జొహన్నెస్‌బర్గ్: ఒమిక్రాన్ (బి.1.1.529) ఇప్పుడీ పేరు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ ఈ కొత్త వేరియెంట్ భయపెడుతోంది. డెల్టా కంటే శరవేగంగా విస్తరించే ఈ వేరియెంట్ ఒకటి వెలుగులోకి వచ్చిందని తెలుసుకునే లోపే ప్రపంచ దేశాలకు చాపకింద నీరులా విస్తరించిందనే అనుమానాలున్నాయి. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుంచి నెదర్లాండ్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌కి వచ్చిన రెండు విమానాల్లోని 600 మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా వారిలో 61 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణమైంది.
ఇప్పటివరకు భారత్‌లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియెంట్ అత్యంత ప్రమాదకరమైనదని భావిస్తున్నాం. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నా డెల్టా కంటే 40శాతం అధికంగా ఒమిక్రాన్ విస్తరిస్తోందని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. యూరప్‌లోని బెల్జియంలోకి కొత్త వేరియెంట్ కేసులు నిర్ధారణ కాగా జర్మనీ, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియాలోనూ నమోదైనట్టుగా అనుమానాలున్నాయి. ఆరు దేశాల్లో ప్రస్తుతం ఈ కేసులు అధికంగా వస్తున్నాయి.దక్షిణాఫ్రికాలో రోజుకి సగటున 3 వేల కేసులొస్తున్నాయి. వీటిలో ఒమిక్రాన్ కేసులెన్ని అనేది జీనోమ్ సీక్వెన్సింగ్ తర్వాతే తేలుతుంది. అమెరికా, బ్రెజిల్, కెనడా, జపాన్, థాయిలాండ్, యూరోపియన్ యూనియన్, యూకే తదితర దేశాలు దక్షిణాఫ్రికా ఖండానికి చెందిన దేశాల నుంచి విమానప్రయాణాలపై ఆంక్షల విధించాయి.
బ్రిటన్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు
బ్రిటన్‌లో శనివారం ఒమిక్రాన్ వేరియంట్ సోకిన రెండు కేసులు బయటపడినట్లు బ్రిటన్ ఆరోగ్య మంత్రి సాజిద్ జావెద్ చెప్పారు. చేమ్స్‌ఫోర్డ్, నాటింగ్‌హామ్‌లలో ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఆ ఇద్దరు ప్రస్తుతం స్వీయ–గృహ నిర్బంధంలో ఉన్నారు.
ప్రయాణ ఆంక్షల సడలింపుపై పునః సమీక్షించండి: మోదీ
న్యూఢిల్లీ: భారత్‌లో విమాన సర్వీస్‌ల పూర్తిస్థాయి పునరుద్ధరణపై ప్రధాని మోదీ సూచన చేశారు. డెల్టా వేరియంట్ తరహాలో వ్యాప్తి స్థాయి ఎక్కువగా ఉన్న ఈ వేరియంట్ ఉధృతి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణ ఆంక్షల సడలింపుపై పునఃసమీక్ష తప్పనిసరి అని కేంద్ర ఉన్నతాధికారులతో మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచదేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి, విదేశాల్లో ఆరోగ్య పరిస్థితులను మోదీకి ఉన్నతాధికారులు వివరించారు. శనివారం ఢిల్లీలో ప్రధాని సమీక్షా సమావేశంలో భారత్‌లో కోవిడ్ పరిస్థితులు, కోవిడ్ వ్యాక్సినేషన్ తదితర ఆరోగ్య సంబంధ కార్యక్రమాల పురోగతిపై చర్చించారు.
ఒమిక్రాన్ ప్రభావం భారత్‌పై ఎలా ఉండబోయే వీలుందనే అంశాలూ చర్చకొచ్చాయని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఒమిక్రాన్ సంక్రమణ ప్రమాదమున్న దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికుల విషయంలో కోవిడ్ నిబంధనలను పాటించాలని మోదీ అధికారులకు సూచించారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి భారత్‌కు, భారత్ నుంచి అంతర్జాతీయ పౌర విమాన సర్వీస్‌లను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని పౌర విమానయాన శాఖ శుక్రవారమే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాని సూచన ప్రాధాన్యత సంతరించుకుంది. సమీక్షా సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) వీకే పాల్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ భార్గవ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment