ఒమిక్రాన్‌ వచ్చేసింది.. వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ.. | Two cases of Omicron Variant reported in India | Sakshi
Sakshi News home page

Omicron Variant: ఒమిక్రాన్‌ వచ్చేసింది.. వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ..

Published Fri, Dec 3 2021 4:46 AM | Last Updated on Fri, Dec 3 2021 4:33 PM

Two cases of Omicron Variant reported in India - Sakshi

న్యూఢిల్లీ, బెంగుళూరు: అందరూ భయపడుతున్నట్టుగానే జరిగింది.  ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వేరియెంట్‌ ఒమిక్రాన్‌ భారత్‌లోకి వచ్చేసింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 66 ఏళ్ల వృద్ధుడు, బెంగళూరుకి చెందిన 46 ఏళ్ల వయసున్న వైద్యుడికి ఒమిక్రాన్‌ వేరియెంట్‌ సోకినట్టుగా ఇన్సాకాగ్‌ నెట్‌వర్క్‌ జన్యు విశ్లేషణల్లో తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. వారిద్దరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారని,  వారిలో  లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ గురువారం మీడియాతో మాట్లాడారు. ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తుల్ని కలుసుకున్న వారిలో ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్‌ వారిని గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచారు.  

కోవిడ్‌ నిబంధనలు పాటించాలి  
కరోనా కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌ వచ్చేసిందని ప్రజలు ఎలాంటి ఆందోళనలు వద్దని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ అన్నారు.  కోవిడ్‌ నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాలన్నారు. ‘ఒమిక్రాన్‌పై ఎవరూ ఆందోళన చెందవద్దు. కానీ కరోనా నిబంధనలపై కచ్చితంగా అవగాహన ఉండాలి. మాస్కులు ధరించడం,  భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవడం వంటివన్నీ చేస్తే ఒమిక్రాన్‌ సహా ఏ కరోనా వేరియెంట్‌నైనా ఎదుర్కోగలం’ అని లవ్‌ అగర్వాల్‌ చెప్పారు.

డెల్టా కంటే ఈ వేరియెంట్‌ ప్రమాదకరమైనదా? కాదా? అన్నది ఇంత త్వరగా చెప్పలేమన్నారు. దక్షిణాఫ్రికా, యూరప్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే ఆర్‌టీ– పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించి, నివేదిక వచ్చిన తర్వాతే వారిని బయటకు పంపిస్తున్నామన్నారు. ఇక కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవడంలో ఎలాంటి ఆలస్యం చేయవద్దని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ పిలుపునిచ్చారు. మరోవైపు అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పకడ్బందీగా స్క్రీనింగ్, కరోనా పరీక్షలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ అధికారుల్ని ఆదేశించారు.

బూస్టర్‌ డోస్‌లపై అధ్యయనం
ఒమిక్రాన్‌  రాకతో భారత్‌కు మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ బూస్టర్‌ డోసులపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈ బూస్టర్‌ డోసులు ఇవ్వడంపై శాస్త్రీయపరమైన కారణాలను విశ్లేషిస్తున్నట్టుగా లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. ప్రజలందరికీ రెండు డోసులు ఇవ్వడానికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. కొత్త వేరియెంట్‌ను ఎదుర్కోవడంలోనూ వ్యాక్సినేషనే బ్రహ్మాస్త్రమని నీతి అయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్‌ వీకే పాల్‌ చెప్పారు. భారత్‌ దగ్గర టీకా డోసులు సమృద్ధిగా ఉండడం అదృష్టమని చెప్పారు. అందరూ టీకాలు తీసుకోవడానికి ముందుకు రావాలని చెప్పారు. దేశ జనాభాలోని వయోజనుల్లో  40 శాతం మంది కరోనా టీకాలు రెండు డోసులు తీసుకుంటే, 84.3% మంది ఒక్క డోసు తీసుకున్నారని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement