![North Korea Conducted Ballistic Missile Test - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/20/missile.jpg.webp?itok=TSQmBJB9)
సియోల్: ఉత్తరకొరియా మంగళవారం సముద్రజలాల్లో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఇప్పటికే కొరియా ద్వీపకల్పంలో సాగుతున్న ఉద్రిక్తతలకు ఈ పరిణామం మరింత ఆజ్యం పోసినట్లయింది. జలాంతర్గామి నుంచి ప్రయోగించేందుకు వీలున్న ఒక ఆయుధాన్ని ఉ.కొరియా ప్రయోగించినట్లు దక్షిణ కొరియా మిలటరీ ప్రకటించింది. సిన్‌పో నౌకాశ్రయం సమీపంలోని సముద్ర జలాల్లో సబ్‌మెరీన్ పైనుంచి తక్కువ శ్రేణి క్షిపణిని ఉ.కొరియా ప్రయోగించినట్లు భావిస్తున్నట్లు తెలిపింది. దక్షిణ కొరియా, అమెరికా ఆర్మీ తాజా పరిస్థితులపై విశ్లేషణ జరుపుతున్నాయి.
కాగా, ఉ.కొరియా రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించినట్లు తెలిసిందని జపాన్ మిలటరీ పేర్కొంది. అవి జలాంతర్గామి నుంచి ప్రయోగించినవా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టాక ఉ.కొరియా అతి ముఖ్యమైన ఆయుధ బల ప్రదర్శన ఇదే. ఉ.కొరియా అణ్వాయుధ కార్యక్రమంపై చర్చలకు సిద్ధమంటూ అమెరికా పునరుద్ఘాటించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం సంభవించడం గమనార్హం. చివరిసారిగా ఉత్తరకొరియా 2019లో జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ పరీక్ష నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment