న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో అగ్రరాజ్యం అమెరికా ప్రకటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ విషయం భారత అంతర్గత విషయమని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. 2019కు చెందిన పౌరసత్వ సవరణ చట్టం దేశానికి సంబంధించిన అంతర్గత విషషమని, ఇది దేశ సమగ్ర సంప్రదాయాలకు, మానవ హక్కుల విషయంలో తమ దీర్ఘకాల నిబద్దతకు అనుగుణంగా రూపొందించినట్లు వెల్లడించారు.
అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో హింసకు గురై 2014 వరకు భారత్‌కు వలస వచ్చిన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, పార్శీ, క్రైస్తవ వర్గాలకు చెందిన మైనారిటీలకు భారత పౌరసత్వం, భద్రత కల్పించే ఉద్ధేశ్యంతో ఈ చట్టం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ చట్టం ఏ పౌరుడి హక్కులను తొలగించదని అన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం పౌరసత్వం ఇవ్వడం.. పౌరసత్వం తీసివేయడం గురించి కాదని అన్నారు. ఇది అందరికీ అర్థం కావాలన్నారు. ‘ఇది ఏ దేశపు జాతీయత లేని వ్యక్తి సమస్యను పరిష్కరిస్తుంది. మానవ హక్కులకు మద్దతు ఇస్తుంది. మానవ గౌరవాన్ని అందిస్తుంది’ అని పేర్కొన్నారు.
కాగా పౌరసత్వ సవరణ చట్టంపై అమెరికా స్పందించిన విషయం తెలిసిందే. సీఏఏ అమలులు తీరును తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. మార్చి 11వ తేదీన రిలీజైన సీఏఏ నోటిఫికేషన్ పట్ల ఆందోళనగా ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. సీఏఏను ఎలా అమలు చేస్తారన్న విషయాన్ని గమనిస్తున్నామని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంటుందని మిల్లర్ తెలిపారు.
చదవండి: ఎలక్టోరల్ బాండ్ల డేటాపై 'జైరాం రమేష్' కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment