అమెరికాలో నెతన్యాహు పర్యటన.. క్యాపిటల్‌ హౌస్‌ వద్ద టెన్షన్‌! | Protests At US Capital House Over Benjamin Netanyahu Tour | Sakshi
Sakshi News home page

అమెరికాలో నెతన్యాహు పర్యటన.. క్యాపిటల్‌ హౌస్‌ వద్ద టెన్షన్‌!

Published Thu, Jul 25 2024 8:57 AM | Last Updated on Thu, Jul 25 2024 10:49 AM

Protests At US Capital House Over Benjamin Netanyahu Tour

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు.. అమెరికాలో పర్యటిస్తున్న వేళ నిరసనలు మిన్నంటాయి. నెతన్యాహుకు వ్యతిరేకంగా పాలస్తీనా మద్దతుదారులు నిరసనలకు దిగారు. దీంతో, పలుచోట్ల ఉద్రికత్తలు చోటుచేసుకున్నాయి.

కాగా, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సభలో నెతన్యాహు మాట్లాడుతూ.. ‘మనం కలిసి పనిచేస్తే గెలుస్తాం. వారు ఓడిపోతారు. ఇది జాతుల మధ్య యుద్ధం కాదు. మనం ప్రస్తుతం చరిత్ర నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నాం. మన ప్రపంచం ఉపద్రవంలో ఉంది. అందుకే ఇజ్రాయెల్‌వైపు అమెరికా నిలవాలి. పశ్చిమాసియాలో ఇరాన్‌ ఉగ్రవాద చర్యలు అమెరికా, ఇజ్రాయెల్, అరబ్‌ స్నేహదేశాలకు ఇబ్బందికరంగా మారాయి. నా దేశాన్ని రక్షించుకునేందుకు, నా దేశ ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చా’ అని నెతన్యాహు పేర్కొన్నారు. ఇదే సమయంలో నెతన్యాహు పసుపు రంగు పిన్ ధరించి హమాస్ చేతిలో ఉన్న ఇజ్రాయెల్ బంధీలకు సంఘీభావం తెలిపాడు.

అయితే, సభలో ఆయనకు తొలుత స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌తోపాటు రిపబ్లికన్‌ సభ్యులు స్వాగతం పలికారు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే లేచి నిల్చుని చప్పట్లతో అభినందించారు. 50 మంది డెమోక్రాట్లు, స్వత్రంత్ర సభ్యుడు బెర్నీ శాండర్స్‌.. నెతన్యాహు ప్రసంగాన్ని బహిష్కరించారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఈ సమావేశానికి రాలేదు. కొంత మంది సభ్యులు గైర్హాజరయ్యారు. 

 

ఇక, అమెరికాలో నెతన్యాహు పర్యటన సందర్భంగా పాలస్తీనా మద్దతుదారులు నిరసనలు తెలిపారు. క్యాపిటల్‌ హౌస్‌ వద్ద నెతన్యాహుకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెతన్యాహు ఓ క్రిమినల్‌ అంటూ నినదించారు. మరోవైపు.. వాషింగ్టన్‌ డీసీలోని వాటర్‌గేట్‌ హోటల్‌లో నెతన్యాహు, అతడి భార్య, ప్రతినిధి బృందంతో కలిసి బస చేశారు. ఈ సందర్భంగా ఆ హోటల్‌ వద్దకు పలువురు పాలస్తీనా మద్దతుదారులు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. పలువురు ఎరుపు రంగు టీషర్టులు ధరించి నిరసనలో పాల్గొన్నారు.

ఇదే సమయంలో నెతన్యాహుపై కోపంతో వాటర్‌ గేట్‌ హోటల్‌లోని బ్యాంకెట్‌ టేబుల్‌, ఇతర అంతస్తుల్లో పాలస్తీనా యూత్‌ మూమెంట్‌కు చెందిన కొందరు వ్యక్తులు.. పురుగులు, మిడతలు వదిలినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. పురుగులు వదిలిన టేబుల్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా జాతీయ జెండాలు కనిపిస్తున్నాయి. దీంతో, ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement