ఖాట్మాండ్: నేపాల్ పార్లమెంట్‌ను రద్దు చేయాలన్న కేబినెట్ సిఫార్సుకు రాష్ట్రపతి విద్యాదేవి భండారి ఆదివారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్ష కార్యాలయం పార్లమెంట్ ఎన్నికల తేదీలను ప్రకటించింది. మొత్తం రెండు దశల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 30, మే 10న ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు.
కాగా, గత కొన్ని నెలలుగా సొంత పార్టీ నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్న ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి ఇవాళ (ఆదివారం) నేపాల్ పార్లమెంట్ రద్దును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. అనంతరం ప్రధాని ఓలి రాష్ట్రపతితో పాటు నేపాల్ ఎన్నికల కమిషనర్, ఇతర అధికారులను కలిశారు. జాతీయ ఎన్నికల నిర్వహణపై వారితో చర్చలు జరిపారు. ( భారత్‌తో మాకు ప్రత్యేక అనుబంధం: నేపాల్ )
అయితే కీలకమైన నియామకాలకు తనకు పూర్తి అధికారం కట్టబెట్టుకుంటూ ప్రధాని ఓలి గత మంగళవారం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వివాదాస్పదమైంది. స్వపక్షం నుంచే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేయగా, పార్టీ నేతలను బుజ్జగించేందుకు ప్రధాని ఓలి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో పార్లమెంట్‌ను రద్దు చేస్తూ ఆయన అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో నేపాల్‌లో ఎన్నికలు అనివార్యమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment