ఖట్మండు : నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరో వివాదానికి తెరలేపారు. శ్రీరాముడి జన్మస్థలం దక్షిణ నేపాల్‌లోని అయోధ్యాపురి అని, యూపీలోని అయోధ్య కాదని ఆయన పేర్కొన్నారు. నెలరోజుల వ్యవధిలో అయోధ్యపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఇటీవల అత్యంత వైభవంగా భూమిపూజ జరిగిన నేపథ్యంలో ఓలి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మాడి మేయర్ ఠాకూర్ ప్రసాద్ ధకాల్ నేతృత్వంలో తనను కలిసిన ప్రతినిధి బృందంతో రాముడి జన్మస్థలాన్ని అభివృద్ధి చేసేందుకు తన ప్రణాళికలను పంచుకున్నారు.అయోధ్యపురిని శ్రీరాముడు జన్మించిన ప్రాంతంగా ప్రచారం చేయాలని, అక్కడ రాముడి విగ్రహం ప్రతిష్టించాలని కోరారు. మాడి మున్సిపాలిటీ పేరును అయోధ్యపురిగా మార్చాలని సూచించారు. చదవండి : ఐక్యరాజ్యసమితికి నేపాల్ కొత్త మ్యాప్
కాగా, నేపాల్ ప్రధాని ఓలి గత నెలలోనూ ఇవే వ్యాఖ్యలు చేయగా పాలక నేపాల్ కమ్యూనిస్టు పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. నేపాల్ ప్రధాని భారత వ్యతిరేక వ్యాఖ్యలను ఆయన పార్టీ నేతలే వ‍్యతిరేకిస్తున్నారు. మరోవైపు రాముడి జన్మస్థలంపై ఓలి ప్రచారాన్ని జానకి ఆలయ పూజారులు సహా నేపాల్‌కు చెందిన మత నేతలు ఖండిస్తున్నారు. అయోధ్య భూమిపూజలో పాల్గొన్న నేపాల్ మత బోధకుడు ఆచార్య దుర్గా ప్రసాద్ గౌతమ్ ప్రధాని ఓలి వ్యాఖ్యలను తోసిపుచ్చారు. మరోవైపు నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో ఓలికి వ్యతిరేకంగా అంతర్గత పోరు తీవ్రతరమైంది. పార్టీ అగ్రనేత పుష్ప కమల్ దహల్‌తో పాటు మాజీ ప్రధానులు మాధవ్ నేపాల్, జల్‌నాథ్ ఖనల్‌లు ఓలి తక్షణమే పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment