అమెరికా టెక్ ఉద్యోగులకు ఈ మూడేళ్లు గడ్డుకాలమే. 2023 అయితే పీడకల లాంటిది. లేఆఫ్స్‌ను ట్రాక్ చేస్తున్న ‘ట్రూఅప్’ వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం.. కేవలం 40 రోజుల వ్యవధిలో (ఫిబ్రవరి 9 వరకు) 1,26,879 మందిని.. 2022లో 2,41,176 మందిని తొలగించారు. అయితే.. తొలగిస్తున్న కంపెనీల్లో అతికొద్ది కంపెనీలు మాత్రమే రిక్రూట్‌మెంట్ల మీద ‘ఫ్రీజింగ్’ విధించాయి. భారీ టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు, యూనికార్న్‌ల్లో ఉద్యోగాల భర్తీ కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 3 నాటికి 1,69,676 జాబ్ ఓపెనింగ్స్ ఉండటం గమనార్హం.
లేఆఫ్స్‌లో ఉద్యోగాలు పోగొట్టుకున్న వారిలో కొందరికి మళ్లీ వేగంగా ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అయితే, అంతకుముందు కంపెనీతో పోలిస్తే జీతంలో వ్యత్యాసం, ఎక్కువ గంటలు పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అమెరికా టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయుల్లో చాలామంది ‘హెచ్1బి’ వీసా మీద ఉంటారు. ఉద్యోగంపోతే.. 60 రోజుల్లోగా మరో ఉద్యోగం సంపాదించని పక్షంలో అమెరికాను వదిలి తిరిగి మాతృదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. టెక్ కంపెనీల్లో ఉద్యోగంపోతే ఆందోళన చెందకుండా మరో ఉద్యోగానికి ప్రయత్నించాలని.. చాలా టెక్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు పూర్తిగా మూసుకుపోలేదని నిపుణులు సూచిస్తున్నారు.
అటు లేఆఫ్స్.. ఇటు ఓపెనింగ్స్..
గత మూడేళ్లలో టాప్–20 లేఆఫ్స్‌లో లక్ష మందిని తొలగించారు. అందులో టాప్–1 లేఆఫ్ గూగుల్‌ది. ఈ సంస్థ 12 వేల మందిని ఒకేసారి తొలగించింది. కానీ, అదే రోజు దాదాపు 1,000 జాబ్ ఓపెనింగ్స్ ప్రకటించింది. భారీ టెక్ కంపెనీల్లో రెండుమూడు మినహా మిగతా కంపెనీలదీ అదేబాట. భారతీయ టెకీలు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అవసరమైతే కొత్త స్కిల్స్‌ను వేగంగా నేర్చుకునే సామర్థ్యం మన టెకీల సొంతం.
యూఎస్‌లో భారీగా ఉద్యోగావకాశాలు
టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ ప్రకటిస్తుంటే.. మిగతా రంగాల్లో భారీ సంఖ్యలో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. యూఎస్‌ఏ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బీఎల్‌ఎస్) డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో 1.10 కోట్ల ఉద్యోగాలు భర్తీకి ఎదురుచూస్తున్నాయి. అంతకుముందు నెలతో పోలిస్తే ఏడుశాతం అధికంగా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అమెరికాలో ప్రతి నిరుద్యోగికి 1.9 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయని.. జనవరిలో వివిధ రంగాల్లో 5.17 లక్షల ఖాళీలు భర్తీ అయ్యాయని బీఎల్‌ఎస్ పేర్కొంది. టెక్ కంపెనీల్లో ఓపెనింగ్స్ గతంలో పోలిస్తే తగ్గాయని, పూర్తిగా నిలిచిపోలేదని వెల్లడించింది.
మళ్లీ స్టార్టప్ రోజులకు..
