
ఢాకా: మన పక్కదేశమైన బంగ్లాదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతిచెందగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల ప్రకారం.. ఎమద్ పరిబహన్ సంస్థకు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో వెళ్తుండగా అదుపుతప్పి నీళ్లు లేని ఓ కాలువలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వెళ్తున్న బస్సు మదారిపూర్‌లోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో ఉన్న వంతెనపై నుంచి కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ గట్టు గోడను బలంగా ఢీకొట్టింది. కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతిచెందారు. దాదాపు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇక, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్ చేరుకుంది. సహాయక చర్యలు చేపట్టింది. తీవ్రంగా గాయపడిన వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఘటనపై స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment