Donkey Milk: Importace, Nutritional And Amazing Health Benefits In Telugu - Sakshi
Sakshi News home page

చులకన వద్దు.. గరిటెడైనను చాలు గాడిద పాలు!

Published Fri, Jun 18 2021 1:53 PM | Last Updated on Fri, Jun 18 2021 6:07 PM

Know The Importance Of Donkey Milk It Contains Lots Of Vitamins - Sakshi

సాక్షి, అమరావతి: గాడిదను మనం చాలా చులకనగా చూస్తుంటాం.. ఒరేయ్‌ గాడిదా.. అంటూ దాని పేరును ఓ తిట్టులా వాడేస్తాం. మన దృష్టిలో అవమానానికి మారుపేరుగా మిగిలిన ఆ గాడిద పాలలోమనకు మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అనారోగ్యం బారిన పడినప్పుడు అవి మనకు అక్కరకొస్తున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన తాజా పరిశోధనలు నిగ్గుతేల్చాయి. దేశంలో గాడిద పాల వినియోగం పూర్వకాలం నుంచే ఉన్నా.. పాల కోసమే గాడిదల్ని పెంచే దశకు మనం ఇంకా రాలేదు.

ఆఫ్రికా, పశ్చిమాసియా, ఆసియా ఉపఖండ ప్రాంతాలను మినహాయిస్తే.. అమెరికా, లాటిన్‌ అమెరికా సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో గాడిద పాల వినియోగం పారిశ్రామిక స్థాయికి చేరింది. ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, స్పెయిన్, హాలెండ్, సెర్బియా, బోస్నియా వంటి దేశాల్లో పాల కోసం గాడిదల పెంపకం వాణిజ్య స్థాయిలో కొనసాగుతోంది. యూరోప్‌లో సౌందర్య పోషణ ఉత్పత్తుల్లో గాడిద పాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వయసు మళ్లే ప్రక్రియను గాడిద పాలు ఆలస్యం చేస్తాయన్న నమ్మకం అనాదిగా ఉంది. వయసు మళ్లిన వారు గాడిద పాలను బలవర్ధక ఆహారంగా తీసుకుంటున్నారు. వీటిలో క్యాన్సర్‌ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయని ఇటీవలి పరిశోధనలో తేలింది.

లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో గాడిద పాలను ఔషధంగానే కాకుండా తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. అయితే మన దేశంలో మాత్రం కేవలం ఔషధంగానే తీసుకుంటున్నారు. ఈ పాలు తాగితే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్న నమ్మకం కూడా ఉంది. లీటర్‌ గాడిద పాల ధర సుమారు రూ.2 వేలపైనే ఉంది. ఔషధ వినియోగం కోసం సుమారు 25, 30 మి.లీ. మోతాదులో విక్రయిస్తున్నారు. ఒక్కో మోతాదు ధర రూ.200 నుంచి రూ.300 వరకూ ఉంది. మన ఇళ్ల దగ్గరకొచ్చేవారు 10 మి.గ్రా ఇచ్చి రూ.100 తీసుకుంటున్నారు. సీ విటమిన్‌ పుష్కలంగా ఉన్న గాడిదపాల వినియోగం ఇటీవల కరోనా నేపథ్యంలో బాగా పెరిగింది. 

పుష్కలంగా పోషకాలు

  • గాడిద పాలల్లో విటమిన్‌ సీ, బీ, బీ12, ఈ విటమిన్లతో పాటు, న్యూట్రిన్లు ఉన్నాయి. 
  • ఆవు పాలతో పోలిస్తే గాడిద పాలలో సీ విటమిన్‌ 60 రెట్లు అధికం
  • కీలకమైన ఓమేగా–3, 6తో పాటు ఫ్యాటీ ఆమ్లాలు కూడా పుష్కలం
  • తల్లిపాలతో సమాన స్థాయిలో కేలరీలు, మినరల్స్‌ ఉంటాయి. గేదె పాలతో సమానమైన బలం ఇస్తాయని శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చారు.
  • అప్పుడే పుట్టిన పిల్లల్లో ఆస్తమా, క్షయ, గొంతు సంబంధిత వ్యాధుల నివారణ కోసం తయారు చేసే ఆయుర్వేద మందుల్లో గాడిద పాలను వినియోగిస్తారు.
  • నవజాత శిశువులకు పూర్తి పోషకాలను అందించడంతో పాటు చర్మవ్యాధులను నయం చేస్తాయి.
  • గాడిద పాలల్లో ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తక్కువ. ఆవుల వల్ల వచ్చే ఎలర్జీ వ్యాధులు గాడిద పాలతో నయమవుతాయి. 
  • గాడిద పాలలో కాల్షియం ఎక్కువ. పిల్లల్లో ఎముకలను పటిష్ట పర్చడం, విరిగిన ఎముకలను అతికించే స్వభావం వీటికి ఉంది. 
  • ఈ పాల వినియోగంతో ఉబ్బసం, సోరియాసిస్, ఎగ్జిమా వంటి వ్యాధులు నయమైనట్టు ఇటీవల సైప్రస్‌ వర్సిటీ నిర్ధారించింది.


కొవ్వు శాతం చాలా తక్కువ 
గాడిద పాలు తల్లి పాలకు దగ్గర ఉంటాయి. తల్లి పాలకు దాదాపు సమానంగా వీటిలో లాక్టోజ్‌ ఉంటుంది. ఈ పాలలో కొవ్వు శాతం చాలా తక్కువ. స్థూలకాయం నుంచి బయటపడేందుకు గాడిద పాలను సూచిస్తున్నారు. మనకు మేలు చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నా.. మన దేశంలో మాత్రం గాడిద పాలు వాణిజ్య స్థాయిలో వినియోగంలోకి రాలేదు. 
– డాక్టర్‌ జి.రాంబాబు, అసిస్టెంట్‌ సర్జన్, రాష్ట్ర పశు సంవర్థక శాఖ  

జనాభాలో దాదాపు 2 నుంచి 6 శాతం ప్రజలకు ఆవు పాలు సరిపడవు. ఆ పాల వల్ల ఎలర్జీలొస్తాయి. అలాంటి వారికి గాడిద పాలు మేలు చేస్తాయి.
 – ఐక్యరాజ్యసమితి అధ్యయనం

మా తాతముత్తాతల దగ్గర్నుంచి మా ఇంట్లో గాడిద పాలు వాడుతున్నాం. గాడిద పెంపకందార్లే ఇంటి ముందుకొచ్చి పాలు పితికి ఇస్తారు. చిన్న అమృతాంజనం సీసా పాలకు రూ.100 తీసుకుంటారు. ఇప్పుడు కరోనా కూడా రావడంతో ఇంట్లో పిల్లలకీ ఇస్తున్నాం..  
– మురళీ, చీరాల 

గాడిద పాలు ఎయిడ్స్‌ను పూర్తిగా నయం చేయకపోయినా, రోగుల జీవిత కాలాన్ని పొడిగించేందుకు మాత్రం దోహదపడతాయి
– లక్నో వర్సిటీ పరిశోధకుడు దేశ్‌దీపక్‌ ప్రకటన  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement