భారీ ఎత్తున తయారీకి కిమ్ ఆదేశం
సియోల్: లక్ష్యాలపైకి దూసుకెళ్లి పేలిపోయే ఆత్మాహుతి డ్రోన్లను ఉత్తరకొరియా పరీక్షించింది. వీటి దాడులను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఆత్మాహుతి డ్రోన్లను భారీ ఎత్తున తయారు చేయాలని కిమ్ ఆదేశించారు. అంతర్జాతీయ జలాల్లో అమెరికా, దక్షిణకొరియా, జపాన్‌లు ఉమ్మడి సైనిక విన్యాసాలు చేపట్టిన తరుణంలో ఉత్తరకొరియా ఈ డ్రోన్ల సామర్థ్యాన్ని పరీక్షించడం గమనార్హం. ఈ మానవరహిత ఏరియల్ వెహికిల్స్‌కు ‘ఎక్స్’ ఆకృతిలో రెక్కలు, తోక భాగం ఉన్నాయి.
ఆగస్టులో పరీక్షించిన డ్రోన్లను పోలి ఉన్నాయని ఉత్తరకొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అధ్యక్షుడు కిమ్ సైనిక అధికారులతో మాట్లాడుతున్న ఫొటోలను విడుదల చేసింది. ఈ డ్రోన్లు ఒక బీఎండబ్ల్యూ కారును, పాత యుద్ధ ట్యాంకులను ఢీకొని పేలి్చవేసిన దృశ్యాలను ప్రసారం చేసింది. వివిధ దిశల్లో ఈ డ్రోన్లు దూసుకెళ్లి లక్ష్యాలను ఛేదించాయి. వీటి పనితీరు పట్ట కిమ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ డ్రోన్ల తయారీని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కిమ్ అధికారులను ఆదేశించారు. సైనిక అవసరాల నిమిత్తం పెద్ద ఎత్తున తయారు చేయాలని, చవకైన ఈ డ్రోన్లు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment