లిస్బన్: పోర్చుగల్ వాసికి చెందిన బాబీ అనే కుక్క ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. రఫీరో డో అలెంటెజో జాతికి చెందిన ఈ కుక్క వయసు ఫిబ్రవరి 1 నాటికి 30 ఏళ్ల 226 రోజులు. ఆస్ట్రేలియాకు చెందిన బ్లూవై అనే కుక్క 29 ఏళ్ల 5 నెలలు జీవించి 1939లో చనిపోయింది. ఈ రికార్డును బాబీ తుడిచిపెట్టింది. పోర్చుగల్ ప్రభుత్వ పెట్ డేటాబేస్ ప్రకారం దాని వయస్సును నిర్ధారించారు. ఈ జాతి కుక్కల సరాసరి ఆయుర్దాయం 12–14 ఏళ్‌లు.
బాబీ యజమానులు పోర్చుగల్‌లోని కాంకెయిరోస్ గ్రామానికి చెందిన కోస్టా కుటుంబం. ఈ కుటుంబంలోని లియోనెల్ కోస్టా అనే కుర్రాడికి 8 ఏళ్లుండగా బాబీ పుట్టింది. ఇంట్లో చాలా పెంపుడు కుక్కలుండటంతో కొన్నింటిని వదిలి పెట్టినా ఇది మాత్రం తప్పించుకుంది. ‘‘ఇంట్లో వాళ్లు తినేది ఏం పెట్టినా బాబీ తినేది. అనారోగ్య సమస్యల్లేకుండా హుషారుగా ప్రశాంతంగా ఉండేది. అదే దాని ఆయుష్షును పెంచి ఉంటుంది’ అంటారు కోస్టా. వయో భారంతో బాబీ ఇప్పుడు చురుగ్గా నడవలేకపోతోందట! చూపు కూడా తగ్గిందని కోస్టా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment