బ్రూనైలో భారత రాయబార కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
నేడు సుల్తాన్ హసనల్ బోల్కియాతో ద్వైపాక్షిక చర్చలు
బందర్ సేరీ బేగావాన్: బ్రూనైలో నూతన రాయబార కార్యాలయం భారత్, బ్రూనైల బలమైన బంధానికి సంకేతమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బ్రూనైలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకున్న మోదీ మంగళవారం మధ్యాహ్నం బందర్ సేరీ బేగావాన్ సిటీలో భారత నూతన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడి ఇండియన్ హైకమిషన్ ప్రాంగణంలో దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి భారతీయ సంతతి ప్రజలతో మోదీ మాట్లాడారు.
‘‘ఇరు దేశాల దౌత్యబంధానికి సజీవ సేతువులుగా మీరు నిలిచారు. భారత వైద్యులు, ఉపాధ్యాయులు బ్రూనై వైద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు’’ అని శ్లాఘించారు. అంతకుముందు మోదీకి బ్రూనై రాజధాని నగర ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. అక్కడి యువరాజు హజీ అల్–మహతాదీ బిల్లాహ్ సాదరంగా మోదీని ఆహ్వానించారు. ఆసియాన్‌సదస్సు కోసం 2013లో నాటి ప్రధాని మన్మోహన్ బ్రూనైలో పర్యటించగా దౌత్య పర్యటనలో భాగంగా భారత ప్రధాని ఒకరు బ్రూనైలో పర్యటించడం ఇదే తొలిసారి. బుధవారం బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియాతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment