వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్న వేళ మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
కాగా, అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవడంపై ఆయన కుటుంబంలో కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. బైడెన్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే, బైడెన్‌ను ఇలా సడెన్‌గా అధ్యక్ష ఎన్నికల నుంచి సొంత పార్టీ నేతలే తప్పుకోమనడం సరైన పద్దతి కాదంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నట్టు ఎన్‌బీసీ న్యూస్ రాసుకొచ్చింది. అలాగే, తన రాజకీయ జీవితంలో బైడెన్ అమెరికన్లకు ఎంతో సేవ చేశారని వారు గుర్తు చేస్తున్నారు. ఇక, తాజాగా బైడెన్ కోవిడ్ బారినపడిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలగాలని సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు పెరుగుతున్న వేళ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష రేసులో కొనసాగడంపై బైడెన్ పరిశీలిస్తున్నట్టు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ వారాంతంలోపే దీనిపై ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు.. నవంబరులో జరిగే ఎన్నికల్లో తాను గెలిచే అవకాశాలు లేవనే వాస్తవాన్ని బైడెన్ అంగీకరించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అధ్యక్షుడి సన్నిహితులు వెల్లడించారు. సొంత పార్టీ నుంచి డిమాండ్లు వస్తున్న వేళ ఆయన రేసు నుంచి వైదొలిగే అవకాశాలున్నట్లు వారు చెప్పారు అని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.
ఇక, ఇటీవల కొవిడ్ బారిన పడిన బైడెన్ ప్రస్తుతం డెలావర్‌లోని తన ఇంట్లో క్వారెంటైన్‌లో ఉన్నారు. తాను తీవ్ర అనారోగ్యానికి గురైతే అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంపై ఆలోచిస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె పోటీ కోసం సన్నద్ధమవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment