వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో పలు రాష్ట్రాలను భీకర తుపాను వణికిస్తోంది. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలుల ధాటికి ఇళ్లు, కార్యాలయాల పైకప్పులు ఎగిరిపోతున్నాయి. సుడిగాలు లు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కెంటకీలో పరిస్థితి భీతావహంగా మారింది. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన తుపాను అని కెంటకీ గవర్నర్ ఆండీ బెషియర్ శనివారం చెప్పారు. మేఫీల్డ్ నగరంలో ఓ క్యాండిల్ ఫ్యాక్టరీ ధ్వంసమయ్యిందని, శిథిలాల కింద 110 మంది చిక్కుకుపోయారని, వారిలో 70 మందికిపైగా మరణించినట్లు భావిస్తున్నామని తెలిపారు. మృతుల సంఖ్య 100దాటవచ్చన్నారు. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించామన్నారు. 227 మైళ్ల మేర తుపాను ప్రభావం కనిపించిందని గవర్నర్ తెలిపారు. 10 కౌంటీల్లో మరణాలు సంభవించే ప్రమాదం కనిపిస్తోందన్నారు. స్థానిక అధికారులు, నేషనల్ గార్డు సభ్యులు, ఎమర్జెన్సీ వర్కర్స్ మేఫీల్డ్ సిటీలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
ఇల్లినాయిస్ రాష్ట్రం ఎడ్వర్డ్స్‌విల్లేలోని అమెజాన్ సంస్థ గోదాము శుక్రవారం ధ్వంసమయ్యిందని అధికారులు చెప్పారు. పైకప్పుతోపాటు ఒక గోడ కూలిపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో తుపాను హెచ్చరిక అమల్లోనే ఉంది. 100 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. క్రిస్మస్ పండగ సందర్భంగా ఆర్డర్లు అధికంగా ఉండడంతో వారంతా రాత్రిపూట కూడా పనిచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కార్మికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు శనివారం తెల్లవారుజాము నుంచి అధికారులు చర్యలు చేపట్టారు. ఎవరైనా చనిపోయారా? గాయపడ్డారా? అనేది ఇంకా తెలియరాలేదు. ఎడ్వర్డ్స్‌విల్లే ప్రజల క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జర్ అన్నారు. రాష్ట్ర పోలీసులు, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ స్థానిక అధికారులతో కలిసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదంలో చిక్కుకున్న తమ కార్మికులను రక్షించుకోవడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అమెజాన్ అధికార ప్రతినిధి రిచర్డ్ రోచా చెప్పారు. ఆర్కాన్సస్ రాష్ట్రంలో తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. మోనెట్టి మానర్ నర్సింగ్ హోమ్ ధ్వంసం కావడంతో ఒకరు మరణించారు. మరో 20 మంది లోపలే ఉండిపోగా వారిని రక్షించారు. వీరిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. టెన్నెస్సీ రాష్ట్రంలో తుపాను కారణంగా ముగ్గురు మృతిచెందారు. లేక్ కౌంటీలో ఇద్దరు, ఒబియోన్ కౌంటీలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తుపాను బీభత్సంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలకు అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment