క్వాడ్ భేటీలో అల్బనీస్, బైడెన్, మోదీ, కిషిడా
టోక్యో: పరస్పర విశ్వాసం, చిత్తశుద్ధే క్వాడ్ కూటమి బలమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇండో పసిఫిక్‌ను స్వేచ్ఛాయుత ప్రాంతంగా రూపుదిద్దడంలో ఈ నాలుగు దేశాల కూటమిది కీలక పాత్ర అంటూ ప్రశంసించారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన క్వాడ్ శిఖరాగ్ర సదస్సు మంగళవారం టోక్యోలో జరిగింది. కూటమిని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలు తదితరాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు అల్బనీస్, ఫుమియో కిషిడాలతో మోదీ లోతుగా చర్చించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందన్నారు.
ఉగ్రవాదాన్ని క్వాడ్ శిఖరాగ్రం ముక్త కంఠంతో ఖండించింది. పాకిస్తాన్ పాల్పడ్డ ముంబై, పఠాన్‌కోట్ ఉగ్ర దాడులను తీవ్రంగా నిరసించింది. సీమాంతర దాడులకు ప్రోత్సాహాన్ని, ఉగ్రవాద తండాలకు సైనిక, ఆర్థిక, వ్యూహాత్మక మద్దతును మానుకోవాలని పాకిస్తాన్‌ను ఉద్దేశించి హితవు పలికింది. చైనా విస్తరణవాదాన్ని, పొరుగు దేశాల సరిహద్దుల్లో చొరబడుతున్న తీరును కూడా నిరసించింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు, ఉద్రిక్తతలను పెంచేందుకు జరుగుతున్న ఏకపక్ష ప్రయత్నాలను, కవ్వి ంపు చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొంది. క్వాడ్ నేతలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతరం కిషిడా, అల్బనీస్‌లతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పరస్పర బంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.
పుతిన్‌పై బైడెన్ నిప్పులు
- ఉక్రెయిన్‌పై ఆటవిక యుద్ధానికి తెరతీసి కనీవినీ ఎరగని మానవ సంక్షోభానికి కారకుడయ్యారంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై బైడెన్ మండిపడ్డారు. కిషిడా కూడా రష్యా తీరును తీవ్రంగా నిరసించారు. మోదీ మాత్రం దీనిపై వ్యూహాత్మక మౌనం పాటించారు. సభ్య దేశాల మధ్య ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరాయి.
- సభ్య దేశాల సముద్ర జలాల పరిరక్షణను పరిపుష్టం చేసేందుకు, చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఇండో–పసిఫిక్ మారిటైం డొమైన్ అవేర్‌నెస్ (ఐపీఎండీఏ) ఏర్పాటు
- విపత్తుల సమర్థ నిర్వహణకు హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (హెచ్‌ఏడీఆర్) ఏర్పాటు
- వాతావరణ మార్పుల సమస్యను దీటుగా ఎదు ర్కొనేందుకు క్వాడ్ క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ అం డ్ మిటిగేషన్ ప్యాకేజీ (క్యూ–చాంప్) ఏర్పాటు.
Comments
Please login to add a commentAdd a comment