![New York Assembly Passes Kashmir American Day Resolution - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/9/ANDRE.jpg.webp?itok=0oOIw4uT)
న్యూయార్క్: ఫిబ్రవరి 5వ తేదీని ‘కశ్మీర్ అమెరికన్ డే’గా ప్రకటించాలని గవర్నర్ అండ్రూ క్యుఒమోను కోరుతూ న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ ఒక వివాదాస్పద తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. జమ్మూకశ్మీర్ ఘన సంస్కృతిని, సామాజిక సంప్రదాయాలను తప్పుగా చూపి కశ్మీర్ ప్రజలను విడదీసే చర్యగా ఈ తీర్మానాన్ని అభివర్ణించింది. ఈ తీర్మానం వెనుక స్వార్ధ శక్తులున్నాయని ఆరోపించింది. అసెంబ్లీ సభ్యుడు నాదర్ సాయేఘ్, మరో 12 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ‘కశ్మీరీలు ప్రతికూలతలను అధిగమించారు.
పట్టుదలతో కృషి చేసి న్యూయార్క్ వలస ప్రజలకు పునాదిగా నిలిచారు. కశ్మీరీ ప్రజల మత స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛలకు న్యూయార్క్ రాష్ట్రం మద్దతునిస్తుంది’ అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని వాషింగ్టన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. ‘జమ్మూకశ్మీర్ సహా దేశ భిన్న, ఘన సాంస్కృతిక వారసత్వం భారత్‌కు గర్వకారణం. జమ్మూకశ్మీర్ భారత్‌లో విడదీయలేని అంతర్భాగం’ అని స్పష్టం చేశారు. కాగా, కశ్మీర్‌పై న్యూయార్క్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని పాకిస్తాన్ స్వాగతించింది.
Comments
Please login to add a commentAdd a comment