మరోవైపు.. ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు మిగిలిన సిబ్బందికి పంపిస్తున్న అంతర్గత కమ్యూనికేషన్లలో.. ‘మనం ఇంకాస్త ఎక్కువ కష్టపడి పనిచేయాల్సిన అవసరం వచ్చింది. స్టార్టప్ రోజుల్లో మాదిరిగా పనిచేస్తే విజయం మన సొంతమవుతుంది’ అని యాజమాన్యాలు ఉద్భోదిస్తున్నాయి. అమెరికా భారీ టెక్ కంపెనీలు ఇలా భావించడం నూతన పోకడే.
ఉద్యోగాలు కోల్పోయిన టెకీల పయనం ఎటు?
ఇక ఉద్యోగాలు కోల్పోయిన టెకీల పయనం మీద ‘వోక్స్ మీడియా’లో టెక్నాలజీ బిజినెస్ వ్యవహారాలు కవర్ చేస్తున్న రాణి మొల్ల ఆసక్తికర కథనం రాశారు. అందులోని అంశాలు ఏమిటంటే..
► హెచ్1బీ వీసాల మీద ఉన్న భారతీయ టెకీలు సాధారణంగా మరో ఉద్యోగం కోసం వెతుకుతారు. టెక్ కంపెనీల్లో దొరక్కపోతే.. అమెరికా నుంచి మాతృదేశానికి వెళ్లిపోకుండా, ఇతర రంగాల్లో ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తున్నారు.
► టెక్ కంపెనీల్లో ఆకర్షణీయ వేతనాలు, భారీ పెర్క్‌ల మైమరపు నుంచి టెకీలు వాస్తవ ప్రపంచంలోకి వస్తున్నారు. కరోనా విపత్తు సమయంలో భారీగా లాభాలు ఆర్జించిన టెక్ కంపెనీలు.. ఇప్పుడు పొదుపు చర్యల గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉద్యోగాల తొలగింపువల్ల తాత్కాలికంగా ఇబ్బంది ఉంటుంది. కానీ, అంతకంటే ఎక్కువ నష్టం కంపెనీలకే ఉంటుంది. ఉద్యోగాల తొలగింపుల్లో ‘టాలెంట్’ను కూడా కంపెనీలు కోల్పోతున్నాయనే విషయాన్ని గుర్తించడంలేదు. ఇంకొంత కాలానికైనా గుర్తిస్తాయి.
► ఉద్యోగాలు కోల్పోయిన వారు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించి ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. తమ ప్రతిభతో వ్యాపారాల్లోనూ విజయం సాధించే అవకాశాలు ఎక్కువే. ఆ ప్రయత్నాలు ఫలిస్తే, వారికి మంచి రోజులు వచ్చినట్లే.
► అలాగే, ఒకవైపు లేఆఫ్స్ ప్రకటిస్తున్న గూగుల్, ఆపిల్ లాంటి భారీ కంపెనీలు వరుసగా 25 నెలలుగా జాబ్ ఓపెనింగ్స్ ప్రకటిస్తూనే ఉన్నాయని ‘ది కంప్యూటింగ్ టెక్నాలజీ ఇండస్ట్రీ అసోసియేషన్’ (కంప్ టీఐఏ) ప్రకటించింది.
► టెక్ కంపెనీలు తొలగిస్తున్నది కేవలం టెక్ ఉద్యోగాలు మాత్రమే కాదు. హెచ్‌ఆర్, సేల్స్, ఫైనాన్స్ విభాగాల ఉద్యోగాలూ ఉన్నాయి. వాళ్లకు నాన్–టెక్ కంపెనీల్లోనూ ఉద్యోగాలుంటాయి. గూగుల్ కాలిఫోర్నియా కార్యాలయం నుంచి తొలగించిన ఉద్యోగుల్లో అన్ని విభాగాల వారున్నారు. అందులో 30 మంది మసాజ్ థెరపిస్టులూ ఉన్నారు.
చదవండి: ఉన్నట్టుండి ఉద్యోగం ఊడిందని పిచ్చెక్కుతోందా?
Comments
Please login to add a commentAdd a comment