నేపాల్‌ భారీ భూకంపం: 140కి చేరిన మృతుల సంఖ్య | Nepal Earthquake Updates: Death Toll Rises To 128 - Sakshi
Sakshi News home page

నేపాల్‌ భారీ భూకంపం: 140కి చేరిన మృతుల సంఖ్య.. శిథిలాలు తొలగించే కొద్దీ..

Published Sat, Nov 4 2023 6:42 AM | Last Updated on Sat, Nov 4 2023 5:13 PM

Nepal earthquake Death toll Nov 04 News Updates - Sakshi

ఖాట్మాండు: నేపాల్‌ పెను భూకంపం (Nepal earthquake).. పలువురిని పొట్టనబెట్టుకుంది. వందలాది మంది గాయపడ్డారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కుప్పకూలిన భవనాల శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగుతున్నాయి.

శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.  ఇప్పటిదాకా 140 మృతదేహాల్ని వెలికి తీసినట్లు అధికారులు ప్రకటించారు.  గాఢనిద్రలో ఉండగా భూకంపం సంభవించడంతో.. ప్రాణాల కోసం పరుగులు తీసేందుకు అవకాశం కూడా లేకపోయింది. రుకమ్‌, జజర్‌కోట్‌లో ఇళ్లు వందల సంఖ్యలో నేలమట్టం అయ్యాయి. శిథిలాలు తొలగిస్తోన్న కొద్దీ.. మృతదేహాలు బయటపడుతున్నాయి. గాయపడిన వాళ్ల సంఖ్య వందల్లోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఆధారంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

ఇదీ చదవండి:  భూకంపం ఎన్ని రకాలు? ఏది అత్యంత ప్రమాదకరం?

నేపాల్‌లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.4 తీవ్రత నమోదు అయ్యింది. దేశ రాజధాని ఖాట్మాండుకు 400కి.మీల దూరంలో ఉన్న జజర్‌కోట్‌లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్‌ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపింది.  భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది.

రాత్రి దాటాక సంభవించిన భూకంప తీవ్రతకు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. పలు ప్రాంతాలతో కమ్యూనికేషన్‌ తెగిపోయింది. జనం రాత్రంతా రోడ్లపైనే గడిపారు. పైగా అర్ధరాత్రి కావడంతో తొలుత ప్రమాద తీవ్రత తెలియలేదు. ఉదయం నుంచి సహాయక చర్యలు తీవ్రతరం చేశారు. నేపాల్‌ ఆర్మీ రంగంలోకి దిగగా.. భూకంప బాధిత ప్రాంతాలల్లో ప్రధాని పుష్ప కమల్‌ పర్యటించనున్నట్లు సమాచారం. క్షతగ్రాతుల రోదనలతో ఆస్పత్రుల ప్రాంగణాలు మారుమోగుతున్నాయి.

రుకమ్‌ జిల్లాలో ఇళ్లు కూలి సుమారు 35 మంది, జజర్‌కోట్‌లో 34 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగే కొద్దీ.. మృతదేహాలు అక్కడ మరిన్ని బయటపడుతున్నాయి. నిన్న రాత్రి భూకంపం సంభవించడంతో సహాయ చర్యలు ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. కొన్ని చోట్లు కొండచరియలు విరిగిపడి వెళ్లలేకపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. 

భారీ భూకంపాలు సహజమే!
భూకంపాల జోన్‌లో ఉన్న హిమాలయా దేశం నేపాల్‌లో ప్రకంపనలు సర్వసాధారణమే. తక్కువ తీవ్రతతో ప్రకంపనలు సంభవించినప్పటికీ.. ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుంటాయి అక్కడ. ఇక్కడ భారతీయ టెక్టోనిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్‌లోకి నెట్టి హిమాలయాలను ఏర్పరుస్తుంది. దీనివల్ల భూకంపాలు సంభవించడం సర్వ సాధారణంగా మారింది. గత నెలవ్యవధిలోనే మూడు భూకంపాలు(పెద్దగా నష్టం వాటిల్లలేదు) సంభవించాయక్కడ.  అక్టోబర్‌ 3వ తేదీన రిక్టర్‌ స్కేల్‌పై 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతంపైనా ప్రభావం చూపించింది. ఇక కిందటి ఏడాది నవంబర్‌లో దోతీ జిల్లాలో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆరుగురిని బలిగొంది. అయితే.. 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం మాత్రం నేపాల్‌ చరిత్రలోనే పెను విషాదాన్నే మిగిల్చింది. నాటి భూకంపంలో 12 వేల మందికి పైగా మరణించగా.. పదిలక్షల భవనాలు నేలమట్టం అయ్యాయి.

ఇదీ చదవండి: ఆసియాను కుదిపేసిన 10 భారీ భూకంపాలివే.. 

భారత ప్రధాని దిగ్భ్రాంతి
నేపాల్‌ భారీ భూకంపం, భారీగా ప్రాణ నష్టం సంభవించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో నేపాల్ ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుంది అని ప్రధాని మోదీ తన ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు.

నేపాల్‌లో భూకంపం కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి బాధగా ఉంది. ఈ కష్టకాలంలో నేపాల్‌ ప్రజలకు యావత్‌ భారతదేశం సంఘీభావం ప్రకటిస్తోంది. సాధ్యమైన అన్ని సహాయాలను అందించడానికి భారత్‌ సిద్ధంగా ఉంది అని పేర్కొన్నారాయన. అలాగే మృతుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించిన ప్రధాని మోదీ.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

ఇవీ కూడా చదవండి: 

నేపాల్‌కు శాస్త్రవేత్తల హెచ్చరిక!

నేపాల్‌లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయంటే..

 మూమెంట్‌ మాగ్నిట్యూడ్‌ స్కేల్‌ అంటే ఏమిటి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement