త ప్రధానిగా నియమించారు. దీంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. పార్లమెంటులో అత్యధిక మంది సభ్యులు తమ పార్టీవారేననీ, ప్రజలు ఎన్నుకున్న అసలైన ప్రధానిని తానేనని విక్రమసింఘే వాదిస్తూ వచ్చారు. తనను పదవి నుంచి దించేస్తూ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం అక్రమమని ఆయన ఆరోపించారు. పార్లమెంటులో తన బలాన్ని నిరూపించుకునేందుకు వెంటనే సభను సమావేశపరిచి విశ్వాసపరీక్షను నిర్వహించాలని విక్రమసింఘే గతంలో డిమాండ్ చేశారు. అయితే సిరిసేన అందుకు విరుద్ధంగా పార్లమెంటును ఈ నెల 16 వరకు సుప్తచేతనావస్థలోకి పంపారు. పరిస్థితి ఇలాగే ఉంటే దేశంలో తీవ్ర హింసాత్మక పరిస్థితులు తలెత్తుతాయని పార్లమెంటు స్పీకర్ కరూ జయసూర్య అధ్యక్షుణ్ని హెచ్చరించారు. విక్రమసింఘేనే ప్రధానిగా గుర్తిస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రపంచ దేశాలు కూడా రాజ్యాంగాన్ని అనుసరించాల్సిందిగా శ్రీలంక రాజకీయ పార్టీలను కోరాయి. ఫిరాయింపులు పూర్తయినట్లేనా? వాస్తవానికి శ్రీలంక పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5నే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే విక్రమసింఘేను సిరిసేన పదవి నుంచి దించేయడంతో పార్లమెంటును అత్యవసరంగా సమావేశపరిచి విశ్వాసపరీక్ష నిర్వహించాల్సిందిగా విక్రమసింఘే కోరారు. అందుకు విరుద్దంగా అధ్యక్షుడు పార్లమెంటును 16వ తేదీ వరకు సుస్తచేతనావస్థలోకి పంపారు. కాగా, పార్లమెంటులోని మొత్తం సభ్యుల సంఖ్య 225 కాగా, విశ్వాసపరీక్షలో నెగ్గేందుకు కనీసం 113 మంది సభ్యుల మద్దతు కావాలి. అయితే సిరిసేన–రాజపక్సల పార్టీలు రెండూ కలిసినా పార్లమెంటులో వారి బలం 95 మాత్రమే. అటు విక్రమసింఘే పార్టీకి సొంతంగా 106 మంది సభ్యులు ఉండటంతోపాటు కొన్ని చిన్న పార్టీల మద్దతు కూడా ఉంది. దీంతో ఎక్కువ సమయం తీసుకుని మరింత మంది సభ్యుల మద్దతు కూడగట్టి విశ్వాసపరీక్షలో రాజపక్స నెగ్గేందుకే అధ్యక్షుడు సభను తాత్కాలికంగా రద్దు చేశారని వార్తలు ఉన్నాయి. ఇప్పటికే ఆరుగురు సభ్యులు విక్రమ సింఘే వైపు నుంచి రాజపక్స వైపుకు మారిపోయారు. మరోవైపు పార్లమెంటును 16 వరకు రద్దు చేసినప్పటికీ మళ్లీ సోమవారం అధ్యక్షుడు సమావేశపరుస్తున్నారు. అంటే బలపరీక్షలో గెలిచేందుకు అవసరమైనంత మంది సభ్యులను ఇప్పటికే రాజపక్స తనవైపునకు తిప్పుకున్నారా అని ప్రశ్న తలెత్తుతోంది. విశ్వాసపరీక్షలో ఎవరు నెగ్గుతారో తెలుసుకునేందుకు ఆ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
3రోజుల తర్వాత మళ్లీ ప్రధానిగా!
కొలంబో: శ్రీలంకలో రాజకీయ సంక్షోభం రోజురోజుకి ముదురుతోంది. రణిల్ విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి తొలగిస్తూ.. ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంట్ స్పీకర్ కరు జయసూరియ వ్యతిరేకించారు. చట్టపరంగా విక్రమసింఘే ప్రధాని అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా ఈ వివాదంపై సిరిసేనకు ఓ లేఖ రాశారు. పార్లమెంట్‌ను నవంబర్ 16 వరకు మూసివేయడం మరింత రాజకీయ సంక్షోభానికి దారితీస్తుందని పేర్కొన్నారు. వేరే వ్యక్తి పార్లమెంటులో మెజారిటీ నిరూపించుకునేంతవరకు విక్రమసింఘే ప్రధానిగా కొనసాగుతారని తెలిపారు. కాగా, శుక్రవారం రోజున విక్రమసింఘేను పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న సిరిసేన, దేశ మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను ప్రధానిగా నియమించారు. అంతేకాకుండా విక్రమసింఘేకు భద్రత ఉపసంహరిస్తున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో విక్రమసింఘే పార్లమెంటును అత్యవసరంగా సమావేశపరచాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో మూడు వారాల పాటు పార్లమెంట్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు సిరిసేన ప్రకటించిన సంగతి తెలిసిందే. హింసాత్మకంగా మారుతున్న వైనం శ్రీలంకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఆదివారం హింసాత్మకంగా మారింది. ఎంపీ అర్జున రణతుంగా సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పులో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్టు పోలీసు అధికారులు తెలిపారు. విక్రమసింఘే క్యాబినేట్లో పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేసిన రణతుంగా.. సిరిసేన శనివారం క్యాబినేట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆ పదవిని కొల్పోయారు. అయితే ఆదివారం రోజున ఆయన తన ఆఫీసులోకి వెళ్లే సమయంలో అక్కడ ఉన్న సముహంపై సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. అలాగే కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: శ్రీలంక పార్లమెంటు రద్దు -
మరణశిక్ష పడిన తమిళ జాలర్ల విడుదల
న్యూఢిల్లీ: మరణశిక్ష పడిన ఐదుగురు తమిళ జాలర్లను శ్రీలంక విడుదల చేసింది. వీరికి విధించిన మరణశిక్షను శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే రద్దు చేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కొలంబోలోని భారత అధికారులకు ఈ ఐదుగురిని అప్పగించారని తెలిపాయి. భారత్ నుంచి శ్రీలంకకు మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేశారన్న నేరంపై కొలంబో హైకోర్టు అక్టోబర్ 30న వీరికి మరణశిక్ష విధించింది. వీరికి విధించిన శిక్షను రద్దు చేయాలని భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు చివరకు ఫలించాయి.