కరాచీ:కనీవిని ఎరగని వరదలతో అతలాకుతలమవుతున్న పాకిస్తాన్‌లో ఓ చిన్న గ్రామంలోని హిందూ దేవాలయం అందిస్తున్న సేవలు అందరి ప్రశంసలూ అందుకుంటున్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జలాల్ ఖాన్ అనే మారుమూల కుగ్రామంలో ఉన్న బాబా మధోదాస్ మందిర్ వరదలో సర్వం కోల్పోయిన కనీసం 300 మంది ముస్లింలకు ఆశ్రయంతో పాటు భోజనం తదితర సదుపాయాలు కల్పిస్తోంది.
చుట్టుపక్కల నదులన్నీ పొంగడంతో ఊరికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆలయం ఎత్తయిన ప్రాంతంలో ఉండటంతో వరద ముంపు నుంచి తప్పించుకుంది. దాంతో గ్రామస్తులంతా ఆలయ ఆవరణలో ఉన్న 100 పై చిలుకు గదుల్లో తలదాచుకుంటున్నారు. వారి పశువులు కూడా ఆలయ ప్రాంగణంలో ఆశ్రయం పొందుతున్నట్టు డాన్ వార్తా పత్రిక పేర్కొంది. దేశ విభజనకు ముందు ఇక్కడ సంచరించిన బాబా మధో దాస్‌ను హిందూ ముస్లింలిద్దరూ ఆరాధించేవారట. బలూచిస్తాన్ ప్రావిన్స్ నలుమూలల నుంచీ హిందువులు ఈ ఆలయ సందర్శనకు వస్తారు.
ఊళ్లోని హిందూ కుటుంబాలు చాలావరకు ఉపాధి కోసం కరాచీ తదితర చోట్లకు వలస వెళ్లాయి. రెండు కుటుంబాలు మాత్రం గుడి బాగోగులు చూసుకుంటూ ఊళ్లోనే ఉండిపోయాయి. గుళ్లో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులకు భోజనాధికాలను ఆ హిందూ కుటుంబాలే సమకూరుస్తున్నాయి. వారి సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమంటూ ఊరివాళ్లంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. ఇది మత సామరస్యానికి అద్దం పట్టే ఉదంతమని డాన్ కథనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment