
లిస్బన్: అవినీతి ఆరోపణలపై పోర్చుగల్ ప్రధానమంత్రి కోస్టా రాజీనామా చేశారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, లిథియం గనుల కుంభకోణాలకు సంబంధించి ఆయన ఇంటిపై ఇటీవల పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో భాగంగా కోస్టా ముఖ్య సలహాదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. అవినీతి కేసులో కోస్టాపై దర్యాప్తు జరుగుతోంది.
ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కోస్టా తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని కోస్టా స్పష్టం చేశారు. దర్యాప్తులో ఏం తేలినప్పటికీ తాను మళ్లీ ప్రధాని పదవి చేపట్టనని ఆయన తేల్చి చెప్పారు. కోస్టా రాజీనామాను ఆమోదించినట్లు పార్లమెంట్‌ను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో తెలిపారు. దేశంలో మళ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదన్నారు.
అయితే సోషలిస్టులు మరో నేత ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోస్టా ఆధ్వర్యంలో పోర్చుగల్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధించింది. పర్యాటక రంగం పరుగులు పెట్టింది. పెట్టుబడిదారులకు పోర్చుగల్ గమ్యస్థానంగా మారింది.