భారీ కుదుపులతో విమానం లోపల పరిస్థితి ఇదీ.. (ఇన్‌సెట్)బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులో ల్యాండయిన విమానం
ఒకరి మృతి , 30 మందికి గాయాలు
బ్యాంకాక్: లండన్ నుంచి సింగపూర్‌కు బయల్దేరిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో మార్గమధ్యంలో భారీ కుదుపులకు లోనైంది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా సీలింగ్ తగిలి, చెల్లాచెదురుగా పడి గాయాలపాలయ్యారు. ఊహించని పరిణామంతో హతాశుడైన ఒక 73 ఏళ్ల ప్రయాణికుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. 30 మంది గాయపడ్డారు. వీరందరినీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. వీరిలో ఏడుగురికి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి.
బోయింగ్ 777 రకం ఎస్‌క్యూ321 విమానం మంగళవారం ఉదయం మయన్మార్ దగ్గర్లోని అండమాన్ సముద్ర జలాలపై ప్రయాణిస్తున్నపుడు ఈ ఘటన జరిగింది. విమానం బయల్దేరిన 10 గంటల తర్వాత జరిగిన ఈ ఘటన వివరాలను సింగపూర్ ఎయిర్‌లైన్స్, ప్రయాణికులు వెల్లడించారు. ఘటన తర్వాత విమానాన్ని దారి మళ్లించి దగ్గర్లోని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంలో ల్యాండ్‌చేశారు. గాయపడని ప్రయాణికులను వేరే విమానాల్లో గమ్యస్థానమైన సింగపూర్‌కు పంపేశారు.
అసలేమైంది?
211 మంది ప్రయాణికులు, 18 సిబ్బందితో విమానం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. ఎయి ర్‌హోస్టెస్ ప్రయాణికులకు అల్పాహారం అందిస్తున్న సమయంలో విమానం 37,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. హఠాత్తుగా విమానం కుదుపులకు లోనైంది. మూడు నిమిషాల వ్యవధిలో ఆరువేల అడుగులు అంటే 37వేల అడుగుల ఎత్తు నుంచి 31వేల అడుగుల స్థాయికి పడిపోయింది. దీంతో విమానంలో బెల్ట్ పెట్టుకోని ప్రయాణికులంతా ఒక్క ఉదుటున గాల్లోకి లేచి సీలింగ్‌కు ఢీకొన్నారు.
మూడు నిమిషాల పాటు విమానం అటూఇటూ ఊగుతూ కిందకు పడిపోతుండటంతో లోపలున్న వారంతా చెల్లా చెదు రుగా పడిపోయారు. అసలేం జరుగుతుందోనన్న భయం, ఆందోళనతో అస్వస్థతకు గురై 73 ఏళ్ల బ్రిటిష్ జాతీయుడు అక్కడికక్కడే మరణించారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. 31 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాక విమానం మళ్లీ స్థిరత్వాన్ని సాధించింది. వెంటనే తేరుకున్న పైలట్లు 30 నిమిషాల్లోపే బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది బ్రిటన్, ఆస్ట్రేలియా, మలేసియా, సింగపూర్, న్యూజిలాండ్ దేశస్తులున్నారు. ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment