న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా 45 దేశాల్లోని 34.5 కోట్ల మంది ప్రజలు తీవ్ర క్షుద్బాధతో తనువు చాలిస్తున్నారని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్(ఎన్‌జీవోలు) పేర్కొన్నాయి. రోజుకు 19,700 మంది వంతున ప్రతి సెకనుకు నలుగురు చొప్పున ఆకలితో చనిపోతున్నట్లు అందులో పేర్కొన్నాయి. 2019తో పోలిస్తే ఆకలి చావులు రెట్టింపయ్యాయని తెలిపాయి. 75 దేశాలకు చెందిన ఆక్స్‌ఫామ్, సేవ్ ది చిల్డ్రన్, ప్లాన్ ఇంటర్నేషనల్ వంటి 238 ఎన్‌జీవోలు ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశాలకు హాజరయ్యే ప్రపంచ దేశాల నేతల నుద్దేశించి లేఖ రాశాయి.
‘‘21వ శతాబ్దంలో కరువు పరిస్థితులను రానివ్వబోమంటూ ప్రపంచ నేతలు ప్రతినబూనినప్పటికీ సొమాలియాలో మరోసారి తీవ్ర కరువు తాండవిస్తోంది. 45 దేశాల్లోని మరో 5 కోట్ల మంది ప్రజలు కరువుకు చేరువులో ఉన్నారు’’ అని ఆ ప్రకటనలో తెలిపాయి. ‘కేవలం ఒక దేశం లేదా ఖండానికి సంబంధించింది కాదు. మొత్తం మానవాళికే జరుగుతున్న అన్యాయమిది’’ అని పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్త ఆకలి సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వాలు నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాలని కోరాయి. ‘‘21వ శతాబ్దంలో కూడా కరువు గురించి మాట్లాడుకోవాల్సి రావడం దారుణం. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తక్షణమే ఆహారంతోపాటు దీర్ఘకాలం పాటు వారికి సాయం కొనసాగించడంలో ఏమాత్రం ఆలస్యం తగదు’’ అని పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment