
టోక్యో: జపాన్ కొత్త ప్రధానిగా ఫుమియో కిషిడాను ఆ దేశ పార్లమెంట్ సభ్యులు సోమవారం ఎన్నుకున్నారు. అనంతరం ఆయన కీలక ప్రకటన చేశారు. వచ్చే వారంలో పార్లమెంటు దిగువ సభను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 31న ఎన్నికలకు వెళతామని చెప్పారు. కిషిడా గతంలో ఆయన దౌత్యవేత్తగా పని చేశారు. కరోనా మిగిల్చిన ఆర్థిక సంక్షోభం, చైనా–ఉత్తరకొరియాలను ఎదుర్కోవడం, రానున్న జాతీయ ఎన్నికలు వంటి అంశాలపై ఆయన తీవ్రంగా కృషి చేయాల్సి ఉంది. ఈ అంశాలపై సరిగ్గా పని చేయలేకపోయారన్న కారణాలతోనే మాజీ ప్రధాని యోషిహిడే సుగా రాజీనామా చేయాల్సి వచ్చింది.
చదవండి: (మోదీ, యోగి ప్రభుత్వాల పతనం ఖాయం)
అన్ని చక్కదిద్దుతాను..
పదవిని చేపట్టాక తన మొదటి ప్రాధాన్యత ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టడమేనని గతంలో వ్యాఖ్యానించిన ప్రధాని ఫుమియో కిషిడా, కరోనాను ఎదుర్కోవడానికి భారీ ఆర్థిక ప్యాకేజ్ అవసరమని చెప్పారు. అందుకు స్పష్టమైన ప్రజా తీర్పు అవసరమని, ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనాపై తమ పోరు కొనసాగుతుందని, జీ–20, కాప్–26 వాతావరణ సదస్సులకు వ్యక్తిగతంగా హాజరై వాటిని ఆమోదింపజేస్తానని అన్నారు. సుగా కేబినెట్‌లో మొత్తం 20 మంత్రులు ఉండగా, కిషిడా కేబినెట్‌లో 13 మంది మాత్రమే ఉన్నారు. సుగా కేబినెట్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే తాజా కిషిడా కేబినెట్‌లో కూడా ఉన్నారు. 13 మంది కేబినెట్‌లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. అమెరికా, బ్రిటన్‌లతో పాటు ఆసియా,యూరోప్‌లలోని పలు ప్రజాస్వామ్య దేశాలతో బలమైన సంబంధాలు ఏర్పరచాలన్నది కిషిడా ఆలోచన.
చదవండి: (ఆ ఒక్క కారణంతో కోవిడ్ పరిహారాన్ని ఆపొద్దు)
మోదీ శుభాకాంక్షలు..
జపాన్ నూతన ప్రధానిగా ఎన్నికైన ఫుమియో కిషిడాకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కలసి పని చేసేందుకు వేచి చూస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment