బార్సిలోనా : మనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసినవాడిని స్నేహితుడంటారు. మరీ అలాంటి స్నేహితుడి నుంచి ఏదో ఒక విలువైన వస్తువును తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎంత జాగ్ర్తత్తగా తిరిగి ఇవ్వాలి. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. స్నేహితుడు కారు అడిగాడని ఏం ఆలోచించకుండా తన దగ్గరున్న 2కోట్ల రూపాయల విలువైన లంబోర్ఘిని కారును అతని చేతిలో పెట్టాడు. సరదాగా తీసుకున్న అవతలి వ్యక్తి వేగంగా వెళ్తూ సరాసరి గోడకు గుద్దాడు. ఇంకేముంది.. కోట్లు పెట్టి కొన్న కారు క్షణాల్లో రూపం మారిపోయింది. ఈ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. హ్యూయెల్వాకు చెందిన ఒక యువకుడు తన ఫ్రెండ్ కారును జాయ్‌రైడ్ కోసం తీసుకున్నాడు. అతివేగంతో ప్రయాణిస్తున్నప్పుడు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పవర్ కంట్రోల్ రూమ్ గోడను గుద్దేశాడు. ఈ విషయం ఫ్రెండ్‌కి ఎలా చెప్పాలో అర్థం కాక అక్కడి నుంచి పరారయ్యాడు.(ఇలాంటి డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడైనా చూశారా)
మామూలుగా చెట్టుని గుద్దితేనే పోలీసులు ఊరుకోరు. అలాంటిది పవర్ కంట్రోల్‌కి సంబంధించిన గోడను గుద్దితే ఊరుకుంటారా? కారు నెంబర్ ఆధారంగా యజమానిని పట్టుకున్నారు. పాపం కారు నడిపింది నేను కాదు మొర్రో అని మొత్తుకున్నా వినిపించుకోకుండా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని తన ఫ్రెండ్‌కు కాల్ చేస్తే యాక్సిడెంట్ కారణంగా బాగా దెబ్బలు తగిలాయి. హాస్పిటల్‌లో ఉన్నాను అని మొరాయించాడు. పోలీసులు అతనున్న హాస్పిటల్‌కు వెళ్లి బాధితుడిని అరెస్ట్ చేశారు. ఇది సాదా సీదా కారు అయింటే అంతగా పట్టించుకునేవాడు కాదు యజమాని. ఇది అత్యంత ఖరీదైన లంబోర్ఘిని కారు. దీని విలువ సుమారు రూ. 2 కోట్లు వరకు ఉంటుంది. అందుకే అంత బాధపడుతున్నాడు. యాక్సిడెంట్ అయిన వెంటనే విద్యుత్ సరఫరాను అపేయడంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment