
లండన్: కరోనా మహమ్మారి నుంచి యావత్ ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ, నిబంధనలను పక్కాగా అమలు చేయడం వల్ల కరోనా రక్కసి ప్రభావాన్ని తగ్గించగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో మహమ్మారి ధాటికి విలవిలలాడి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బ్రిటన్‌లో జులై 19 తరువాత ఆంక్షలు ఎత్తివేయాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మాస్క్ వాడకం, భౌతిక దూరం పాటించడంతో పాటుగా పలు రకాల నిబంధనలు ఎత్తివేసే యోచనలో బ్రిటన్ ప్రధాని ఉన్నట్లుగా సండే టైమ్స్ తెలిపింది.
అలాగే జిమ్, రెస్టారెంట్స్, మ్యూజియం తదితర వాటిల్లో స్కానింగ్ నిబంధనలను పక్కన పెట్టే అవకాశం ఉందని సండే టైమ్స్ కథనంలో పేర్కొంది. వేగంగా అమలు చేస్తున్న వ్యాక్సిన్ విధానం సత్ఫలితాలు ఇస్తుండటంతో, మాస్క్ వాడాలా, వద్దా అనేది ప్రజల ఇష్టానికి వదిలేయాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఏడాదిన్నర కాలంగా ఆంక్షలతో మగ్గిపోయిన ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని, వారి ఆలోచనలకు అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని బ్రిటన్ గృహనిర్మాణ శాఖ మంత్రి పేర్కొన్నారు.