వాషింగ్టన్: ‘‘భారత ఉత్తర సరిహద్దులో చైనా 60 వేల మంది సైనికులను మోహరించింది. వుహాన్‌లో ఉద్భవించిన ప్రాణాంతక కరోనా వైరస్ గురించి ప్రశ్నించినందుకు ఆస్ట్రేలియాపై బెదిరింపులకు దిగింది. వేధింపులకు పాల్పడింది. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ పాలన వల్ల ప్రపంచానికి ముప్పు పొంచి ఉంది’’ అంటూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో డ్రాగన్ దేశం చైనాపై మండిపడ్డారు. గత ప్రభుత్వాల అసమర్థ పాలన వల్ల అమెరికా మేథో సంపత్తిని చైనా దొంగిలించిందని, అయితే అధ్యక్షుడు ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత డ్రాగన్ ఆట కట్టించి పరిస్థితులను చక్కదిద్దారని పేర్కొన్నారు. (చదవండి: చైనాయే లక్ష్యంగా క్వాడ్ దేశాల ప్రకటన)
కాగా ఇండో- పసిఫిక్ ప్రాంతంలో ఆధిపత్యం ప్రదర్శించేందుకు డ్రాగన్ దేశం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టే క్రమంలో క్వాడ్(క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్) దేశాలు మంగళవారం జపాన్‌లో సమావేశమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు టోక్యోలో భేటీ అయి, స్వేచ్ఛ, నిజాయితీ, సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ఉమ్మడిగా పనిచేస్తామని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో అమెరికాకు తిరిగి వచ్చిన అనంతరం శుక్రవారం ది గయ్ బెన్సన్ అనే షోలో మైక్ పాంపియో మాట్లాడుతూ.. నాలుగు ప్రజాస్వామ్య దేశాలు, ప్రధాన ఆర్థిక వ్యవస్థలు చైనా కమ్యూనిస్టు పార్టీతో ప్రపంచానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి చర్చించాయని పేర్కొన్నారు. (చదవండి: భారత్- అమెరికాల మధ్య కీలక ఒప్పందం..)
అదే విధంగా, డ్రాగన్ వేస్తున్న ఎత్తులకు ధీటుగా బదులిచ్చే దిశగా ఉమ్మడి విధానాలు రూపొందించేందుకు సంకల్పించాయని పేర్కొన్నారు. ఇక భారత్- చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి డ్రాగన్ ఆర్మీ దుందుడుకుగా వ్యవహరిస్తోందన్న పాంపియో, ఉత్తర సరిహద్దులో 60 వేల సైన్యాన్ని మోహరించిందని పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో భారత్‌కు అమెరికా వంటి మిత్ర దేశాల అవసరం ఎంతగానో ఉందని అభిప్రాయపడ్డారు. అదే విధంగా కరోనా వైరస్ విషయంలో నిలదీసినందుకు ఆస్ట్రేలియాను చైనా బెదిరింపులకు గురిచేసిందని, జపాన్ సైతం ఆ దేశ వైఖరిపై అసహనంగా ఉందని చెప్పుకొచ్చారు.
వాళ్లు తలవంచారు.. అందుకే..
‘‘గత నలభై ఏళ్లలో పశ్చిమ దేశాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న ప్రయత్నాలు చూశాం. గత ప్రభుత్వాల వల్ల చైనా, మేథో సంపత్తిని దొంగిలించిన తీరు, ఉద్యోగాలు కొల్లగొట్టిన వైనం బయటపడింది. క్వాడ్‌లోని మిగిలిన దేశాల్లో ఇలాగే జరుతోందన్న విషయం చర్చకు వచ్చింది. కాబట్టి వాళ్లకు అమెరికా, అమెరికాకు వాళ్ల అవసరం ఉంది. చైనా దుష్ట వైఖరిని ఎదిరించేందుకు మాకు స్నేహితులు, భాగస్వాములు కావాలి’’అని మైక్ పాంపియో పేర్కొన్నారు. అందరం కలిసి డ్రాగన్ ప్రభుత్వ వైఖరి మారే విధంగా విధానాలు అవలంబించబోతున్నామని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment