Indian-American Shree Saini is first runner-up of Miss World 2021: జీవితంలో ‘చేదు’ను.. ‘తీపి’గా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదురైనా.. ఓర్చుకుంటూ ముందుకు సాగడమే సిసలైన జీవిత ప్రయాణం. చిన్నవయసులోనే మోయలేనంతగా బాధల్ని చవిచూసింది ఆ చిన్నారి. కానీ, తొణకలేదు. పైగా తల్లిదండ్రుల కన్నీళ్లను చిట్టిచేతులతో తుడిచింది. ఎదురించి పోరాడింది. ఎట్టకేలకు.. చిన్నప్పటి కలను సాధించుకుంది. ఏకంగా ప్రపంచ అందాల పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. శ్రీ సైని(26).. భారత మూలాలు ఉన్న యువతి కావడం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం.
Miss World 2021 పోటీలు మార్చి 17వ తేదీన ప్యూర్టో రికా, శాన్ జువాన్‌లోని కోకా కోలా హాల్‌లో ఘనంగా జరిగాయి. పోలాండ్ సుందరి కరోలీనా బెయిలాస్కా(23) Karolina Bielawska ప్రపంచ సుందరి టైటిల్ నెగ్గింది. మాజీ సుందరి జమైకాకు చెందిన టోనీ అన్‌సింగ్.. ప్రపంచ సుందరి కిరీటంతో కరోలీనాను సత్కరించింది. మొదటి రన్నరప్‌గా మిస్ అమెరికా 2021 శ్రీ సైని నిలవగా.. రెండో రన్నరప్‌గా పశ్చిమ ఆఫ్రికా దేశం కోట్ డీల్వోరికు చెందిన ఒలీవియా యాసే నిలిచింది. ఈ ముగ్గురిలో శ్రీ సైని.. ఇండో అమెరికన్ కాగా.. ఆమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయం కూడా.
Our newly crowned Miss World Karolina Bielawska from Poland with 1st Runner Up Shree Saini from United States 2nd Runner up Olivia Yace from Côte d’Ivoire#missworld pic.twitter.com/FFskxtk0KO
— Miss World (@MissWorldLtd) March 17, 2022
శ్రీ సైని నేపథ్యం..
అందాల పోటీల్లో భారత సంతతి యువతి శ్రీ సైని ఆకట్టుకుంది. 26 ఏళ్ల సైని.. ప్రపంచ సుందరీమణుల పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. కిందటి ఏడాది అక్టోబర్‌లో జరిగిన మిస్ అమెరికా పోటీల్లో ఆమె విజేతగా నిలిచిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది.
►మిస్ వరల్డ్ ఫస్ట్ రన్నరప్ శ్రీ సైని స్వస్థలం పంజాబ్‌లోని లూథియానా. సైనికి ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం వాషింగ్టన్‌కు వలస వెళ్లింది. పసితనం నుంచే ఆమె అడుగులు.. ముళ్ల బాటలో సాగాయి.
► ఐదేళ్ల వయసులో ఆమెకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడింది ఆమె. అందరి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే.. శ్రీ సైనికి కేవలం 20సార్లు మాత్రమే కొట్టుకునేది. ఆమె అందరు పిల్లలాగా ఆడుకోలేని డాక్టర్లు చెప్పారు. చివరికి.. పన్నెండవ ఏటా ఓపెన్ హార్ట్ సర్జరీతో పేస్‌మేకర్ అమర్చారు. ఆపై ఆమె మిగతా పిల్లల్లాగే గెంతులేస్తూ ఆడింది.
► సవ్యంగా సాగుతున్న శ్రీ సైనిపై మరో పిడుగు పడింది. ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె ముఖం బాగా కాలిపోయింది. కానీ, శ్రీ షైని కుంగిపోలేదు. ఆమె కోలుకోవడానికి ఏడాది టైం పడుతుందని వైద్యులు చెప్పారు. కానీ, ఆశ్చర్యకర రీతిలో కేవలం రెండు వారాలకే ఆమె తరగతి గదిలో అడుగుపెట్టింది.
తల్లిదండ్రులతో శ్రీ సైని(పాత చిత్రం)
► చిన్నతనంలోనే ప్రపంచ సుందరి కావాలన్న కల నెరవేర్చుకునేందుకు.. ప్రయత్నించింది. కాలిన ఆ మరకలను సహజంగా తగ్గించుకునే ప్రయత్నం చేసింది. అందాల పోటీల్లో పాల్గొంది. 2020లో Miss Washington World గెల్చుకుంది.
► ఆపై మిస్ అమెరికా 2021 కిరీటం దక్కించుకుంది. మిస్ అమెరికా ఫైనల్ పోటీలకు ముందురోజు.. స్టేజ్ మీదే కుప్పకూలిన ఆమె ఆస్పత్రి పాలైంది. అయినా ఆ మరుసటి రోజు నెర్వస్‌ను పక్కనపెట్టి కిరీటాన్ని దక్కించుకుంది. ఆమె స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి గానూ.. మిస్ వరల్డ్ బ్యూటీ విత్ ఏ పర్పస్(BWAP) అంబాసిడర్ హోదా కూడా దక్కింది.
► ముఖ కాలిన గాయాలు, గుండె లోపాన్ని అధిగమించిన నా కథ.. రోజువారీ సవాళ్లను అధిగమించడానికి ఇతరులను ప్రోత్సహిస్తుందని నేను ఆశిస్తున్నా. నేను కేవలం 6 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, నేను మిస్ వరల్డ్ వేషం వేసుకున్నాను, ఎందుకంటే నేను మిస్ వరల్డ్‌ను సూపర్ హీరోగా చూశాను. సేవ చేయాలనే ఉద్దేశ్యం నాకు కష్ట సమయాల్లో బలాన్నిచ్చింది. నాకు కష్టాలు తెలుసు. బతకాలనే సంకల్పం నా జీవితాన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది అంటోంది శ్రీ సైని.
Comments
Please login to add a commentAdd a comment