కేరళ వాసి మృతి, మరో ఇద్దరికి గాయాలు
జెరూసలేం: ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా మిలిటెంట్లు జరిపిన యాంటీ ట్యాంక్ క్షిపణి దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. బాధితులంతా కేరళకు చెందిన వారే. ఉత్తర సరిహద్దులకు సమీపంలోని గలిలీ ప్రాంతంలో ఉన్న మర్గలియోట్ సామూహిక వ్యవసాయ క్షేత్రంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
పౌల్ట్రీఫాంలో ఉన్న పాట్ నిబిన్ మాక్స్‌వెల్ (31) చనిపోగా జోసెఫ్ జార్జి(31), పౌల్ మెల్విన్(28) అనే వారు గాయపడ్డారు. మాక్స్‌వెల్‌ది కేరళలోని కొల్లం జిల్లా. క్షిపణి దాడిలో మాక్స్‌వెల్ గాయపడినట్లు సోమవారం సాయంత్రం తమకు ఇజ్రాయెల్‌లోని బంధువులు తెలిపారని తండ్రి పాత్రోస్ చెప్పారు. ఆ తర్వాత అతడు చనిపోయినట్లు అర్ధరాత్రి సమాచారమిచ్చారని గద్గద స్వరంతో మీడియాకు చెప్పారు. తన పెద్ద కుమారుడు ఇజ్రాయెల్‌లోనే ఉంటున్నారని ఆయన వివరించారు. గతంలో మస్కట్, దుబాయ్‌కి వెళ్లి వచ్చిన మాక్స్‌వెల్ రెండు నెలల క్రితమే ఇజ్రాయెల్ వెళ్లాడని తెలిపారు.
కోలుకుంటున్న క్షతగాత్రులు: ‘క్షిపణి దాడిలో గాయపడిన జార్జిని పెటా టిక్వాలోని బీలిన్సన్ ఆస్పత్రికి తరలించాం. అతడి ముఖం, ఇతర శరీర భాగాలకు గాయాలయ్యాయి. వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. భారత్‌లోని కుటుంబ సభ్యులతో అతడు మాట్లాడొచ్చు’అని అధికార వర్గాలు తెలిపాయి. మెల్విన్‌కు స్వల్ప గాయాలైనట్లు ఇజ్రాయెల్ అధికారవర్గాలు తెలిపాయి. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సాయం అందిస్తామని చెప్పాయి. ఘటనపై ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మిలిటెంట్ల దాడిని పిరికిపంద చర్యగా పేర్కొంది. కాగా, సోమవారం హెజ్బొల్లా మిలిటెంట్లు జరిపిన దాడిలో ఒకరు చనిపోగా మొత్తం ఏడుగురు గాయపడినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించింది. గత ఏడాది అక్టోబర్ 8వ తేదీ నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న పోరులో హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లు రాకెట్లు, డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపై దాడులకు పాల్పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment