ఒకే కాన్పులో తొమ్మిది మంది పుట్టడం.. అదీ బతికి బట్టకట్టడం ఎప్పుడైనా చూశారా? లేదా.. ఇప్పుడు చూసేయండి. చూశారుగా.. అందరూ ఎంత చలాకీగా ఉన్నారో.. ఒకే కాన్పులో పుట్టి జీవించి ఉన్న తొలి 9 మంది కవలలు (నోనుప్‌లెట్స్) వీరు!! మొత్తం ఐదుగురు అక్కచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు! దీనికి సంబంధించి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. ఈ నవ సోదరసోదరీమణులకు ఓ ఆరేళ్ల అక్క కూడా ఉందండోయ్! అంటే మొత్తం సంతానం టోటల్ టెన్ అన్నమాట.
మాలి దేశానికి చెందిన హలీమా సిస్సే, అబ్దెల్‌కాదెర్ ఆర్బీ అనే దంపతులకు 2021 మే 4న ఈ తొమ్మిది మంది మొరాకోలో జన్మించారు. అత్యంత అరుదైన కేసు కావడంతో డెలివరీ నిమిత్తం హలీమాను మాలి ప్రభుత్వం ప్రత్యేక వైద్య సదుపాయాలున్న మొరాకోలోని ఓ ఆస్పత్రికి పంపింది. కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల వల్ల తల్లికి ముందుగానే.. 30 వారాల గర్భం సమయంలోనే వైద్యులు సిజేరియన్ చేశారు.
ప్రీ డెలివరీ కావడంతో ఒక్కొక్కరి బరువు కేవలం అర కిలో నుంచి కిలో మధ్యే ఉంది. దీంతో పిల్లలు 19 నెలలపాటు ఇంక్యుబేటర్లు, ప్రత్యేక వసతులున్న కేంద్రంలో గడపాల్సి వచ్చింది. మరో రెండు నెలల్లో మూడో పుట్టినరోజు జరుపుకోనున్న వీరంతా ఇప్పుడు తమ ఇంటి గడపదాటి.. గిన్నిస్ చానల్ కార్యక్రమంలో సందడి చేసేందుకు తొలిసారి ఇటలీ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీరి ఫొటోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment