వాషింగ్టన్: జాత్యాహంకార సందేశాలు అమెరికాలో ఆందోళన రేపుతున్నాయి. మిడిల్ స్కూల్ విద్యార్థులతో పాటు నల్లజాతీయులనే లక్ష్యంగా చేసుకుని బెదిరింపు ఫోన్ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. న్యూయార్క్, అలబామా, కాలిఫోర్నియా, ఒహాయో, పెన్సిల్వేనియా, టెనెసీ వంటి పలు రాష్ట్రాల్లో ఈ ఉదంతాలపై కేసులు నమోదయ్యాయి. సందేశాల్లో వాడిన పదాలు భిన్నంగా ఉన్నా బెదిరింపులు మాత్రం ఒకేలా ఉన్నాయని బాధితులు చెబుతున్నారు.
కొందరిని స్వస్థలం చిరునామా చెప్పాలంటూ బెదిరించగా మరికొందరిని రాబోయే అధ్యక్ష పాలన గురించి హెచ్చరించారు. ఈ సందేశాలపై న్యాయ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఎఫ్‌బీఐ తెలిపింది. ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్, ఫెడరల్, స్టేట్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో కలిసి దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఒహాయో అటార్నీ జనరల్ కార్యాలయం కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.
కించపరిచే వ్యాఖ్యలు
పోలింగ్ జరిగిన గత బుధవారం సాయంత్రం తన 16 ఏళ్ల కుమార్తె ఫోన్‌కు సందేశం వచి్చనట్టు కాలిఫోరి్నయాలోని లోడీకి చెందిన తాషా డన్హామ్ చెప్పారు. ‘‘నా కూతురిని తక్షణం నార్త్ కరోలినాలోని ఒక తోటకు రావాలని ఆదేశించారు. ఆరా తీస్తే అక్కడో మ్యూజియం ఉంది’’అని తెలిపారు. ఈ పరిణామాలు తమను కలవరపరుస్తున్నాయన్నారు. పెన్సిల్వేనియాలోని మాంట్‌గోమెరీ కౌంటీలో ఆరుగురు మిడిల్ స్కూల్ విద్యార్థులకు కూడా ఇలాంటి సందేశాలే అందాయి. దక్షిణ కరోలినాలోని క్లెమ్సన్, అలబామా వంటి పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు తమకూ ఇలాంటి సందేశాలు వచి్చనట్టు చెప్పారు.
పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ టెనెసీలోని నాష్‌విల్లేలో ఉన్న చరిత్రాత్మక నల్లజాతి విశ్వవిద్యాలయం ఫిస్క్ ప్రకటన విడుదల చేసింది. కొంతమంది విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న ఈ సందేశాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయని తెలిపింది. మిస్సోరీ స్టేట్ వర్సిటీ చాప్టర్‌లో సభ్యులుగా ఉన్న నల్లజాతి విద్యార్థులకు కూడా సందేశాలు వచ్చాయి. వాటిలో ట్రంప్ గెలుపును ప్రస్తావించారు. నల్లజాతి విద్యార్థులను పత్తి ఏరడానికి ఎంపిక చేశారంటూ అందులో పేర్కొన్నారని మిస్సోరి ఎన్‌ఏఏసీపీ అధ్యక్షుడు నిమ్రోద్ చాపెల్ చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ సందేశాల వెనుక ఎవరున్నారో ఇంకా తెలియలేదని లాయర్స్ కమిటీ ఫర్ సివిల్ రైట్స్ అండర్ లా డిజిటల్ జస్టిస్ ఇనిషియేటివ్ డైరెక్టర్ డేవిడ్ బ్రాడీ తెలిపారు.
మేరీలాండ్, ఓక్లహామా వంటి 10కి పైగా రాష్ట్రాలతో పాటు డీసీలోనూ ఇలాంటి ఈ ఉదంతాలు చోటుచేసుకున్నట్టు అంచనా వేశారు. దీనిపై తమ ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు చేస్తోందని పోలీసులు తెలిపారు. ఈ విద్వేష ఘటనలపై పలు పౌర హక్కుల చట్టాలను వర్తింపజేయవచ్చని బ్రాడీ చెప్పారు. సదరన్ పావర్టీ లా సెంటర్ ప్రెసిడెంట్, సీఈఓ మార్గరెట్ హువాంగ్ సహా పలు ఇతర పౌర హక్కుల సంస్థల నేతలు ఈ సందేశాలను ఖండించారు. ‘‘విద్వేషాలకు అమెరికాలో స్థానం లేదు. 2024లోనూ బానిసత్వ ప్రస్తావనలు తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. నల్లజాతి అమెరికన్ల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి’’అని ఎన్‌ఏఏసీపీ అధ్యక్షుడు, సీఈఓ డెరిక్ జాన్సన్ ఆందోలన వెలిబుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment