జ్యురిచ్: స్విట్జర్లాండ్‌లో తట్టు(మీజిల్స్) వ్యాధి ప్రబలుతోంది. లుసాన్నే ప్రాంతంలోని ఓ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు తట్టు సోకింది. దీంతో ఆ స్కూల్‌ను ఈ నెల 18 వరకు మూసివేస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఎంతమంది విద్యార్థులకు తట్టు సోకిందో స్కూల్ యాజమాన్యం క్లారిటీ ఇవ్వలేదు.
తప్పనిసరి పరిస్థితుల్లో స్కూల్ మూసివేస్తున్నామని మాత్రమే స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. ఈ స్కూల్‌లో జనవరిలోనే ఆరుగురికి తట్టు సోకినట్లు నిర్ధారణ అయిందని, తాజాగా మరో 20 మందికి వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది.
మీజిల్స్ అనే అంటు వ్యాధి వైరస్ కారణంగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వారు దగ్గినపుడు పడే తుంపర్ల ద్వారా వ్యాధి వ్యాప్తిచెందుతుంది. వ్యాధి సోకిన వారికి జ్వరం, దగ్గు, ముక్కు కారడం, ముక్కు, గొంతులో మంట, ర్యాషెస్ తదితర లక్షణాలు కనిపిస్తాయి. రెండు డోసుల వ్యాక్సిన్లతో మీజిల్స్ రాకుండా నిరోధించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment