మాస్కో: రష్యా ప్రతిపక్ష రాజకీయ నాయకుడు అలెక్సీ నావల్నీపై విషప్రయోగం జరిగిందని ఆయన అనుచరులు వెల్లడించారు. ఆయన కోమాలో వెళ్ళడంతో, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉంచి, చికిత్స చేస్తున్నారు. నావల్నీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉన్నారు. సైబీరియాలోని టోమ్‌స్క్ నగరం నుంచి మాస్కోకి విమానంలో వెళుతుండగా అనారోగ్యానికి గురవడంతో ఓమ్‌స్క్ నగరంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు నావల్నీ అధికార ప్రతినిధి కిరా యర్మిష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
విమానం ఎక్కే ముందు విమానాశ్రయంలోని కేఫ్‌లో టీ తాగారని, అనుమానాస్పదమైన పదార్థం ఏదైనా టీలో కలిపి ఉంటారని ఆమె వెల్లడించారు. విమానంలో నావల్నీకి చెమటలు పట్టడం ప్రారంభమైందనీ, బాత్‌రూంలోకి వెళ్ళి స్పృహ కోల్పోయారని వెల్లడించారు. తీవ్ర వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి పుతిన్, ఘోరంగా వ్యవహరిస్తున్నారని నావల్నీ సన్నిహితుడు వ్లాదిమిర్ మిలో ట్వీట్ చేశారు. నావల్నీపై విషప్రయోగం జరిగిందనే విషయాన్ని పోలీసులు అంగీకరించడం లేదని అధికార మీడియా సంస్థ టాస్ పేర్కొంది. గతంలో కూడా నావల్నీపై అనుమానిత విషప్రయోగం జరగ్గా ఆసుపత్రి పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment