మయన్మార్ (బర్మా) చెందిన 151 మంది సైనికులు భారత్‌లోకి చొచ్చుకొని వచ్చారు. మిజోరం రాష్ట్రంలో గల సరిహద్దు జిల్లా లాంగ్ట్లైలోకి మమన్మార్ సైనికులు తరలివచ్చినట్లు అస్సాం రైఫిల్స్ అధికారి వెల్లడించారు. ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థ అయిన అరాకన్ ఆర్మీ(ఏఏ) ఆ దేశ సైన్యం ‘తత్మాదవ్’ క్యాంప్‌ను ధ్వంసం చేసింది. దీంతో మయన్మార్ సైన్యంలోని 151 మంది సైనికులు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోని మిజోరంలోకి ప్రవేశించారు.
కాగా.. కొన్ని రోజులుగా భారత్ సరిహద్దుకు సమీపంలోని మయన్మార్ ప్రాంతంలో ఆ దేశ సైన్యానికి, ప్రజాస్వామ్య అనుకూల సాయుధ సంస్థ అరాకన్ ఆర్మీకి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం తీవ్రమైన గాయాలతో కొంతమంది సైనికులు భారత్‌లోకి వచ్చినట్లు ధ్రువీకరించారు. అయితే అస్సాం రైఫిల్స్ అధికారులు గాయపడిన మయన్మార్ సైనికులకు ప్రథమ చికిత్స అందించారని పేర్కొన్నారు.
ప్రస్తుతం మయన్మార్ సైనికులు అస్సాం రైఫిల్స్ కస్టడీలో మయన్మార్ సరిహద్దు వద్ద ఉన్నారని పేర్కొన్నారు. వారిని మయన్మార్ పంపించడానికి భారత దేశ విదేశాంగ శాఖ, మయన్మార్ మిలిటరీ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నాయని అస్సాం రైఫిల్స్ అధికారులు తెలిపారు.
మరోవైపు మయన్మార్‌లో సైనిక పాలనను కూలదోసి.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి అక్కడి ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థలు ఉమ్మడిగా పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. త్రీబ్రదర్‌హుడ్ అలయన్స్ (టీబీఏ), మయన్మార్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం (ఎంఎన్‌డీఏఏ), టాంగ్ జాతీయ విమోచన సైన్యం(టీఎన్‌ఎల్‌ఏ), అరాకన్ ఆర్మీ(ఏఏ) కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment